Allu Arjun Birthday: బన్నీని చూసేందుకు ఎగబడ్డ ఫ్యాన్స్.. అదుపు చేసిన పోలీసులు

Allu Arjun Birthday: బన్నీని చూసేందుకు ఎగబడ్డ ఫ్యాన్స్..  అదుపు చేసిన పోలీసులు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇవాళ (ఏప్రిల్ 8, 2026న) తన 44వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. భారతీయ సినిమాకు వందేళ్ల చరిత్ర ఉండగా, అందులో తెలుగు సినిమాకు దాదాపు 90 ఏళ్ల గొప్ప వారసత్వం ఉండటం ప్రత్యేకం. ఆ సినీ వారసత్వంలో అల్లూ అర్జున్ తన ప్రత్యేకమైన నటనతో కొత్త మైలురాయిని నెలకొల్పి ఐకాన్ స్టార్ అయ్యాడు. తన స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్, నటనతో ఆయన తన పేరునే ఒక బ్రాండ్‌గా మలుచుకొని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే తెలుగు సినీ పరిశ్రమ తరఫున, నేషనల్ అవార్డు (National Film Award) అందుకున్న తొలి హీరోగా అల్లూ అర్జున్ నిలవడం చారిత్రాత్మక ఘట్టం. 

ప్రత్యేకంగా పుష్ప 2: ది రూల్ సినిమాతో అల్లూ అర్జున్ పాన్-ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1740.95 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించగా, ఇండియా వైడ్‌గా రూ.1234 కోట్ల షేర్ వసూళ్లు నమోదు చేసింది. ముఖ్యంగా బాలీవుడ్ మార్కెట్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచి టాలీవుడ్ స్థాయిని మరింత పెంచింది.

ఈ విజయాలతో అల్లూ అర్జున్ సినీ ప్రయాణం.. ఆయనకు చెరగని స్థానం సంపాదించి పెట్టింది. అందుకే ఆయన పుట్టినరోజు అంటే అభిమానులకు మాత్రమే కాకుండా మొత్తం సినీ ప్రేక్షకులకు ఒక పండుగలా మారింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా సినీ స్టార్స్, ఫ్యాన్స్  సోషల్ మీడియా వేదికగా బర్త్‌‌‌‌డే విషెస్ తెలియజేస్తున్నారు.

జూబ్లీ హిల్స్‌లో పోటెత్తిన జనాలు:

బర్త్ డే సందర్భంగా, అర్ధరాత్రి తమ అభిమాన నటుడు అల్లు అర్జున్ చూడాలని ఫ్యాన్స్ హైదరాబాద్‌లోని తన నివాసం వద్ద సందడి చేశారు. బన్నీని ఒక్కసారి చూడటానికి అభిమానులు భారీగా గుమిగూడారు. బన్నీని ఒక్కసారి చూడాలనే ఉత్సాహంతో పరిసరాలు కిక్కిరిసిపోయాయి. అభిమానుల రద్దీ కారణంగా జూబ్లీ హిల్స్ ప్రాంతంలో కొంతసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు రంగంలోకి దిగి భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. అభిమానులను నియంత్రిస్తూ ట్రాఫిక్‌ను సక్రమంగా నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా AA22xA6 అప్డేట్స్ మధ్య ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్ మరింత హైలైట్‌గా మారాయి.

వైరల్ అవుతున్న వీడియోల్లో, అల్లు అర్జున్ నల్లటి టీ-షర్ట్, తెల్లటి ప్యాంట్‌లో స్టైలిష్‌గా కనిపించారు. అభిమానులకు చేయి ఊపుతూ, కృతజ్ఞతలు తెలిపిన ఆయన, శబ్దాన్ని కొద్దిగా తగ్గించాలని కోరారు. కొంతసేపు అభిమానులతో గడిపిన తర్వాత తిరిగి ఇంటి లోపలికి వెళ్లారు. అభిమానుల్లో కొందరు పుష్ప స్టైల్‌ వేషధారణతో వచ్చి సందడి చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

ఇదే సందర్భంగా బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ తన బాల్కనీ నుండి అభిమానుల సందడిని వీడియోగా పంచుకుంటూ, “మిమ్మల్ని ఎల్లప్పుడూ ఇలాగే ఘనంగా సన్మానించాలి” అని ఇంస్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు. అభిమానులు ఫ్లాష్‌లైట్లు వెలిగిస్తూ తమ అభిమానాన్ని వ్యక్తం చేసిన ఫోటోలు ఆకట్టుకున్నాయి.

అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే, అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న AA22xA6 పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్‌లో దీపికా పదుకునే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అల్లు అర్జున్–దీపికా మొదటిసారి కలిసి నటిస్తున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు టైటిల్ పోస్టర్ మరియు ఫస్ట్ లుక్ విడుదల కానుంది. పాన్-ఇండియా స్థాయిని దాటి పాన్-వరల్డ్ లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం 2027లో బహుభాషల్లో విడుదల కానుంది.