దేవుడి భూముల్లో దొంగలు పడ్డరు కాపాడే సిబ్బంది లేరు

దేవుడి భూముల్లో  దొంగలు పడ్డరు  కాపాడే సిబ్బంది లేరు

 

  •     భద్రాచల రామయ్యకు ఉన్న 1,347 ఎకరాల్లో మిగిలింది 220 ఎకరాలే
  •     మిగిలినవన్నీ కబ్జాలపాలు
  •     చేష్టలుడిగిన ఎండోమెంట్​శాఖ

ఖమ్మం, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా  దేవాదాయ శాఖ భూముల్లో దొంగలు పడ్డారు. వేల ఎకరాల భూములను కాజేశారు. ఎండోమెంట్​ రికార్డుల్లో భూములు కనిపిస్తున్నా, ఫీల్డ్​లెవెల్​లో మాత్రం మాయమయ్యాయి. భూములకు పక్కనే ఉన్న రైతులు కొంత కలుపుకోగా, పదేండ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్​ నేతలు ధరణి పేరుతో మరికొన్నింటిని కొట్టేశారు. మొత్తం దేవాదాయ శాఖకు చెందిన 90 వేల ఎకరాలకు గాను 50 వేల ఎకరాలు మాత్రమే ధరణిలో నమోదయ్యాయి. మరో 40 వేల ఎకరాలు ఎవరి పేరుతో ధరణిలో ఎంట్రీ అయ్యాయో లెక్కతేలడం లేదు. ఆక్రమణలను గుర్తించిన చోట్ల, భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు దేవాదాయ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్న సమయంలో వారిపైన దాడులు జరుగుతున్నాయి. సర్వే చేసి, భూములకు హద్దులు నిర్ణయించి దేవాలయ భూములుగా బోర్డులు పెడితే, రాత్రికి రాత్రే తీసేస్తున్నారు. దీంతో ఎండోమెంట్ ఆఫీసర్లకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. 

పర్యవేక్షణ లోపం వల్లే.. 

దేవాదాయ శాఖ భూములు అన్యాక్రాంతం కావడానికి ప్రధానంగా సిబ్బంది పర్యవేక్షణ లోపమే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలయాల వారీగా మాన్యం భూములను సర్వే చేయించి, వాటి చుట్టూ హద్దురాళ్లను ఏర్పాటు చేయడం, ఫెన్సింగ్ లాంటివి ఏర్పాటు చేసే పరిస్థితి కూడా లేదు. ఫీల్డ్ లెవెల్​లో టెంపుల్​కు చెందిన ఎండోమెంట్ ఆఫీసర్​ (ఈవో)లే భూములకు కూడా బాధ్యత వహిస్తున్నారు. ఆయా భూముల మీద వచ్చే నామమాత్రం కౌలు డబ్బులను ధూప, దీప, నైవేద్యాల ఖర్చుల కోసం వాడుతున్నారు. డివిజన్, జిల్లా స్థాయిలో అధికారులకు దేవాలయ భూముల్లో బోర్డులు పెట్టడం తప్పించి, భూములు కబ్జా కాకుండా చర్య తీసుకునే అధికారం లేదు. భూముల సర్వే కోసం సర్వే అండ్​ల్యాండ్స్​డిపార్ట్ మెంట్ అధికారులను, రెవెన్యూ అధికారులను, కబ్జాదారులను ఖాళీ చేయించేందుకు పోలీసులపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఇక అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఆలయ భూముల్లో మట్టి తోలకాలు జరుగుతున్నా, మొత్తం భూములనే మాయం చేస్తున్నా ఈవోలు చూసీ చూడనట్టు వ్యవహరించడంతో మొదటికే మోసం వస్తోంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెర్వు శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి చెందిన 18.25 ఎకరాల భూమిలో రెండేండ్ల కింద 3.6 లక్షల మెట్రిక్​ టన్నుల మట్టిని స్థానిక బీఆర్ఎస్​నేత అక్రమంగా తరలించారు. మట్టి తరలింపును మొదట్లోనే ఈవో అడ్డుకుంటే, 18 ఎకరాల భూమి గుల్లయ్యేది కాదు. 

40శాతం భూములు ఎంటర్​కాలే..

