
న్యూఢిల్లీ: సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచించారు. సోషల్ మీడియాలో జాతి వ్యతిరేక ప్రచారంతోపాటు, ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గురువారం జమ్మూ కాశ్మీర్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్లు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, రాజస్తాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు, సిక్కిం ప్రభుత్వ ప్రతినిధితో అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టి 9 ప్రాంతాల్లో దాడులు చేసి ఉగ్రవాదుల క్యాంపులను ధ్వంసం చేయడంపై కేంద్ర ప్రభుత్వాన్ని, ఆర్మీని సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశంలో ఏర్పడిన జాతీయ ఐక్యతా భావం పౌరుల ధైర్యాన్ని పెంచిందని షా తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్య సంరక్షణ, అగ్నిమాపక సేవల వంటి సేవలకు అంతరాయం లేకుండా చూసుకోవాలని ఆయా రాష్ట్రాలకు అమిత్ షా సూచించారు. అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జాతి వ్యతిరేక ప్రచారంపై నిఘా ఉంచాలని, తప్పుడు వార్తలను వైరల్చేయడాన్ని అరికట్టేందుకు కేంద్ర ఏజెన్సీలతో కలిసి పనిచేయాలని తీసుకోవాలని షా సూచించారు.