
సెక్యూరిటీ.. స్టేటస్ సింబల్ కాదు
మిగతా 130 కోట్ల మంది బాధ్యతా కేంద్రంపై ఉందన్న హోం మంత్రి
రాజ్యసభలో ఎస్పీజీ సవరణ బిల్లుకు ఆమోదం.. కాంగ్రెస్ వాకౌట్
గాంధీ ఫ్యామిలీకి భద్రత తగ్గింపుపై అమిత్ షా
న్యూఢిల్లీ: సోనియా గాంధీ ఫ్యామిలీకి ఎస్పీజీ సెక్యూరిటీ తొలగింపులో ఎలాంటి కుట్ర లేదని, కక్షపూరిత రాజకీయాలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీనేగానీ బీజేపీ కాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఎస్పీజీ సెక్యూరిటీ అనేది వ్యక్తుల స్టేటస్ సింబల్‌గా భావించరాదని, కేవలం ప్రధానమంత్రి ఒక్కరికి అది పరిమితమని చెప్పారు. మంగళవారం రాజ్యసభలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) సవరణ బిల్లుపై చర్చకు ప్రభుత్వం తరఫున సమాధానమిస్తూ ఆయనీ కామెంట్లు చేశారు. సెక్యూరిటీ ముప్పుపై సైంటిఫిక్ విశ్లేషణ చేసిన తర్వాతే ఎస్పీజీ సవరణ బిల్లును రూపొందించామని షా చెప్పారు. కొత్త రూల్స్ ప్రకారం పీఎంతోపాటు ఆయన అఫీషియల్ బంగళాలో నివసించే ఫ్యామిలీ మెంబర్లకు, మాజీ ప్రధానులకు ఐదేండ్ల పాటు మాత్రమే ఎస్పీజీ సెక్యూరిటీ అందిస్తామని, మిగతా వీవీఐపీలందరికీ జడ్‌ప్లస్ ప్రొటెక్షన్ కల్పిస్తామని వివరించారు. సోనియా గాంధీ ఫ్యామిలీ ప్రాణాల్ని ప్రమాదంలో పడేసేందుకే ఎస్పీజీ తొలగించారన్న కాంగ్రెస్ ఎంపీల ఆరోపణల్ని హోం మంత్రి తోసిపుచ్చారు. ‘‘గతంలో ప్రధానులుగా పనిచేసిన పీవీ నర్సింహారావు, ఐకే గుజ్రాల్, చంద్రశేఖర్, దేవేగౌడకు ఎస్పీజీ ఎత్తేసినప్పుడు ఇంత చర్చ జరగలేదు. ఈ మధ్య మన్మోహన్ సింగ్‌కు జడ్‌ప్లస్ కల్పించినప్పుడు కూడా కాంగ్రెస్‌పార్టీ నోరెత్తలేదు. ఒక్క సోనియా గాంధీ ఫ్యామిలీ విషయంలోనే రాద్దాంతం చేస్తున్నారు. ఒకటో రెండో ఫ్యామిలీలు కాదు మొత్తం 130 కోట్ల మంది ప్రజల సెక్యూరిటీపై కేంద్రానికి బాధ్యత ఉంది” అని అమిత్ షా కౌంటరిచ్చారు. ప్రభుత్వ వివరణతో సంతృప్తి చెందని కాంగ్రెస్ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. చివరికి వాయిస్ ఓటుతో ఎస్పీజీ సవరణ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందింది. కిందటి వారమే ఇది లోక్‌సభలో పాసైంది.
రాహుల్ కారు అనుకుని వదిలేశారు: షా
ఎస్పీజీ తొలగించిన కొద్దిరోజులకే లోథీ రోడ్డులోని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఇంటి దగ్గర సెక్యూరిటీ ఫెయిల్యూర్ అంశంపైనా కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేశారు. ఎలాంటి చెకింగ్ లేకుండా ఓ కారును నేరుగా ప్రియాంక ఇంటి లాన్లోకి అనుమతించడం, కారులో వచ్చినవాళ్లు ప్రియాంకతో ఫొటోలు దిగి వెళ్లడంతో సీఆర్పీఎఫ్పై విమర్శలు వెల్లువెత్తాయి. నవంబర్ 26న చోటుచేసుకున్న ఆ ఘటనపై హోం మంత్రి వివరణ ఇచ్చారు. ‘‘బ్లాక్ కలర్ సఫారీ కారులో రాహుల్ గాంధీ తన చెల్లి ప్రియాంక ఇంటికి వస్తున్నారని సీఆర్పీఎఫ్కు సమాచారం అందింది. అనుకున్న సమయానికి సరిగ్గా అదే మోడల్ కారు రావడంతో సెక్యూరిటీ సిబ్బంది గేట్లు తెరిచేశారు. అయితే ఆ కారులో రాహుల్ కాకుండా, మీరట్‌కు చెందిన కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నట్లు తర్వాత తెలిసింది. దీనికి సంబంధించి ముగ్గురు ఆఫీసర్లను సస్పెండ్ చేసి, ఎంక్వైరీకి ఆదేశించాం’’అని హోం మంత్రి వివరించారు.
ముందు మహిళల్ని కాపాడండి: వాద్రా
గాంధీ ఫ్యామిలీకి ఎస్పీజీ తొలగింపు ముమ్మాటికీ రాజకీయ కుట్రేనని ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా అన్నారు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా మహిళల సెక్యూరిటీ గురించే ఎక్కువ టెన్షన్ పడుతున్నామని చెప్పారు. ‘‘మా ఫ్యామిలీ ఒక్కటే కాదు, దేశంలోని జనం, మరీ ముఖ్యంగా మహిళలకు సెక్యూరిటీ ఉండాలి. ఇంట్లో, బయట, పగలు, రాత్రి.. ఎక్కడపడితే అక్కడ అన్ని వయసుల ఆడవాళ్లపై తరచూ దాడులు జరుగుతున్నాయి. ఎలాంటి సమాజాన్ని తయారు చేస్తున్నాం? ఆడబిడ్డలకు సేఫ్టీ కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది’’అని వాద్రా సూచించారు.