సీరియస్‌‌గా ఉంటే హాస్పిటల్‌కు.. లేదా హోం ట్రీట్‌‌మెంట్‌ చాలు

సీరియస్‌‌గా ఉంటే హాస్పిటల్‌కు.. లేదా హోం ట్రీట్‌‌మెంట్‌ చాలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా రోజురోజుకీ విజృంభిస్తోంది. సెకండ్ వేవ్‌‌లో వైరస్ వేగంగా వ్యాప్తిస్తోంది. దీంతో పాజిటివ్ కేసులు ప్రతిరోజు రెండున్నర లక్షలకు పైగా నమోదవుతున్నాయి. ఆస్పత్రుల్లో బెడ్‌‌లు దొరక్కపోవడం, మెడికల్ ఆక్సిజన్ కొరతతో పేషెంట్లు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో  వైరస్ పాజిటివ్‌‌గా తేలిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ డాక్టర్ జైన్ చగ్లా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ రుమటాలజీ వేద్ చతుర్వేది, ఇంటర్నల్ మెడిసిన్ డిపార్ట్‌మెంట్‌‌లో సీనియర్ కన్సల్టెంట్‌‌గా ఉన్న డాక్టర్ విక్రమ్‌‌జీత్ సింగ్ పలు  సూచనలు చేశారు. స్వల్ప కొవిడ్ లక్షణాలు ఉన్న వారు ఇళ్లలోనే ఉంటే సరిపోతుందని, పాజిటివ్‌గా తేలిన వ్యక్తులు ఆక్సిజన్ లెవల్స్ చెక్ చేస్తూ ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పల్స్ ఆక్సీమీటర్‌‌ను కొనుక్కోవాలని చెప్పారు. 

ఆక్సిజన్ సాచ్యురేషన్ 94 కిందకు వెళ్తే పొట్ట మీద పడుకోవడాన్ని ప్రాక్టీస్ చేయాలని.. ఇలా ప్రతి రెండు గంటలకు మూడుసార్లు చేస్తే ఊపిరితిత్తులకు మంచిదని ఆయా డాక్టర్లు పేర్కొన్నారు. ‘పొట్ట మీద పడుకోవడం అంతగా ప్రభావం చూపకపోతే ఆక్సిజన్ సిలిండర్‌ను ఇంటికి తీసుకెళ్లండి. కొందరు పేషెంట్ల విషయంలో సీటీ స్కాన్ తీసుకోవడం తప్పనిసరి. రిజల్ట్స్‌లో తేలికపాటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌‌ను కలిసి ఇంట్లోనే ఉండండి. మెడిసిన్స్ వాడుతూ మంచి ఫుడ్ తీస్కోండి. హామ్ హాస్పిటలైజేషన్ గురించి ప్రజలు ఆలోచించాలి. తేలికపాటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు ఉన్న వారికి హోం ఐసోలేషన్‌లోనే ఉంటూ మెడిసిన్స్ వాడటం చాలా బాగా పని చేస్తుంది. ఆరోగ్యం సీరియస్‌గా ఉన్న పేషెంట్లు మాత్రమే ఆస్పత్రుల్లో అడ్మిట్ అవ్వాలి. మిగిలిన వాళ్లు ఇళ్లలోనే ఉంటూ, డాక్టర్ల సూచనలతో కరోనా నుంచి బయటపడొచ్చు. చాలా మంది కరోనాకు భయపడి అవసరం లేకున్నా ఆస్పత్రుల్లో అడ్మిట్ అవుతున్నారు. వాళ్లు ఇళ్లలో ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుంది’ అని విక్రమ్‌జీత్ సింగ్, చతుర్వేది, చగ్లా సూచించారు.