విశ్లేషణ: సంచార జాతులు, ఎంబీసీ కులాలు ఒకటి కాదు

విశ్లేషణ: సంచార జాతులు, ఎంబీసీ కులాలు ఒకటి కాదు

కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో కూడా సంచార జాతులు, ఎంబీసీ కులాలు తమ గుర్తింపు కోసం పోరాడుతూనే ఉన్నాయి. వీరి దుస్థితికి పాలకుల నిర్లక్ష్యమే ప్రధాన కారణం. రాష్ట్ర ప్రభుత్వం సంచార జాతులను, ఎంబీసీ కూలాలను ఒకే గాటన కట్టేస్తోంది. ఎంబీసీ కార్పొరేషన్​ను ఏర్పాటు చేసి.. సంచార జాతుల జాబితా నుంచి ఫెడరేషన్లు, కార్పొరేషన్లు ఉన్న కులాలను తీసేసి మిగిలిన వాటిని ఎంబీసీ కులాల జాబితాగా ప్రకటించింది. వాస్తవానికి సంచార జాతులకు, ఎంబీసీలకు, బీసీలకు మధ్య సాంఘిక, ఆర్థిక, విద్య, రాజకీయ పరంగా చాలా అంతరాలు ఉన్నాయి. అది గుర్తించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం సంచార జాతులు, ఎంబీసీ కులాల ఆత్మగౌరవంతో ఆటలాడుకుంటోంది. సంచార జాతులు, ఎంబీసీ కులాలను కాపాడేలా ప్రత్యేక పథకాలను సర్కారు తీసుకురావాలి. అప్పుడే వారి జీవితాల్లో మార్పు చూడగలం.

తెలంగాణలో జనాభా పరంగా చూస్తే, ఎంబీసీలు దాదాపుగా 25 శాతం, డీఎన్‌‌టీలు(సంచార జాతులు) దాదాపుగా 10శాతం ఉంటారు. సంచార జాతులు, ఎంబీసీలు వెనుకబడటానికి చారిత్రక నేపథ్యం లేకపోలేదు. ఆనాటి స్థానిక పాలకులు అణిచివేయాలనే సాకుతో కొన్ని కులాలను క్రిమినల్ ట్రైబల్  యాక్ట్ 1871 పేరుతో బార్న్  క్రిమినల్స్ గా చిత్రీకరించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అనంతశయనం అయ్యంగార్  కమిటీ రిపోర్టు ప్రకారం దేశవ్యాప్తంగా ఇలాంటి వారు రెండు కోట్ల మంది ఉన్నారని గుర్తించి 1952లో డీనోటిఫై చేసి డీఎన్టీలుగా మార్చారు. వీరే సంచార జాతుల వారు.
రాష్ట్ర పాలకుల వైఫల్యం
గ్రామీణ వ్యవస్థలో కీలకంగా ఉన్న బీసీలను ముఖ్యంగా వ్యవసాయేతర కులవృత్తిదారులు, చేతివృత్తిదారులు, సేవా కులాల వారిని గ్రామ కట్టుబాట్ల పేరుతో విద్యకు, వ్యవసాయానికి దూరం చేసి కుల వృత్తికే పరిమితం చేశారు. వారి వృత్తికి గౌరవం ఇవ్వకుండా, కనీసం విలువ కూడా ఇవ్వకుండా సామాజికంగా, ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయేలా చేసింది ఆనాటి భూస్వామ్య వ్యవస్థ. స్వాతంత్ర్యం తర్వాత వచ్చిన ప్రజాస్వామ్య మార్పులను, అవకాశాలను వీరు అందుకోలేకపోవడానికి కారణం వేల సంవత్సరాల మానసిక ఒత్తిడే. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవడంలో తెలంగాణ పాలకులు కూడా వైఫల్యం చెందారు. ఈ 75 ఏండ్లలో సంచార జాతులు, ఎంబీసీలు, బీసీల మధ్య అంతరాలు ఇంకా ఎక్కువయ్యాయి. ఈ అంతరాలను తగ్గించే కార్యక్రమాలు, పథకాలు తేవడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. అయితే కేంద్ర ప్రభుత్వాలు గడిచిన ఒకటిన్నర దశాబ్దాలుగా దేశంలో అత్యంత నిరాదరణకు గురైన సంచార జాతులను గుర్తించడం, వారి సంక్షేమం, అభివృద్ధిపై శ్రద్ధ పెట్టాయి. వీరిపై అధ్యయనం కోసం పలు కమిషన్స్​ను ఏర్పాటు చేశాయి. ఈ కమిషన్లు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి ఆయా రాష్ట్రాల్లోని సంచార జాతి కులాల జాబితా సేకరించాయి. కమిషన్లు తమ నివేదికలు, సిఫార్సులను కేంద్రానికి అందించాయి. వీటి ఆధారంగా ‘‘సంచార జాతుల వెల్ఫేర్, డెవలప్మెంట్ బోర్డు’’ను 2019 జూన్లో కేంద్రం ఏర్పాటు చేసింది.