రాష్ట్రవ్యాప్తంగా ఆలయ మాన్యం భూములు ఉన్న సర్వే నెంబర్లను నిషేధిత జాబితాలో చేర్చాలని రెవెన్యూ ఆఫీసర్లను దేవాదాయ శాఖ కోరింది. అయినా ధరణిలో 40 శాతం భూములు ఎంట్రీ కాలేదు. ఎంట్రీ అయిన భూముల్లో కూడా ఫీల్డ్ పొజిషన్​లో కబ్జాలు జరుగుతున్న విషయాన్ని ఈవోలు సకాలంలో గుర్తించడం లేదు. ఆలయ భూములను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న వారే అన్యాక్రాంతం చేస్తున్నా, పక్కనున్న రైతులు తమ భూముల్లో కలుపుకుంటున్నా, చర్యలు తీసుకునే పరిస్థితి ఉండడం లేదు. క్షేత్రస్థాయిలో భూముల పరిస్థితి గురించి ఉన్నతాధికారులు కూడా పట్టించుకోకపోవడంతో రూ.కోట్ల విలువైన భూములు కబ్జాదారుల పాలవుతున్నాయి. 
  ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడులోని శ్రీయోగానంద లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి చెందిన 512.13 ఎకరాలకు సంబంధించి హక్కుల వివాదముంది. దేవాలయం పేరుతో పట్టాదారు పాస్​బుక్​నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించగా, వరంగల్ రెవెన్యూ అధికారుల దగ్గర ప్రస్తుతం ఇష్యూ పెండింగ్ లో ఉంది. ఈ భూములన్నీ ప్రస్తుతం ఇతరుల ఆధీనంలో ఉన్నాయి. 

  ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయానికి 123.10 ఎకరాల భూములుడగా, మొత్తం ఆక్రమణలోనే ఉన్నాయి. ఈ భూములపైనా ఎండోమెంట్స్​ ట్రిబ్యునల్​లో కేసులు నడుస్తున్నాయి. 
  ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని ముష్టికుంట్లలో ఉన్న శ్రీశంభులింగేశ్వర, శ్రీకోదండ రామ ఆలయాలకు 135.19 ఎకరాల మాన్యం భూములుండగా, మొత్తం భూమి ఇతరుల ఆక్రమణలోనే ఉంది. 
  ఖమ్మం నగరంలోని గుంటి మల్లేశ్వరస్వామి ఆలయానికి చెందిన 6.05 ఎకరాల అత్యంత ఖరీదైన భూమి అన్యాక్రాంతమైంది. 
  ఖమ్మం ఖిల్లా బజార్​ లోని శ్రీలక్ష్మీనరసింహస్వామి టెంపుల్​ కు చెందిన 11.26 ఎకరాల భూమి కూడా ఇతరుల కబ్జాలో ఉంది. 

భద్రాచలం శ్రీసీతారాచంద్ర స్వామికి మొత్తం 1347.11 ఎకరాల భూములున్నాయి. ఇందులో ప్రస్తుతం 220 ఎకరాలు మాత్రమే దేవస్థాన ఆధీనంలో ఉన్నాయి. మిగిలిన 1126.28 ఎకరాలు కబ్జాలపాలయ్యాయి. ఈ భూములను తిరిగి దక్కించుకునేందుకు హైదరాబాద్​లోని ఎండోమెంట్స్​ట్రిబ్యునల్​లో కేసులు నడుస్తున్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు. ప్రస్తుత విలీన ఆంధ్రప్రదేశ్​ఎటపాక మండలం పురుషోత్తపట్నంలో 917 ఎకరాలను సోమరాజు పురుషోత్తమదాసు అనే భక్తుడు 1878 రిజిస్ట్రార్​వీలునామా ప్రకారం ఆలయానికి దానం చేశారు. ప్రస్తుతం ఆ భూములు ఆంధ్రలో ఉండడంతో అక్కడి భూములను దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో, లోకల్​ ఆఫీసర్ల అండదండలతో, పొలిటికల్​ లీడర్లు కలిసి దేవస్థానం సిబ్బందిపై దాడులు చేస్తున్నారు. 40కు పైగా ఫిర్యాదులు చేసినా ఆంధ్రా పోలీసులు ఆక్రమణదారులపై కేసులు నమోదు చేయడం లేదు. మిగిలిన చోట్ల భూములు ఉన్నా కౌలు వస్తోంది. కానీ, పురుషోత్తపట్నం భూముల నుంచే దేవస్థానానికి కౌలు రావడం లేదు.