అమర్నాథ్ యాత్రలో కొనసాగుతున్న సహాయక చర్యలు

అమర్నాథ్ యాత్రలో కొనసాగుతున్న  సహాయక చర్యలు

అమర్ నాథ్ యాత్రలో జరిగిన విషాదంలో మృతుల సంఖ్య 16కు చేరింది. వరదల్లో మరో 40 మంది గల్లంతవ్వగా వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు NDRF డీజీ అతుల్ కర్వాల్. ప్రస్తుతానికి స్పాట్ లో కొండచరియలు విరిగి పడట్లేదన్నారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా.. సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకం లేదన్నారు. NDRFతో పాటు ఆర్మీ, SDRF, CRPF, ఇతర భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 

ఆకస్మిక వరదల్లో అమర్ నాథ్ గుహ దగ్గర వేలాది మంది చిక్కుకున్నారు. ఇప్పటి వరకు 15 వేల మంది యాత్రికులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు ఇండో టిబెట్ బార్డర్ అధికారులు. వరదల వల్ల దాదాపు 65 మంది గాయపడ్డారు. వారిని IAF హెలికాప్టర్ల ద్వారా హాస్పిటల్స్ కు తరలించారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ MI 17 చాపర్ ద్వారా డెడ్ బాడీలను శ్రీనగర్ కు తరలించారు. అమర్ నాథ్ గుహ దగ్గర చిక్కుకున్న వారిని పంచతరణి బేస్ క్యాంపుకు తరలించారు.

దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లోని మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు జూన్ 30 నుంచి అమర్ నాథ్ యాత్ర ప్రారంభమైంది. విడతల వారీగా నిత్యం వేలాది మంది భక్తులు ఈ యాత్రకు బయల్దేరతారు. అయితే శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసి.. వరద పోటెత్తింది. క్షణాల్లోనే కొండల పై నుంచి భారీగా వరద ముంచెత్తింది. పెద్ద పెద్ద రాళ్లు, బురద కొట్టుకొచ్చాయి.  దీంతో యాత్రికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణ భయంతో పరుగులు తీయడంతో.. తొక్కిసలాట జరిగింది. అనేక మంది గాయపడ్డారని తెలిపారు అధికారులు. అమర్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.

అమర్ నాథ్ యాత్రలో చిక్కుకున్న యాత్రికతుల్ని రక్షించేందుకు చినార్ కార్ప్స్ తీవ్ర ప్రయత్నం చేస్తుంది. అమర్ నాథ్ దగ్గర చిక్కుకున్న భక్తుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది చినార్ కార్ప్స్. భారత ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ బెటాలియన్.. కశ్మీర్ వ్యాలీలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. యాత్రికులతో మాట్లాడి వారి యోగక్షేమాలు కనుక్కున్నారు చినార్ కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ ADS ఔజ్లా. అత్యధునిక పరికరాలతో వరద ప్రభావిత ప్రాంతాల్లో గాలింపు కొనసాగిస్తోంది చినార్ కార్ప్స్.

వరదల వల్ల ఇబ్బందులు పడకుండా జమ్ముకశ్మీర్ అధికార యంత్రాంగం ప్రత్యేక సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. శ్రీ అమర్ నాథ్ క్షేత్రం బోర్డుతో కలిసి విపత్తుకు సంబంధించిన సమాచారం అందించేందుకు 4 హెల్ప్ లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. వాతావరణం బాగోలేదని మూడ్రోజుల క్రితం యాత్రను నిలిపివేశారు. వాతావరణం మెరుగుపడటంతో.. ఒక్క రోజులోనే యాత్ర తిరిగి ప్రారంభించారు. జమ్ము-కశ్మీర్ పరిధిలోని హెల్త్ సిబ్బందికి లీవ్స్ క్యాన్సిల్ చేశారు. సెలవుల్లో ఉన్నా.. వెంటనే డ్యూటీల్లో చేరాలని.. అందరు ఆఫీసర్లు ఫోన్లలో అందుబాటులో ఉండాలని చెప్పారు అధికారులు.