అమర్‌నాథ్ యాత్రలో అపశృతి.. బ్యాలెన్స్ తప్పి వ్యక్తి మృతి

అమర్‌నాథ్ యాత్రలో అపశృతి.. బ్యాలెన్స్ తప్పి వ్యక్తి మృతి

బీహార్‌కు చెందిన ఓ అమర్‌నాథ్ యాత్రికుడు ఆగస్టు 18న రాత్రి కాళీ మాత మోర్‌కు సమీపంలో ఉన్న ట్రాక్‌పై పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మరొకరు కూడా గాయపడ్డారని అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఇద్దరు యాత్రికులు పవిత్ర గుహ నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. "వారు బ్యాలెన్స్ కోల్పోయి ట్రాక్‌పై పడిపోయారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మరణించారు, మరొకరికి గాయాలయ్యాయి" అని వివరించారు. రెస్క్యూ టీం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం అతని మృతదేహాన్ని బల్తాల్ బేస్ క్యాంపు ఆసుపత్రికి తరలిస్తున్నట్లు సమాచారం.

మృతుడు బీహార్‌కు చెందిన విజయ్‌కుమార్‌గా గుర్తించగా, గాయపడిన వారిని బీహార్‌కు చెందిన మమత కుమారిగా గుర్తించారు. గాయపడిన యాత్రికురాలు ప్రస్తుతం బ్రారిమార్గ్ బేస్ క్యాంపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నదని, ఆమె పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు చెప్పారు. ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రలో ఇది రెండో మరణం. ఆగస్టు 15న ఢిల్లీకి చెందిన 65 ఏళ్ల యాత్రికుడు గుండెపోటుతో మరణించారు.

అమర్‌నాథ్ యాత్ర అనేది జమ్మూ- కాశ్మీర్‌లోని పవిత్ర గుహ పుణ్యక్షేత్రమైన అమర్‌నాథ్‌కు జరిగే వార్షిక తీర్థయాత్ర. ఈ యాత్ర జూలై 1న ప్రారంభమై ఆగస్టు 15న ముగిసింది. ఈ ఏడాది 4.5 లక్షల మంది యాత్రికులు యాత్ర కోసం నమోదు చేసుకున్నారు. పర్వతాల గుండా ట్రెక్కింగ్ చేయడం వల్ల యాత్ర అత్యంత సవాలుతో కూడుకుంటుంది. కాబట్టి యాత్రికులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదాల గురించి తెలుసుకోవాలని అధికారులు సూచించినా.. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరం.