బనకచర్లపై అఖిలపక్ష సమావేశం పెట్టాలి..సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌ వెస్లీ

బనకచర్లపై అఖిలపక్ష సమావేశం పెట్టాలి..సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌ వెస్లీ

నల్గొండ అర్బన్, వెలుగు : బనకచర్ల ప్రాజెక్ట్‌‌పై ఢిల్లీలో జరిగిన చర్చల సారాంశంపై సీఎం రేవంత్‌‌రెడ్డి స్పష్టత ఇవ్వాలని, అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌ వెస్లీ డిమాండ్‌‌ చేశారు. 

నల్గొండలోని దొడ్డి కొమురయ్య భవన్‌‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఏర్పడిన గందరగోళాన్ని తొలగించేలా నిపుణులతో చర్చించాలని సూచించారు. గోదావరి, కృష్ణా నదీ జలాల్లో రాష్ట్ర వాటాలను తేల్చాలని డిమాండ్‌‌ చేశారు. 

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌‌పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల ఆమోదానికి కేంద్రమంత్రులు కిషన్‌‌రెడ్డి, బండి సంజయ్‌‌ చొరవ తీసుకోవాలని కోరారు. ఆర్డినెన్స్‌‌ తెచ్చిన తర్వాతే లోకల్‌‌ బాడీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. 

కాంగ్రెస్‌‌ అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించినా.. ఇప్పటివరకు ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆగస్ట్‌‌, సెప్టెంబర్‌‌లో ఆందోళనలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని, లేదంటే ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

 సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌‌, జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్‌‌రెడ్డి, నారి అయిలయ్య, డబ్బికార్‌‌ మల్లేశ్‌‌, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, ప్రభావతి, వి.వెంకటేశ్వర్లు, ఎండి.హాశం, చిన్నపాక లక్ష్మీనారాయణ 
పాల్గొన్నారు.