విద్యా ఎమర్జెన్సీ ప్రకటించాలి

విద్యా ఎమర్జెన్సీ ప్రకటించాలి

రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరి నెలరోజులకు పైగా గడిచింది. ముఖ్యమంత్రి వారి సహచర మంత్రులు  వివధ శాఖల పనితీరును సమీక్షించడమే కాకుండా ప్రభుత్వం శ్వేతపత్రాలను కూడా విడుదల చేసింది. విద్య మీద ఇంకా అంత స్థూలంగా  దృష్టి సారించినట్లు లేదు. ఏదో ఒక రోజు మాత్రం  సమీక్ష చేసినట్లు తెలిసింది. మంత్రివర్గంలో విద్యామంత్రిని ఇంకా నియమించలేదు. ముఖ్యమంత్రి రేవంత్​ ఈ శాఖను నిర్వహిస్తున్నారు. ఈ శాఖకు  పూర్తికాలం  పనిచేసే మంత్రి కావాలి.  

రాష్ట్రం పెద్ద విద్యా సంక్షోభంలో ఉందని రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలి. వెంటనే విద్యా ఎమర్జెన్సీ ప్రకటించి నాణ్యమైన విద్యను అందించే గ్యారంటీని కూడా అన్నీ గ్యారంటీలతో పాటు కలపాలి.  తక్షణ చర్యలకు ఉపక్రమించాలి. అన్ని విషయాలు ఆగ వచ్చు కానీ బాలల విద్యను నిర్లక్ష్యం చేస్తే ముందు  తరాల భవిష్యత్తు అంధకారం అవుతుందని ప్రభుత్వం గమనించాలి.  కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన “పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్” (PGI 2.0 2021-–2022) నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రం 1000 మార్కులకు కేవలం 479.9 పాయింట్లతో దేశంలోని 36 రాష్ట్రాలలో31వ స్థానంలో నిలిచింది. అంటే కింది నుంచి ఆరో స్థానంలో నిలిచింది. తెలంగాణ కన్నా తక్కువ పాయింట్లు పొందిన 5 రాష్ట్రాలు, బిహార్ నాలుగు ఈశాన్య రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. 

ఇక అతి ముఖ్యమైన ‘అభ్యసన ఫలితాల’లో 240 పాయింట్లకు కేవలం 36.6 పాయింట్లతో  దేశంలో 35వ స్థానంలో నిలిచింది, ఒక్క మేఘాలయ మాత్రమే తెలంగాణ కన్నా వెనకబడి వుంది. తెలంగాణ విద్యా వ్యవస్థలో మౌలిక వసతులు కల్పించి అవసరమైన భోధన, భోదనేతర సిబ్బంది నియమించి నాణ్యమైన విద్యను అందించే గ్యారంటీని నూతన ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలి. కొన్ని పనులకు నిధులు అవసరం, మరికొన్ని చర్యలకు నిధులతో పని లేకుండా పర్యవేక్షణ,   రాష్ట్ర స్థాయిలో సమీక్షలు సమీకృత మార్పులు అవసరం. కాగా,  మరికొన్నిటికి విడతల వారీ నిధులు అవసరం. 

వ్యవస్థీకృత మార్పులు చేపట్టాలి

పాఠశాల విద్య పలు మంత్రిత్వ శాఖలలో వివిధ యాజమాన్యాల కింద నడుపుతున్నారు.  ప్రభుత్వ, స్థానిక ప్రభుత్వ, ఎయిడెడ్, మోడల్ స్కూళ్లు, కేజిబీవి, రెసిడెన్షియల్ స్కూళ్లలో సాంఘిక సంక్షేమ, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, మదర్సాలు, అర్బన్  రెసిడెన్షియల్ స్కూళ్లు, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ స్కూళ్లు, గిరిజన ఆశ్రమ స్కూళ్లు ఇంకా ఇతర రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ స్కూళ్లు కలిపి మొత్తం  30,307 ఉన్నవి. నిజానికి అన్నీ కూడా దాదాపు  రాష్ట్ర ప్రభుత్వ సహాయంతోనే నడుస్తున్నాయి. వనరులు రాష్ట్రమే సమకూరుస్తున్నప్పుడు వాటికి ఇచ్చే స్వయం ప్రతిపత్తిని ఇస్తూనే ఈ సంస్థలలో విద్యా పర్యవేక్షణ, నిర్వహణ నాయకత్వం విద్యాశాఖ గొడుగు కిందికి తీసుకురావాలి. అప్పుడే పిల్లలందరికి సమాన విద్య అందించడానికి వీలవుతుంది. 

