
- హిండన్‌బర్గ్ రిపోర్ట్ వల్ల అదానీకి కష్టాలు
- మూడోస్థానంలో సైరస్ పూణావాలా
- వెల్లడించిన హురున్ గ్లోబల్ రిచ్‌లిస్ట్
న్యూఢిల్లీ: ఇండియాలోనే అత్యంత సంపన్నుడి స్థానాన్ని తిరిగి రిలయన్స్ చీఫ్ ముకేశ్ అంబానీ దక్కించుకున్నారు. 82 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఈయన మొదటి స్థానంలో, 53 బిలియన్ డాలర్ల నికర సంపదతో గౌతమ్ అదానీ రెండో స్థానంలో నిలిచారు. హిండన్బర్గ్రిపోర్ట్ కారణంగా అదానీ సంపద దారుణంగా తగ్గిపోయింది. బుధవారం విడుదల చేసిన హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగారు. అంతేగాక ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు కూడా ఈయనే! సంపదలో 20 శాతం తగ్గుదల ఉన్నప్పటికీ, ఆర్‌ఐఎల్ బాస్ 82 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో ప్రపంచవ్యాప్తంగా తొమ్మిదవ ర్యాంక్‌ను సంపాదించుకున్నారు. హురున్ రియల్ ఎస్టేట్ గ్రూప్ ఎం3ఎం సహకారంతో 'ది 2023 ఎం3ఎం హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్’ పేరుతో తయారు చేసిన రిపోర్ట్‌లో వెల్లడించింది. వివరాలు ఇలా ఉన్నాయి. అంబానీ వరుసగా మూడో సంవత్సరం కూడా అత్యంత సంపన్న ఆసియన్ టైటిల్‌ను నిలబెట్టుకున్నారు. ఆర్‌ఐఎల్ చీఫ్‌గా ఆయన 20 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు. ఈకాలంలో గ్రూప్ ఆదాయం 17 రెట్లు, లాభం 20 రెట్లు పెరిగింది.
భారతీయ బిలియనీర్లలో 53 బిలియన్ డాలర్ల నికర సంపదతో గౌతమ్ అదానీ రెండో స్థానంలో నిలిచారు. సైరస్ పూణావాలా 28 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో మూడో స్థానంలో నిలిచారు. శివ నాడార్, ఆయన కుటుంబం 27 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో, 20 బిలియన్ డాలర్లతో లక్ష్మీ మిట్టల్ ఐదో స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్టు కారణంగా అదానీ 28 బిలియన్ డాలర్ల సంపదను నష్టపోయారు. వారానికి రూ.3,000 కోట్లను పోగొట్టుకున్నారు. ఇదిలా ఉంటే, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కింది ఏడాది కాలంలో అత్యధిక సంపదను (డాలర్లలో).. దాదాపు 70 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదను కోల్పోయాడు. ఇది అంబానీ, అదానీల ఉమ్మడి నష్టం కంటే ఎక్కువ. అత్యధికంగా నష్టపోయినవారి జాబితాలో బెజోస్ మొదటిస్థానంలో ఉండగా అదానీ ఆరోస్థానంలో, అంబానీ ఏడో స్థానాల్లో ఉన్నారు. అమెజాన్ బాస్ సంపద 118 బిలియన్ డాలర్లు కాగా, అదానీ నెట్‌వర్త్ 53 బిలియన్ డాలర్లు, అంబానీ సంపద 82 బిలియన్ డాలర్లు.
అదానీకి భారీ నష్టాలు
ఎం3ఎం హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ డేటా ప్రకారం, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఈ సంవత్సరంలో ప్రతి వారం రూ.3000 కోట్ల నష్టాన్ని చవిచూశారు. ఈ ఏడాది జనవరిలో హిండన్‌బర్గ్ రిపోర్ట్ వచ్చాక ఆయన సంపద దాదాపు 60 శాతం తగ్గింది. దీంతో ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న బిలియనీర్ స్థానం నుండి 23 స్థానానికి పడిపోయారు. దీంతో చైనాకు చెందిన జాంగ్ షన్షన్ ఆసియాలోనే రెండో అత్యంత ధనికుడి టైటిల్‌ను దక్కించుకున్నారు. ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్లలో అంబానీ ఒక్కరే భారతీయుడు కావడం విశేషం. అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాలు, మనీలాండరింగ్ వంటి నేరాలు చేసిందని హిండన్ బర్గ్ ఆరోపించింది. సంస్థ షేర్లు 80 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉందని, సంస్థకు అప్పులు విపరీతంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూపు తిరస్కరించింది. కస్టమర్లు, పెట్టుబడిదారుల నమ్మకాన్ని తిరిగి నిలబెట్టుకోవడానికి గడువుకు ముందే కొన్ని అప్పులను తీర్చేసింది. ఇందుకోసం ప్రమోటర్స్ వాటాలో కొంత భాగాన్ని అమ్మేసింది. కొన్ని ప్రాజెక్టులను నిలిపివేసింది.