వానల్లేక రైతులు పరేషాన్​.. ఇట్లయితే సగం పడావే!

వానల్లేక రైతులు పరేషాన్​.. ఇట్లయితే సగం పడావే!
  • రాష్ట్రంలోని 23 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు
  •     పునాస పంటలపై  ఆశలు వదిలేసుకుంటున్న రైతులు
  •     కోటిన్నర ఎకరాలు టార్గెట్  పెట్టుకున్న వ్యవసాయ శాఖ
  •     ఇప్పటికీ సాగైంది 50 లక్షల ఎకరాల్లోపే..
  •     పరిస్థితి ఇలాగే ఉంటే 30 నుంచి 50 లక్షల ఎకరాలపై ఎఫెక్ట్​


ఖమ్మం/ భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: రాష్ట్ర రైతులతో వానలు దోబూచులాడుతున్నాయి. జులై రెండో వారం గడుస్తున్నా సరైన వర్షాలు లేకపోవడంతో సాగు చతికిలపడింది.  ఏకంగా 23  జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 51 శాతం లోటు వర్షపాతం ఉన్నట్లు వాతవారణ శాఖ ప్రకటించింది. ఆ తర్వాత జగిత్యాల, నిజామాబాద్​, హన్మకొండ, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్​, ఆదిలాబాద్​, కరీంనగర్​, మహబూబ్ నగర్​, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సాధారణం కంటే 30 శాతం  తక్కువ వానలు పడ్డాయి. పునాస పంటలకు అదను దాటిపోతోంది. ఈ నెల మొదటి వారంతోనే పత్తి, కంది, వేరుశనగ  విత్తనాలు వేయా ల్సి ఉన్నా వర్షాల్లేక చాలాచోట్ల వేయలేదు. ఇప్పటికే వేసిన పత్తి చేన్లు ఎండిపోతున్నాయి. అటు నీళ్లు లేక వరి నార్లు పోసుకోలేని పరిస్థితి. నిజానికి రాష్ట్రంలో ఈసారి కోటిన్నర ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. 75 లక్షల ఎకరాల్లో పత్తి, 50 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని భావించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 50 శాతం మేర పునాస పంటల సాగు తగ్గింది. మరోవారం ఇదే పరి స్థితి ఉంటే 30 లక్షల నుంచి 50 లక్షల ఎకరాలు పడావు పడాల్సి రావచ్చని  ​ఆఫీసర్లు చెప్తున్నారు.

జూన్​ నెలే కీలకం కానీ.. 

వానాకాలం పంటల సాగుకు జూన్​ నెలలో పడే వర్షాలే కీలకం. ప్రతి ఏడాది మే నెలలోనే వానాకాలం పంటలకు సంబంధించి పొలం పనులను రైతులు మొదలుపెడతారు. అంతకు ముందు పంట అవశేషాలను భూమిలో కలియదున్నడంతోపాటు అడపాదడపా పడే  వర్షాల వల్ల వచ్చే తేమతో వేసవి దుక్కులు చేస్తారు. జూన్​ నెలాఖరు వరకు విత్తనాలు విత్తుతారు. కానీ, కొన్నేండ్లుగా  ఎల్​నినో ఎఫెక్ట్​ వల్ల నైరుతి రుతుపవనాలపై తీవ్ర ప్రభావం పడుతోంది.  వర్షాకాలంలోనూ తుపాన్లు వస్తే తప్ప వానలు కురవడం లేదు. తెలంగాణ వచ్చాక అడపాదడపా తుపాన్లు ఆదుకున్నాయి. కానీ, ఈ ఏడాది తరహా పరిస్థితులు ఇప్పటివరకు ఎదురుకాలేదు. వర్షాలు సకాలంలో కురవకపోవడం, ప్రాజెక్టులు, చెరువుల్లో నీటి మట్టం తగ్గిపోవడం,  భూగర్భ జలాలు పడిపోతుండడంతో ఈ వానాకాలం పంటల సాగుపై ప్రభావం పడింది. కెనాల్​ నీరు రాకపోవడంతో అనేకచోట్ల ఇప్పటికీ వరి నార్లు పోసుకోలేని పరిస్థితి నెలకొంది. 

