లక్ అంటే ఇదీ.. ఆటో డ్రైవర్‎కు రూ. 12 కోట్ల లాటరీ

 లక్ అంటే ఇదీ.. ఆటో డ్రైవర్‎కు రూ. 12 కోట్ల లాటరీ

కేరళ: ఎవరికైనా అదృష్టం ఆవగింజంతైనా ఉండాలి అంటారు. అలా ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా ఎదుర్కొగలడని నమ్మకం. అయితే కేరళకు చెందిన ఓ ఆటో డ్రైవర్‎కు అదృష్టం ఆనపకాయంత ఉంది. కేరళలో ప్రభుత్వం నిర్వహించే లాటరీలో ఏకంగా రూ. 12 కోట్ల లాటరీ గెలుచుకున్నాడు. వివరాలలోకి వెళితే.. ఎర్నాకులం జిల్లాలోని మరాడుకు చెందిన 58 ఏళ్ల జయపాలన్ ఆటో డ్రైవర్‎గా పనిచేస్తున్నాడు. ఆయనకు లాటరీ టికెట్లు కొనే అలవాటుంది. దాంతో జయపాలన్ సెప్టెంబర్ 10న త్రిపునితురలోని మీనాక్షి లక్కీ సెంటర్ అనే ఏజెన్సీ నుంచి రూ. 300లకు ఒక లాటరీ టికెట్ కొన్నాడు.  

ఆ లాటరీకి చెందిన డ్రాను ఆదివారం మధ్యాహ్నం తిరువనంతపురంలో తీశారు. ఆ డ్రాలో జయపాలన్ విజేతగా నిలిచినట్లు ఇద్దరు మంత్రులు ప్రకటించారు. అది చూసిన జయపాలన్.. ఆ లాటరీ గురించి తన కొడుకుకు చెప్పాడు తప్ప స్నేహితులకు కానీ, ఇతర కుటుంబసభ్యులకు కానీ చెప్పలేదు. మరుసటి రోజు పేపర్లలో తన లాటరీ టికెట్ నెంబర్ మరోసారి చెక్ చేసుకున్న తర్వాత బ్యాంకుకు వెళ్లి అధికారులను కలిశాడు. తన లాటరీ టికెట్‎కు సంబంధించిన ఒరిజినల్ కాపీని వారికి అందజేశాడు. పన్నులు మరియు టికెట్ అమ్మిన ఏజెన్సీ యొక్క కమీషన్‌ని తీసేసిన తర్వాత జయపాలన్‎కు దాదాపు రూ .7.4 కోట్లు వస్తాయని అధికారులు తెలిపారు.

ఈ ప్రైజ్ మనీతో ఏం చేస్తావని జయపాలన్‎ను అడిగితే.. తనకు కొన్ని అప్పులున్నాయని, అవన్నీ తీర్చేస్తానని తెలిపాడు. ‘కోర్టులో రెండు సివిల్ కేసులున్నాయి. వాటిని క్లియర్ చేసుకుంటాను. నా పిల్లలకు మంచి విద్యను అందిస్తాను. అంతేకాకుండా.. నా చెల్లెళ్లను ఆర్థికంగా ఆదుకుంటాను’ అని తెలిపాడు. జయపాలన్ తల్లి మాట్లాడుతూ.. ‘మేం చాలా అప్పుల్లో మునిగిపోయాం. ఈ లాటరీ రాకపోయుంటే.. నా కొడుకు అప్పులు తీర్చలేకపోయేవాడు. దేవుడు మా కన్నీళ్లను చూసి మాకు సాయం చేశాడు’ అని చెప్పింది. 

ఈ లాటరీలో జాక్‌పాట్‌ కింద రూ .12 కోట్ల రూపాయలు, మరో ఆరుగురు విజేతలకు రూ .1 కోటి, 12 మంది విజేతలకు రూ. 10 లక్షలు, 12 మంది విజేతలకు రూ. 5 లక్షలు, 108 మంది విజేతలకు రూ. లక్ష చొప్పున అందచేయనున్నారు. వీరందరికీ ఇచ్చే డబ్బు నుంచి ఏజెన్సీ కమీషన్ మరియు పన్నులు కట్ చేసి మిగిలిన డబ్బు ఇవ్వబడుతుంది.

కేరళ ప్రభుత్వం తిరువోనం బంపర్ లాటరీ కోసం ఈ సంవత్సరం 54 లక్షల టిక్కెట్లను ముద్రించిందని, ఇవన్నీ అమ్ముడయ్యాయని లాటరీ విభాగం అధికారులు చెప్పారు. ఈ ఏడాది గత సంవత్సరం కంటే 10 లక్షల టిక్కెట్లను ఎక్కువగా ముద్రించామని తెలిపారు. ఈ ఏడాది బంపర్ డ్రా కోసం రూ. 126 కోట్లు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.