శరణార్థులకు కచ్చితంగా పౌరసత్వం ఇస్తం : అమిత్ షా

శరణార్థులకు కచ్చితంగా పౌరసత్వం ఇస్తం : అమిత్ షా
  • బెంగాల్‌‌ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా వెల్లడి

కోల్‌‌కతా: ఇతర దేశాల నుంచి మన దేశంలోకి వచ్చిన శరణార్థులందరికి పౌరసత్వం కచ్చితంగా ఇస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) గురించి బెంగాల్‌‌ ప్రజలను మమతా బెనర్జీ తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. శరణార్థులందరూ ఎలాంటి భయం లేకుండా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా..బుధవారం ఆయన తొలిసారిగా  పశ్చిమ బెంగాల్‌‌లో పర్యటించారు. ఈ సందర్భంగా  బలూర్‌‌ఘాట్‌‌లో నిర్వహించిన సభలో అమిత్ షా మాట్లాడుతూ.." ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సీఎం మమతా బెనర్జీ చొరబాటుదారులను అడ్డుకోవడం లేదు. పైగా వారి రాకను సులభతరం చేస్తున్నారు. శరణార్థులు సీఏఏకు దరఖాస్తు చేసుకుంటే పౌరసత్వం కోల్పోతారని ప్రజలను ఆమె తప్పుదోవ పట్టిస్తున్నారు. శరణార్థులు పౌరసత్వం పొందడాన్ని ఆమె ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?  ఎలాంటి భయం లేకుండా  పౌరసత్వానికి దరఖాస్తు చేసుకొండి. అందరికీ పౌరసత్వం ఇస్తం. అది చెప్పడానికే ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. ఈ దేశంలో నాకు ఉన్నంత హక్కు మీకు కూడా ఉంది. శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడం మా నిబద్ధత" అని పేర్కొన్నారు.