అన్ని రకాలుగా నష్టం
కేసీఆర్ ప్రభుత్వం మొదటి నుంచి అధికారాన్ని కాపాడుకోవడానికి చూస్తోంది తప్ప, ప్రజాస్వామిక విలువలకు గౌరవం ఇవ్వడం లేదు. ఈ దృష్టికోణం వల్లనే సంచార జాతులు, ఎంబీసీలకు అన్ని రకాలుగా నష్టం జరుగుతోంది. కుల, ధన బలం కలిగిన సామాజిక వర్గాలకు పాలనలో ప్రాముఖ్యత పెంచుతూ వచ్చింది. కానీ ఎలక్షన్స్ ముందు సంక్షేమం, అభివృద్ధి పేరుతో సంచార జాతులు, ఎంబీసీలను దగ్గర చేసుకోవాలన్న ఎత్తుగడలతో ఆచరణకు వీలుకాని హామీలతో ఆశ పెట్టడం.. ఎలక్షన్స్ తర్వాత వారిని విస్మరించడం కేసీఆర్ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య. ఇలాంటి హామీలతోపాటు కులాల మధ్య వైషమ్యాలను పెంచే గందరగోళ పథకాలను ప్రవేశపెట్టడం వల్ల సంచార జాతులు, ఎంబీసీల అస్తిత్వం, సంక్షేమాన్ని దెబ్బతీయడంలో కేసీఆర్ సర్కారు సఫలమైంది.
సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా..
తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015లో రాష్ట్ర వెనుకబడిన తరగతుల శాఖకు లెటర్​ రాసిన జాతీయ విముక్తి జాతుల కమిషన్ రాష్ట్ర వెనుకబడిన తరగతుల జాబితాలో ఉన్న సంచార జాతుల కులాలను తేల్చాలని కోరింది. 2018 జులైలో కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ రిపోర్ట్ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2లోని కులాలను తీసుకొని వివిధ జిల్లాలకు సంబంధించిన సంచార జాతుల నాయకులతో సమావేశమై వారి సూచనలతో తెలంగాణ సంచార జాతుల జాబితాను రూపొందించింది. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా రాష్ట్రంలోని సంచార జాతుల కులాలను ఖరారు చేసి జాబితాను రాష్ట్ర ప్రభుత్వమే జాతీయ సంచార జాతుల కమిషన్ కు పంపించింది. 
