ఈ ఏడాది కూడా అమర్‌నాథ్‌ యాత్ర రద్దు 

ఈ ఏడాది కూడా అమర్‌నాథ్‌ యాత్ర రద్దు 


జూన్ నెల 28 నుంచి ప్రారంభం కావాల్సిన అమర్‌నాథ్‌ యాత్ర మళ్లీ రద్దైంది. కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది కూడా యాత్రను రద్దు చేస్తున్నట్టు జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా కార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది యాత్ర కోసం ఏప్రిల్‌ 1నుంచి నమోదు ప్రక్రియ మొదలు పెట్టినప్పటికీ కరోనా సెకండ్‌ వేవ్‌ ఉగ్రరూపంతో రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా నిలిపివేశారు.

అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్రం బోర్డు సభ్యులతో చర్చించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయం. ప్రజల ప్రాణాలు కాపాడటమే ముఖ్యమని.. వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది కూడా యాత్రను రద్దు చేస్తున్నట్టు ట్విటర్‌లో తెలిపింది. యాత్ర రద్దైనప్పటికీ ఎప్పటిలాగే ఆలయంలో సంప్రదాయ పూజా కార్యక్రమాలు కొనసాగుతాయంది.