ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అమెజాన్ సీఈఓ

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అమెజాన్ సీఈఓ

అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా నిలిచారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. బుధవారం ఆయన సంపద 5.22 బిలియన్ డాలర్లు పెరగడంతో.. ఆయన నికర సంపద విలువ 202 బిలయన్ డాలర్లకు చేరింది. గత ట్రేడింగ్ సెషన్లో అమెజాన్ స్టాక్ విలువ రెండు శాతం పెరిగడంతో అతని నికర విలువ కూడా గణనీయంగా పెరిగింది. కరోనావైరస్ కారణంగా ఈ సంవత్సరం చాలా మంది బిలియనీర్ల సంపద క్షీణించినప్పటికీ, అమెజాన్ ఆన్‌లైన్ షాపింగ్ వల్ల బెజోస్ నికర విలువ 87 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. బెజోస్ సంపద ప్రపంచంలోని 500 మంది ధనవంతుల మొత్తం సంపదలో 3.02 శాతానికి సమానం.

అమెజాన్ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ అయిన 56 ఏళ్ల బెజోస్ యొక్క నికర విలువ.. ప్రపంచంలోని రెండవ ధనవంతుడైన బిల్ గేట్స్ కంటే 78 బిలియన్ డాలర్లు ఎక్కువ. 1999లో సెంటిబిలియనీర్ గా నిలిచిన మొట్టమొదటి వ్యక్తి అయిన బిల్ గేట్స్ ప్రస్తుతం 124 బిలియన్ డాలర్ల నికర విలువతో రెండవ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో ఫేస్ బుక్ యజమాని మార్క్ జుకర్‌బర్గ్ 115 బిలియన్ డాలర్ల సంపదతో మూడోస్థానంలో ఉన్నారు.

యూఎస్ స్టాక్స్‌లో భారీ లాభాల వల్ల టెస్లా మరియు స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ సెంటిబిలియనీర్ క్లబ్‌లో చేరారు. అతని సంపద ఒకేరోజు 5.46 బిలియన్ డాలర్లు పెరిగింది. దాంతో అతని నికర సంపద విలువ 101 బిలియన్ డాలర్లకు చేరి.. నాలుగోస్థానాన్ని పొందాడు.

మస్క్ తరువాత స్థానాలలో వరుసగా ఫ్రెంచ్ బిలియనీర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్, బెర్క్‌షైర్ హాత్వే సీఈఓ వారెన్ బఫ్ఫెట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఉన్నారు.

For More News..

ట్రంప్ దెబ్బకు టిక్‌టాక్ సీఈవో రాజీనామా

నా కొడుకుకు రియా విషం పెట్టి చంపింది.. సుశాంత్ తండ్రి సెల్ఫీ వీడియో

శానిటైజర్ ఇచ్చి టెంపరేచర్ చెక్ చేసే అందమైన ‘జఫిరా’