  ఇప్పటికి సాగైంది మూడోవంతే.. 

వానాకాలం సీజన్‌‌లో శుక్రవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖాధికారులు చెప్తున్నారు. ఈ సీజన్​లో రాష్ట్ర సాధారణ సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలు కాగా,  కోటిన్నర ఎకరాల్లో సాగు చేయాలని వ్యవసాయశాఖ టార్గెట్ పెట్టుకుంది. కానీ శుక్రవారం నాటికి లక్ష్యంలో మూడోవంతు మాత్రమే రీచ్​ అయినట్లు తెలుస్తోంది.  పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.59 లక్షల ఎకరాలు కాగా, ఈయేడు 75లక్షల ఎకరాల్లో సాగు చేయాలనుకున్నారు. ఇప్పటివరకు 32 లక్షల ఎకరాల్లో మాత్రమే పత్తి విత్తనాలు వేసినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. వరి సాధారణ సాగు విస్తీర్ణం 50లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 3 లక్షల ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 9.5 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 3 లక్షల ఎకరాల్లో, మక్క సాధారణ సాగు విస్తీర్ణం 7 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.5 లక్షల ఎకరాల్లో సాగైనట్లు తెలుస్తోంది. 

వర్షపాతం లెక్కలివి..

రాష్ట్రంలో జులై 14 నాటికి సాధారణ వర్షపాతం 221.2 మిల్లీమీటర్లు కాగా, ఈ సారి 174.1 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. ఈ లెక్కల ప్రకారం సాంకేతికంగా 21 శాతం మాత్రమే లోటు అనిపిస్తున్నా, మండలాల వారీగా చూస్తే మాత్రం ఎక్కువ లోటు కనిపిస్తోంది. 33 జిల్లాలకు 23 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 20 నుంచి 59 శాతం వరకు తక్కువ పడితే లోటు అని, 59 నుంచి 99 శాతం వరకు తక్కువ కురిస్తే తీవ్రమైన లోటుగా పరిగణిస్తారు. వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారం ఆదిలాబాద్, కుమ్రం భీమ్​, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, నాగర్ కర్నూలు, వనపర్తి, సూర్యాపేట, ఖమ్మం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్ నగర్, జగిత్యాల, జోగులాంబ గద్వాల, హైదరాబాద్ జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో 612 మండలాలుండగా, 313 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. 29 మండలాల్లో లోటు అతి తీవ్రంగా ఉంది. 207 మండలాల్లోనే సాధారణ వర్షపాతం రికార్డయింది.

అదను దాటి పోతోంది..సాగు ముందర పడట్లే

వానలు వస్తాయని పత్తి విత్తనాలు పెట్టినం. వర్షాల్లేక సగమే మొలకలు వచ్చాయి. రూ.20 వేలు ఖర్చు పెట్టి దుక్కులు దున్ని, వరి నారు పోసిన. మోటారు నీళ్లతో నారు పెంచుతున్నాం. పొలం దుక్కి దున్నాలంటే ఉన్న నీళ్లు సరిపోవు. రెండు వారాల్లో మంచి వానలు పడితేనే ఇప్పుడున్న వరి నారు ఉపయోగపడుతుంది. లేదంటే పనికిరాదు. 
‌‌‌‌ - యడ్ల సుబ్బారావు, రైతు, పెనుబల్లి

ఆందోళన చెందొద్దు 

జూన్​ 9వ తేదీ నుంచి సెప్టెంబర్​ చివరి వరకు వానలు పడతాయి. సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ చెప్పింది. రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదు. రైతులు.. అగ్రికల్చర్​ ఆఫీసర్ల సూచనలు పాటిస్తూ విత్తుకోవాల్సి ఉంది.
- అభిమన్యుడు, జిల్లా అగ్రికల్చర్​ఆఫీసర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా