పాత మట్టి మిద్దె కూలి దంపతులు మృతి

పాత మట్టి మిద్దె కూలి దంపతులు మృతి

నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లిలో పాత మట్టి మిద్దె కూలి దంపతులు మృతి చెందారు. భారీ వర్షానికి మిద్దె నాని నిద్రిస్తున్న భద్రయ్య, వెంకటమ్మపై పడడంతో అక్కడికక్కడే చనిపోయారు. 
    
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : పాత మట్టి మిద్దె కూలి భార్యాభర్తలు చనిపోయారు. నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలో జరిగిందీ ఘటన. ఆదివారం భారీ వర్షం పడడంతో రాత్రి 11.40 గంటల టైంలో మిద్దె ముందుభాగం కూలిపోయింది. ముందువైపు గదిలో నిద్రిస్తున్న భార్యాభర్తలు భోగరాజు భద్రయ్య (64) వెంకటమ్మ (61) పడింది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో పక్క గదిలోనే ఉన్న కొడుకు మల్లయ్య, ఆయన భార్యాపిల్లలు బయటకు వచ్చారు. కేకలు వేయడంతో దగర్లో వినాయక మండపం వద్ద ఉన్న యువకులు, గ్రామస్తుల వచ్చి మట్టి, పెంకులు తొలగించే ప్రయత్నంచేశారు. తడిసిన గోడల నుంచి కరెంట్ పాస్ అవుతుండటంతో లైన్ మన్‌‌ను పిలిపించి కనెక్షన్ కట్ చేయించారు. తర్వాత మట్టి గడ్డలు, పెంకులు తొలగించారు. అప్పటికే దంపతులిద్దరూ కన్నుమూశారు.

డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చి ఉంటే..

దాదాపు 70 ఏండ్ల కింద కట్టిన మట్టిమిద్దెలో భద్రయ్య ఫ్యామిలీ ఉంటున్నది. హమాలీ పని చేసుకుంటూ బతికే భద్రయ్య, ఆయన కొడుక్కి.. సొంతంగా ఇల్లు నిర్మించుకునే స్థోమత లేదు. పేదలందరికీ డబుల్ బెడ్​రూం ఇండ్లు ఇచ్చి తీరుతామని సీఎం కేసీఆర్ హామీతో తమకూ ఓ ఇల్లు వస్తుందని ఆ కుటుంబం ఆశపడింది. కానీ ఇప్పటివరకు తెల్కపల్లి మండలంలో ఏ ఒక్క గ్రామంలోనూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు సాంక్షన్ కాలేదు. జాగా ఉన్నవాళ్లు ఇల్లు కట్టుకునేందుకు ఇస్తామన్న పైసలు కూడా ఇవ్వలేదు.  డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చి ఉంటే రెండు ప్రాణాలు నిలిచేవి.