స్మార్ట్ గా కొట్టేస్తున్నరు.. జాగ్రత్త

స్మార్ట్ గా కొట్టేస్తున్నరు.. జాగ్రత్త

హైదరాబాద్,వెలుగులోకల్ గ్యాంగ్స్ అంతర్రాష్ట్ర ముఠాలతో కలిసి సెల్ ఫోన్ల చోరీలు చేస్తున్నాయి. ఖరీదైన స్మార్ట్ ఫోన్లనే టార్గెట్ చేసిన స్నాచర్లు ప్రతీ రోజు సుమారు 20కి పైగా మొబైల్స్ ను కొట్టేస్తున్నారు.

సెకండ్ సేల్ వ్యాపారులే రిసీవర్లు..

ఆర్టీసీ బస్సుల్లో జేబు దొంగతనాలు చేసే పిక్ పాకెటర్లు ఇప్పుడు సెల్ ఫోన్లను చోరీ చేస్తున్నారని పోలీసుల కేస్ స్టడీస్ చెబుతున్నాయి. చైన్ స్నాచింగ్స్ తో రిస్క్ ఎక్కువ కావడంతో సెల్ ఫోన్లను టార్గెట్ చేస్తున్నారు. రోడ్లపై నడిచే పాదచారుల దగ్గరి నుంచి బస్సు,ట్రైన్ ప్యాసింజర్స్ తో పాటు కూరగాయల మార్కెట్స్,టెంపుల్స్, రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్ లో మొబైల్ చోరీలకు ప్లాన్ చేస్తున్నారు. నలుగురు సభ్యులకు తగ్గకుండా సిటీలో మొత్తం18 గ్యాంగ్స్ సెల్ ఫోన్ చోరీలు చేస్తున్నాయి.  రూ.10 వేల  కంటే ఎక్కువ విలువ చేసే స్మార్ట్ ఫోన్లనే వీరు సెలక్ట్ చేసుకుంటున్నారు. ఇందుకు కారణం ఎక్కువ రేటున్న ఫోన్లను కొట్టేసినా వాటిని అమ్మడం పిక్ పాకెటర్లకు సాధ్యం కావడం లేదు. కొట్టేసిన సెల్ ఫోన్లను ఇతర రాష్ట్రాల్లోని రిసీవర్లకు తరలిస్తున్నారు. తాము దొంగిలించిన ఫోన్లు ఎలాంటివైనా సరే రూ.2వేల నుంచి 5వేల వరకు బ్రాండ్ ను బట్టి రేట్ ఫిక్స్ చేస్తున్నారు. అబిడ్స్ జగదీశ్ మార్కెట్ తో పాటు సికింద్రాబాద్ హాంకాంగ్ బజార్ లోని సెకండ్ సేల్ వ్యాపారులను తమ రిసీవర్లుగా మార్చుకున్నారు. ఇలా ఈ ముఠా నుంచి సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్లను కొన్న వ్యాపారులు ఆ  ఫోన్ లో సిమ్ కార్డ్ వేయకుండా డిస్ ప్లే పెట్టి అమ్మేస్తున్నారు.

మెట్రో సిటీల్లో అంతర్రాష్ట్ర ముఠాలు

స్మార్ట్ ఫోన్ల చోరీల కోసం  అంతర్రాష్ట్ర ముఠాలు మెట్రో సిటీలను టార్గెట్ చేశాయి. హైదరాబాద్ తో పాటు బెంగళూర్,చెన్నై లాంటి సిటీల్లో ఢిల్లీ, యూపీ, బిహార్, ముంబయి గ్యాంగ్స్ వరుస చోరీలు చేస్తున్నాయి. ఈ గ్యాంగ్స్ నుంచి ఐదుగురికి మించకుండా  టూరిస్టుల్లా సిటీకి వచ్చి  రైల్వే స్టేషన్లు,శివారు ప్రాంతాల్లోని లాడ్జీల్లో షెల్టర్ తీసుకుంటున్నాయి.  రద్దీ ప్రాంతాల్లోని బస్సు రూట్లను సెలక్ట్ చేసుకుని రెక్కీ నిర్వహిస్తాయి. నలుగురు సభ్యుల ముఠా ఫుట్ బోర్డ్ పై నిల్చుంటుంది. టార్గెట్ చేసిన వ్యక్తి చుట్టూ నిల్చుని తమకు తాము అలర్ట్ అవుతూ సెల్ ఫోన్ కొట్టేసి అక్కడే ఉన్న మరో దొంగ చేతికి అందిస్తారు. ఆ తర్వాత అందరూ అక్కడి నుంచి పారిపోతారు.

కొరియర్లు..పార్సిల్స్ తో ట్రాన్స్ పోర్ట్

ఇలా చోరీ చేసిన స్మార్ట్ ఫోన్ ను నిమిషాల వ్యవధిలోనే ఈ దొంగల ముఠాలు స్విచ్ ఆఫ్ చేస్తాయి. ఆ తర్వాత మరో ఏరియాకి వెళ్లి మరికొన్ని స్మార్ట్ ఫోన్లను చోరీ చేస్తున్నాయి అంతరాష్ట్ర ముఠాలు. ఇలా పోలీసులు అలర్ట్ అయ్యే లోపు ఒకే రోజులో 50కి పైగా ఫోన్లు కొట్టేసి ఓ రోజంతా లాడ్జీలో గడుపుతారు.  కొట్టేసిన స్మార్ట్ ఫోన్లలోని  సిమ్ కార్డులను బ్రేక్ చేసి రోడ్లు,మురికి కాలువల్లో పడేస్తారు. తమ ఆధీనంలో ఉన్న సెల్ ఫోన్స్ ను ఎవ్వరికీ అనుమానం రాకుండా మెడిసిన్ బాక్సులు,ఎలక్ట్రానిక్ బాక్సుల్లో ప్యాక్ చేసి ఉంచుతారు.  తర్వాతి రోజు మళ్ళీ స్నాచింగ్స్ చేసి సిటీ వదిలి పారిపోతారు. ఇలా మూడు రోజుల్లోనే సుమారుగా 100 ఫోన్లకి తగ్గకుండా కొట్టేసి అంతరాష్ట్ర ముఠాలు ఎస్కేప్ అవుతున్నాయి. ఒక్క హైదరాబాద్ మాత్రమే కాకుండా ఢిల్లీ, బెంగళూర్,చెన్నై లాంటి మెట్రోనగరాలనే ఈ అంతర్రాష్ట్ర ముఠాలు టార్గెట్ చేశాయని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.