స్పష్టత లేని జీవో 16
2016 పంద్రాగస్టు ప్రసంగంలో సీఎం కేసీఆర్.. బీసీల్లో అత్యంత వెనుకబడిన వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయటానికి ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, ఎంబీసీలైన రజక, నాయీబ్రాహ్మణ, కుమ్మరి, కమ్మరి లాంటి వ్యవసాయేతర చేతివృత్తులు, కుల వృత్తుల వారి జీవితాల్లో వెలుగులు నింపుతామని ప్రకటించారు. దీనికి అనుగుణంగా 2017లో జీవో 6, 7 ద్వారా తెలంగాణ స్టేట్ మోస్ట్ బ్యాక్వార్డ్​ క్లాసెస్  డెవలప్మెంట్ కార్పొరేషన్​ను ఏర్పాటు చేశారు. ఎంబీసీ కులాల జాబితా రూపొందించకుండా, కార్పొరేషన్ కు పూర్తిస్థాయి పాలకమండలి లేకుండా చైర్మన్ గా తాడూరి శ్రీనివాస్ ప్రజాపతిని నియమించారు. ఆ తర్వాత 2018 జులైలో జీవో 16 ద్వారా ఎంబీసీ కులాల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఆ జాబితాలో ఎంబీసీ కులాలే లేవు. సంచార జాతుల కులాల జాబితా నుంచి ఫెడరేషన్లు, కార్పొరేషన్లు ఉన్న సంచార జాతుల కులాలను తీసేసి మిగిలిన వాటిని ఎంబీసీ కులాల జాబితాగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 16 గొప్పతనం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో అశాస్త్రీయంగా విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కులాల జాబితాను మక్కీకి మక్కీ కాపీ కొట్టింది కేసీఆర్ ప్రభుత్వం. దీంతో ఆంధ్రా పాలకులైనా, తెలంగాణ పాలకులైన సంచార జాతులు, ఎంబీసీ కులాల గుర్తింపు, సంక్షేమం, అభివృద్ధిపై  ఒకేలా ప్రవర్తిస్తారని రుజువైంది. సంచార జాతులు, ఎంబీసీ కులాల నాయకులు ఈ జీవోను మార్చాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. సంచార జాతుల వారికి భారీగా నిధులు దక్కుతాయని భావించినా అదీ జరగలేదు. 
ప్రత్యేక పథకాలు రూపొందించాలె
కేసీఆర్ ప్రభుత్వం సంచార జాతులు, ఎంబీసీ కులాల ఆత్మగౌరవంతో ఆటలాడుకుంటోంది. వారి అస్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తోంది. తమ గొంతు వినిపించే అవకాశం లేని ఈ కులాలు.. ప్రభుత్వ ద్వంద్వ నీతిని అర్థం చేసుకోలేవని అనుకుంటే అది ప్రభుత్వ అజ్ఞానమే అవుతుంది. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి... కానీ ప్రజలు అస్తిత్వం, ఆశయాలు, ఆకాంక్షలు, ఆత్మగౌరవం కోసం ఉద్యమిస్తారని రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాలి. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రభుత్వం పనిచేయాలి తప్ప.. సంక్షేమం ముసుగులో అస్తిత్వాన్ని దెబ్బతీయాలని అనుకుంటే తగిన మూల్యం చెల్లించకతప్పదు. ఇప్పటికైనా పాలకులు పెద్ద మనసుతో ఆలోచించి సంచార జాతులు, ఎంబీసీ కులాల అస్తిత్వం, ఆత్మగౌరవం కాపాడే అభివృద్ధి, సంక్షేమ పథకాలను రూపొందించాలి.

బడ్జెట్ ఎక్కువ.. ఖర్చు తక్కువ
రాష్ట్ర ప్రభుత్వం 2017 నుంచి 2021 వరకు ఎంబీసీ కార్పొరేషన్ కు కేటాయించిన మొత్తం బడ్జెట్ రూ.2,505 కోట్లు. ఇందులో విడుదల చేసింది రూ.351 కోట్లు, ఖర్చు చేసింది రూ.7.1 కోట్లు కగా, లబ్ధిదారుల సంఖ్య 1,419 మాత్రమే. అంటే బడ్జెట్ కేటాయింపుల్లో విడుదల చేసింది 14 శాతం అయితే ఖర్చు చేసింది 0.3 శాతం కన్నా తక్కువే. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవీకాలం ముగిసి దాదాపు ఇరవై నెలలైంది. ఇప్పటివరకు పాలక మండలిని గానీ, చైర్మన్ నుగానీ నియమించలేదు. నిధులు కూడా కేటాయించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పటైన 11  కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు ఏడున్నర సంవత్సరాల్లో కేటాయించిన బడ్జెట్ రూ.897 కోట్లు. ఇందులో విడుదల చేసింది రూ.840 కోట్లు కాగా, ఖర్చు చేసింది మాత్రం రూ.155.5 కోట్లే. మొత్తం లబ్ధిదారుల సంఖ్య 30 వేల లోపే ఉంది. ఈ కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నుంచి పాలకమండళ్లు లేవంటే కేసీఆర్ ప్రభుత్వానికి ఎంబీసీలపై ఉన్న ప్రేమ ఎంతో అర్థమవుతోంది. - సూర్యపల్లి శ్రీనివాస్, రాష్ట్ర కో కన్వీనర్, బీజేపీ ఎంబీసీ సెల్