పాల ధర పెంచిన అమూల్

పాల ధర పెంచిన అమూల్

దేశంలో అతిపెద్ద పాల సరఫరా సంస్థ అమూల్ పాల ధర పెంచింది. లీటర్ పాలపై రూ.2 పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇన్‌పుట్ ఖ‌ర్చులు పెరిగినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పెరిగిన ధరలు రేపటి (బుధవారం  ఆగస్టు 17) నుంచి అమల్లోకి రానున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే కేవలం పశువుల దాణా ఖర్చు దాదాపు 20 శాతం పెరిగిందని, అందుకే పాల రేటు పెంచాల్సి వచ్చిందని అమూల్ స్పష్టం చేసింది. పెరిగిన ధరలు కొన్ని రాష్ట్రాల్లోనే అమలు కానున్నాయి. అహ్మదాబాద్, సౌరాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ముంబై, గుజరాత్‌లోని ఇతర ప్రాంతాలకు చెందిన కస్టమర్లు రేపట్నుంచి కొత్త ధరలు చెల్లించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం అరలీట‌రు అమూల్ గోల్డ్ పాలను రూ.31కి అమ్ముతున్నారు. అర లీట‌రు అమూల్ తాజా మిల్క్ ను రూ.25కు, అమూల్ శ‌క్తి అర లీట‌రు పాల‌ను రూ.28కి విక్రయిస్తున్నారు. పెరిగిన ధరలతో ఉత్పత్తిదారుల‌కు భ‌రోసా ఇచ్చిన‌ట్లు అవుతుంద‌ని ఆ సంస్థ వెల్లడించింది. పాల ఉత్పత్తుల కోసం వినియోగదారులు చెల్లించే ప్రతి రూపాయిలో దాదాపు 80 పైసలను అమూల్ పాల ఉత్పత్తిదారులకు అందజేస్తుంది.