13 ఏండ్ల కింద రోడ్డు పక్కన దొరికిన అనాథ.. పెంచి పెద్దచేస్తే ప్రాణం తీసింది..!

13  ఏండ్ల కింద రోడ్డు పక్కన దొరికిన అనాథ.. పెంచి పెద్దచేస్తే ప్రాణం తీసింది..!
  • బాలిక ప్రేమలో పడటంతో మందలించిన తల్లి
  • నిద్ర మాత్రలు ఇచ్చి దిండుతో గొంతు నొక్కి హత్య చేసిన బాలిక
  • సహకరించిన ప్రియుడు, స్నేహితుడు
  • ఇన్​స్టా గ్రామ్​లో మర్డర్ చాటింగ్​తో వెలుగులోకి

భువనేశ్వర్: చెత్త కుప్పలో ఏడుస్తున్న రోజుల పసికందును చూసి అయ్యో పాపమని చేరదీసింది. అక్కున చేర్చుకుని తల్లిలా లాలించింది. అడిగిందల్లా కొనిస్తూ అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. స్కూలుకు పంపిస్తూ చదివిపిస్తోంది. అయితే, అదే ఆ మహిళ పాలిట శాపమైంది. చివరికి ఆ 13 ఏండ్ల బాలిక చేతిలోనే ఆ మహిళ దారుణ హత్యకు గురైంది. ఇప్పుడు 8వ తరగతి చదువుతున్న ఆ బాలిక తన బాయ్ ఫ్రెండ్​తో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. ఒడిశాలోని గజపతి జిల్లా పర్లాకిమిడి టౌన్​లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

హత్యకు సంబంధించిన వివరాలను పోలీసులు శనివారం మీడియాకు వెల్లడించారు. 54 ఏండ్ల రాజ్యలక్ష్మి కర్ ఒడిశాలోని భువనేశ్వర్​లో నివాసం ఉండేది. 13 ఏండ్ల కింద రోడ్డు పక్కన చెత్త కుప్పలో ఆమెకు 3 రోజుల ఆడ శిశువు ఏడ్పు వినిపించింది. భర్తను ఒప్పించి ఆ పసికందును రాజ్యలక్ష్మి చేరదీసింది. ఆ తర్వాత ఏడాదికే భర్త చనిపోవడంతో కష్టపడి శిశువును పెంచుకుంటోంది. 

కూతురు చదువు కోసం భువనేశ్వర్ వదిలి పర్లాకిమిడికి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నది. నిండా పదమూడేళ్లులేని ఆ బాలిక తనకంటే  పెద్ద వయసు ఉన్న గణేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రథ్‌‌‌‌‌‌‌‌ (21) అనే యువకుడితో ప్రేమలో పడింది. దీనిని గమనించిన రాజ్యలక్ష్మి.. బాలికను మందలించింది. దీంతో తల్లిని అడ్డు తొలగించి ఆస్తి మొత్తం కొట్టేయాలని ప్రియుడితో పాటు 20 ఏండ్ల ఫ్రెండ్ అయిన దినేశ్ సాహు అలియాస్‌‌‌‌‌‌‌‌ అమన్‌‌‌‌‌‌‌‌ తో కలిసి ప్లాన్ వేసింది.

పట్టిచ్చిన ఇన్​స్టా చాటింగ్ 

ఏప్రిల్ 29వ తేదీ సాయంత్రం తల్లికి నిద్రమాత్రలు ఇచ్చింది. ఆమె స్పృహ కోల్పోయాక రథ్, సాహులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. ముగ్గురూ కలిసి రాజ్యలక్ష్మిని దిండుతో గొంతు నొక్కి హత్య చేశారు. ఆ తర్వాత హాస్పిటల్​కు తరలించి గుండెపోటు వచ్చిందని నమ్మించారు. ఆమెకు గతంలో గండె సంబంధిత జబ్బు ఉండటంతో బంధువులు కూడా ఇదే నిజమని నమ్మి అంత్యక్రియలు పూర్తిచేశారు. 

ఈ ఘటన జరిగిన 2 వారాల తర్వాత సదరు బాలిక మొబైల్ ఫోన్ ను రాజ్యలక్ష్మి సోదరుడు సిబా ప్రసాద్ మిశ్రా చెక్ చేశాడు. రాజ్యలక్ష్మి హత్యకు సంబంధించిన ప్లాన్ అంతా సదరు బాలిక రథ్, సాహుతో ఇన్ స్టాగ్రామ్ లో చేసిన డిస్కషన్ అంతా కనిపించింది. రాజ్యలక్ష్మిని చంపేశాక నగదు, బంగారంతో పారిపోవాలని వారి ప్లాన్. మే 14న పర్లాకిమిడి పోలీసులకు మిశ్రా ఫిర్యాదు చేశాడు. 

సదరు బాలికతో పాటు పూజారి అయిన గణేశ్ రథ్ (21), దినేశ్ సాహు (20)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురిని విచారించగా.. రాజ్యలక్ష్మిని హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. హత్య చేశాక రాజ్యలక్ష్మికి సంబంధించిన నగలను సదరు బాలిక గణేశ్ రథ్​కు ఇచ్చింది. అతను వాటిని దాదాపు రూ. 2.4 లక్షలకు తాకట్టు పెట్టగా మరో 30 గ్రాముల నగలు లభించినట్లు పోలీసులు తెలిపారు. 3 మొబైళ్లు స్వాధీనం చేసుకుని ఇద్దరు యువకులను కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్పీ జతీంద్రనాథ్‌‌‌‌‌‌‌‌ పండా చెప్పారు.