 పాఠశాల విద్య బలోపేతానికి వికేంద్రీకరణ

 కేంద్ర ప్రభుత్వం  72, 73  రాజ్యాంగ సవరణ ద్వారా  స్థానిక ప్రభుత్వాలకు ఇచ్చిన అధికారాలకు అనుగుణంగా  నిధులు సమకూర్చి , పాఠశాలల నిర్వహణ బాధ్యత స్థానిక సంస్థలకు  అప్పచెప్పడం చాలా అవసరం. దీనికిగాను ఒక పటిష్టమైన వ్యూహాత్మకమైన, నమ్మకంతో కూడిన రాజకీయ సంకల్పం  అవసరం. కేంద్రం విడుదల చేసిన  లెక్కల ప్రకారం తెలంగాణలో  27.4 శాతం విద్యార్థులు పదవ తరగతి పూర్తి చేయకుండానే బడి మానివేస్తున్నారు. ఇంటర్​ విద్య  పూర్తి చేయని విద్యార్థులు దాదాపుగా సగం మంది ఉంటున్నారు. ఈ పిల్లలందరూ అత్యధిక శాతం బడుగు, బలహీన వర్గాలకు చెందిన పిల్లలని బాలికలు ఎక్కువమంది ఉంటారని గుర్తించాలి. 

నాణ్యమైన విద్య తక్షణ కర్తవ్యం

 కేంద్ర ప్రభుత్వ నివేదిక అనుసారం ‘అభ్యసన ఫలితాల’లో 240 పాయింట్లకు కేవలం 36.6 పాయింట్లతో  దేశంలో 36 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకుగాను తెలంగాణ  35వ స్థానంలో ఉంది. మనకంటే కేవలం మేఘాలయ మాత్రమే వెనకబడి ఉంది. ఈ పరిస్థితి విద్యా సంక్షోభానికి అద్దం పడుతుంది. కాబట్టి  విద్యా ఎమర్జెన్సీని ప్రకటించాలి.   ప్రతి నెల రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో  నాణ్యమైన విద్య పురోగతి మీద సమీక్ష నిర్వహించాలి.

ప్రైవేట్ విద్యపై నియంత్రణ

 ప్రభుత్వ విద్య విఫలమైన కారణంగా రాష్ట్రంలో దాదాపు యాబై శాతం పైగా విద్యార్థులు  ప్రైవేటు విద్యా సంస్థలలో చదువుకుంటున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలలో  ఫీజు దోపిడీ విపరీతంగా ఉందని తల్లిదండ్రులు ఆవేదనలో ఉన్నారు. ఫీజుల నియంత్రణ తదితర అంశాలను పర్యవేక్షణకు  స్వయంప్రతిపత్తి గల ప్రైవేటు పాఠశాలల నియంత్రణ కమిషన్​ను ఏర్పాటు చేయాలి. 

నియామకాలు చేపట్టాలి

ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక టీచర్ ను, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్, తరగతుల వారీగా టీచర్లను నియమించి నాణ్యమైన విద్యను అందించాలి. సబ్జెక్టువారీగా అన్ని సబ్జెక్టులకు రెగ్యులర్ టీచర్లను నియమించాలి. విద్యాశాఖలో ఉన్న అన్ని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. ముఖ్యంగా టీచర్లు, పర్యవేక్షణ అధికారులను యుద్ధప్రాతిపదికన నియమించాలి. చివరగా గత పది సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురి అయిన ప్రభుత్వ విద్య ను గాడిలో పెట్టాలంటే  విద్యకు రాష్ట్ర బడ్జెట్లో కనీసం  20 శాతం నిధులను కేటాయించాలి. కేటాయించిన నిధులను  ఖర్చు చేసేవిధంగా బలమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. 

- ఆర్. వెంకట రెడ్డి,జాతీయ కన్వీనర్,ఎం.వి. ఫౌండేషన్