కేసీఆర్‌‌‌‌తో కొట్లాడుడే..రాష్ట్ర నేతలకు అమిత్ షా దిశానిర్దేశం

కేసీఆర్‌‌‌‌తో కొట్లాడుడే..రాష్ట్ర నేతలకు అమిత్ షా దిశానిర్దేశం
  • వడ్ల కొనుగోళ్లపై వెనక్కి తగ్గొద్దు
  • సర్కారు ఫెయిల్యూర్స్​ని ఎండగట్టండి
  • కేసీఆర్​ కుటుంబం చేస్తున్న 
  • అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లండి
  • త్వరలో రెండు రోజుల టూర్‌‌‌‌కు వస్త
  • భారీ సభకు ఏర్పాట్లు చేయాలని ఆదేశం

‘‘కేసీఆర్ ఏడున్నరేళ్లుగా పవర్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? కేసీఆర్, ఆయన కుటుంబం చేస్తున్న అవినీతి, అక్రమాలేంటి? రాష్ట్రంలో ఏ వర్గాలను విస్మరించారు? టీఆర్ఎస్ సర్కార్ బాధితులెవరు? తదితర విషయాలను ప్రజలకు వివరించేందుకు ప్రతి నియోజకవర్గంలో పర్యటించండి” అని అమిత్ షా సూచించారు. ఇక నుంచి తరచూ తెలంగాణలో పర్యటిస్తానని, పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత రెండు రోజుల టూర్‌‌‌‌కు వస్తానని చెప్పారు. త్వరలోనే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ఈ బహిరంగ సభను సిద్దిపేటలో నిర్వహించాలని ఎమ్మెల్యే రఘునందన్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌‌లో జరపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. అయితే సభ ఎప్పుడు, ఎక్కడ అనేది తర్వాత నిర్ణయిస్తామని షా అన్నారు. 

హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్‌‌తో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం కావాలని రాష్ట్ర బీజేపీ నేతలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచించారు. కేసీఆర్‌‌‌‌తో ఢీ అంటే ఢీ అనేలా పోరు సాగించాలని స్పష్టం చేశారు. ఎక్కడా రాజీ పడకుండా ప్రజల పక్షాన నిలబడాలని, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను జనం ముందు ఎండగట్టాలని చెప్పారు. మంగళవారం పార్లమెంట్ భవన్‌‌లోని హోంశాఖ ఆఫీసులో బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ అయ్యారు. వీరితో సుమారు 45 నిమిషాలపాటు మాట్లాడిన షా.. ఒక్కొక్కరితో విడివిడిగా అభిప్రాయాలను తీసుకున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, వడ్ల విషయంలో కేసీఆర్ అనుసరిస్తున్న తీరు, హుజూరాబాద్ గెలుపు, సంజయ్ పాదయాత్రకు స్పందన, రెండో విడత పాదయాత్ర ప్రారంభం వంటి విషయాలపై ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. 

అసెంబ్లీ ఎన్నికలు 2023లో వచ్చినా, అంతకుముందే వచ్చినా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. వడ్ల విషయంలో టీఆర్ఎస్ తీరును జనానికి వివరించాలని సూచించారు. ‘‘కేంద్రం, మోడీ సర్కార్ ఎప్పుడూ రైతుల పక్షానే ఉంటుంది. కానీ కేంద్రాన్ని బద్నాం చేసే రీతిలో రాష్ట్ర సర్కార్ ఆందోళనలు, నిరసనలు చేస్తోంది. ఈ విషయంలో పార్టీ తరఫున మీరు చేయాల్సింది చేయండి.. ప్రభుత్వం తరఫున మేం చేయాల్సింది చేస్తాం” అని చెప్పారు. బియ్యం కుంభకోణంపై వివరాలు సేకరించి పోరాడాలని సూచించారు. ‘‘రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీని పటిష్టపరిచేందుకు ప్రత్యేక దృష్టి పెట్టండి. పార్టీ కార్యక్రమాలను అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కొనసాగేలా చర్యలు తీసుకోండి. బలమైన అభ్యర్థులను తయారు చేయండి. ఏ నియోజకవర్గంలో పార్టీ బలహీనంగా ఉందో తెలుసుకుని అక్కడ ఇతర పార్టీలకు చెందిన బలమైన నేతలను బీజేపీలో చేర్చుకోండి. చేరికలపై ‘స్పెషల్ డ్రైవ్’ కొనసాగించాలి” అని చెప్పారు. సాధ్యమైనంత తొందరగా పాదయాత్రతో జనంలోకి వెళ్లండని కేంద్రమంత్రి సూచించారు.  ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ నేతలు విజయశాంతి, డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాపురావు, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, నేతలు బంగారు శృతి, ప్రేమేందర్ రెడ్డి, విఠల్, తీన్మార్ మల్లన్న తదితరులు పాల్గొన్నారు.

ఈటల రాజేందర్​ను అభినందించిన అమిత్ షా
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన ఈటల రాజేందర్‌‌ను అమిత్ షా అభినందించారు. టీఆర్ఎస్ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడినా అక్కడి ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపడం సంతోషకరమన్నారు. వారి ఆశలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. ఈ ఎన్నికను బీజేపీ నేతలు, కార్యకర్తలు స్ఫూర్తిగా తీసుకొని.. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా మనదే గెలుపు అన్నట్లు పనిచేయాలన్నారు.