అమెజాన్‌‌లో సమ్మె.. జీతాలు పెంచాలని డిమాండ్‌‌

అమెజాన్‌‌లో సమ్మె.. జీతాలు పెంచాలని డిమాండ్‌‌
  • అమెరికాతో సహా పలుదేశాల్లో సమ్మెలు
  • ఆరోపణలు అన్నీ తప్పేనన్న కంపెనీ
  • జీతాలు పెంచబోమని చెప్పేసింది

న్యూయార్క్‌‌: ప్రఖ్యాత ఈ–కామర్స్ కంపెనీ అమెజాన్‌‌ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. తమ పని పరిస్థితులు మెరుగుపర్చాలనీ, జీతాలను పెంచాలనీ డిమాండ్‌‌ చేస్తూ అమెరికా, ఇంగ్లండ్‌‌, జర్మనీ తదితర దేశాల్లో సోమవారం నుంచి ఆందోళనలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక డిస్కౌంట్లతో అమెజాన్‌‌ సోమవారం నుంచి డిస్కౌంట్లతో ప్రత్యేక సేల్‌‌ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు విధులను బహిష్కరిస్తున్నారు. అమెరికాలోని మినియాపోలిస్‌‌ వంటి నగరాల్లోని అమెజాన్‌‌ ఫుల్‌‌ఫిల్‌‌మెంట్‌‌ సెంటర్‌‌లోని ఉద్యోగులు సోమవారం ఆరు గంటలపాటు విధుల నుంచి తప్పుకున్నారు. ఫలితంగా ఉదయం, సాయంత్రం షిఫ్టుల్లో పనులు నిలిచిపోయాయి.  పని గంటలు ఎక్కువ ఉన్నాయని, జీతాలు తక్కువ ఉన్నాయని గతంలో ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా, కంపెనీ పనిభారాన్ని మరింత పెంచిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ ఆన్‌‌లైన్‌‌ కామర్స్‌‌ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా ఆరు లక్షల మంది దాకా ఉద్యోగులు ఉన్నారు. 24 గంటల్లోపు డెలివరీ ఇస్తామనే కంపెనీ హామీతో తమ మీద ఒత్తిడి విపరీతంగా పెరిగిందని ఉద్యోగులు వాపోతున్నారు.

మాకేమీ ఇబ్బంది లేదు

ఈ సమ్మెల వల్ల తమ రోజువారీ కార్యకలాపాలకు ఎటువంటి ఇబ్బందీ కలగలేదని అమెజాన్‌‌ ప్రకటించింది. ఉద్యోగుల సంఘాలు అడిగినవన్నీ ఇచ్చేశామని తెలిపింది. జీతాలు పెంచే ప్రతిపాదన లేదని కుండబద్దలు కొట్టింది. ట్రేడ్‌‌ యూనియన్ల ప్రతిపాదనలు అంగీకరించబోమని తెలిపింది. అయితే మినియాపోలిస్‌‌తోపాటు అమెరికాలోని మిగతా ప్రాంతాల ఉద్యోగులు కూడా తమకు మద్దతు తెలిపారని అమెజాన్‌‌ ఎంప్లాయీస్‌‌ ఫర్‌‌ క్లైమేట్‌‌ జస్టిస్‌‌ గ్రూప్‌‌ ప్రకటించింది. ప్రస్తుత ఆందోళనల వల్ల ప్రైమ్‌‌డే సేల్స్‌‌కు కచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయని జర్మనీకి చెందిన ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. ఈ దేశంలోని వెర్న్‌‌, రీన్బర్గ్‌‌, లీప్జిగ్‌‌, గ్రీబెన్‌‌, కొబ్లెంజ్‌‌లోని అమెజాన్‌‌ ఫుల్‌‌ఫిల్‌‌మెంట్‌‌ సెంటర్లలో రెండు వేల మంది ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని ట్రేడ్‌‌ యూనియన్‌‌ ప్రకటించింది. తమ జీతాలకు కోత పెడుతూ కస్టమర్లకు డిస్కౌంట్లు ఇస్తున్నారని ఆరోపించింది. గతంలో ప్రైమ్‌‌డే సేల్స్ నిర్వహించినప్పుడు కూడా జర్మనీ అమెజాన్‌‌ ఉద్యోగులు ఆందోళనలు చేశారు.

‘‘భారీ అమ్మకాల కోసం కంపెనీ డిస్కౌంట్లు పెంచుతూనే ఉంది. ఇందుకోసం ఉద్యోగులను బలి తీసుకుంటున్నది. ఈ పద్ధతిని ఆపాలి. ఈ ఏడాది మొదటి క్వార్టర్‌‌లోనే అమెజాన్‌‌ 3.2 బిలియన్‌‌ యూరోల లాభాలు ఆర్జించింది. అంటే మాకు జీతాలు పెంచినా, చెల్లించేందుకు అవసరమైనంత డబ్బు కంపెనీ దగ్గర ఉంది. అయినా పెంపునకు ఒప్పుకోవడం లేదు’’ అని ట్రేడ్‌‌ యూనియన్ నాయకుడు ఒకరు వివరించారు. జర్మనీలో అమెజాన్‌‌ ఉద్యోగుల కనీస వేతనాలు గంటకు11 యూరోల (దాదాపు రూ.850) నుంచి మొదలవుతాయి. రెండేళ్ల సర్వీసు పూర్తయిన ఉద్యోగులు నెలకు కనీసం 2,397 యూరోల జీతం (దాదాపు రూ.లక్షా 85 వేలు) తీసుకుంటారని కంపెనీ చెబుతోంది.