- గీతం యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జేడీ ప్రభాకర్
వనపర్తి టౌన్, వెలుగు : విద్యారంగానికి బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించి, ప్రభుత్వ విద్యను కాపాడాలని గీతం యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జేడీ ప్రభాకర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని యాదవ సంఘం భవనంలో పీడీఎస్ యూ జిల్లా నాలుగో మహాసభ నిర్వహించారు. ఈ సభకు పీడీఎస్ యూ జిల్లా నాయకుడు దినేశ్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర కార్యదర్శి ఎస్.అనిల్, జేడీ ప్రభాకర్ ముఖ్యఅతిథులుగా హాజరై ప్రసంగించారు.
ఉస్మానియా యూనివర్శిటీ కేంద్రంగా పీడీఎస్ యూ విద్యార్థి సంఘం పురుడుపోసుకొని 50 ఏండ్లుగా విద్యారంగ సమస్యలపై పోరాటం చేస్తోందన్నారు. నేటికీ రాష్ట్రంలో డీఈవో, ఎంఈవో పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల ప్రభుత్వ పాఠశాల విద్యపై పర్యవేక్షణ లేక అస్తవ్యస్థంగా మారాయిని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న డీఈవో, ఎంఈవో తదితర పోస్టులను వెంటనే భర్తీ చేసి విద్యాభివృద్దికి తోడ్పాటు అందించాలని కోరారు.
అనంతరం పీడీఎస్ యూ జిల్లా నూతన అధ్యక్షుడిగా దినేశ్, ప్రధాన కార్యదర్శిగా గణేశ్, కోశాధికారి గోవర్ధన్ తోపాటు 11 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సభలో నాయకులు అరుణ్ కుమార్, వెంకటనారాయణ, గణేశ్, రాజు, కురుమయ్య, అరుణ్, గోవర్ధన్, కృష్ణవేణి పాల్గొన్నారు.
