ప్రశ్నించడం... మేధావుల బాధ్యత

ప్రశ్నించడం... మేధావుల బాధ్యత

ఏ ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా తెలంగాణ ఆస్తిత్వ ఉద్యమం కొనసాగిందో, తెలంగాణ  అనంతరం అధికారికంగా, ఆర్థికంగా అదే ఆధిపత్య వర్గాల కౌగిలిలో ఒదిగిపోయింది. ఇదొక విచిత్రమైన పరిస్థితి. అసలు తెలంగాణ  ఉద్యమమే వివిధ ఉద్యమ శక్తుల్ని వ్యక్తుల్ని ఒక పనిముట్టుగా మార్చి వాడుకున్నాయి. మేధావులు అని పిలవబడే ప్రొఫెసర్​లు, కవులు, కళాకారులు కాకలుతీరిన కొమ్ములు తిరిగిన అనుభవశాలురు, జర్నలిస్టులు అందరూ  ఆధిపత్యం  ఏ రూపంలో ఉన్నా దాని స్వరూప స్వభావాలను బేరిజు వేయడంలో నిర్వచించుకోవడంలో విఫలం చెందాయి . ఇప్పటికీ కొందరు 'అక్షరాల ఊడిగం' చేస్తూనే ఉన్నారు. ఈ  నేపథ్యంగా తెలంగాణ కు ముందు,  తెలంగాణ అనంతరం జరిగిన, జరుగుతున్న పరిణామాలను, పరివర్తనలను లోతుగా విశ్లేషించే ఒక ప్రయత్నం ఇది.

టీఆర్​ఎస్​ పురుడు 

తెలంగాణను  ఆంధ్రలో కలిపినప్పటి నుంచే అశేష తెలంగాణీయుల మదిలో తమ 'తెలంగాణ రాష్ట్ర కాంక్ష ' అగ్నిపర్వతం కింది లావాలా ఒక్కోసారి మంద్రంగా, మరోసారి తీవ్రస్థాయిలో  తుకతుక ఉడుకుతూనే ఉంది. 1996 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జనసభ తీర్మానాలు నిప్పు మీద కప్పిన నివురును రగిలింపజేసింది.  ఆనాటి అధికార కేంద్రం పంపకాలలో కేసీఆర్ ఊహించిన స్థాయిలో  ప్రభుత్వ అధినాయకుడు సమాదరించకపోవడం ఒక ముఖ్య కారణం గా చూడాలి . హైదరాబాద్ కేంద్రంగా 1998 జూలై 4, 5వ తేదీలలో జన సభ ఏర్పాటు కావడం తెలంగాణ కాంక్షకు మిక్కిలి నైతిక శక్తిని, బలాన్ని చేకూర్చింది. అదే సమయంలో తెలంగాణ ప్రజల్లో తెలంగాణ వివక్ష గురించి మేధావుల భావ ప్రచారం ఊరు వాడని కలుపుతూ వేగంగా సామాన్య ప్రజలలోకి చొచ్చుకుపోవడం జరిగింది. వీటన్నిటి గుండు గుత్తగా తెలంగాణ  ప్రత్యేక వాదులను నాయకులను ప్రారంభంలో కలుపుకొని టీఆర్​ఎస్​ పురుడు పోసుకుంది. 

ప్రజాసంఘాల ఉనికి పట్ల చిన్నచూపు

ప్రజా సంఘాల  ఉనికి  పట్ల దాని నాయకుల పట్ల తెరాస నాయకత్వం మొదటి నుంచి చిన్నచూపు, న్యూనత ప్రదర్శించింది. తెలంగాణ అనంతరం అది మరింత పె(హె)చ్చరిల్లిపోయింది . ఆంధ్ర పెట్టుబడిదారుల గేట్ల ముందు ధర్నాలు, వ్యతిరేక రాస్తారోకోలు, బతుకమ్మ జాతరలు, పత్రికా ప్రకటనలు చేసి నయాన భయాన, పరోక్షంగా,  ప్రత్యక్షంగానూ 'ఈతాకు వేసి తాటాకు తీసుకునే' చందాల దందాకు అంకురార్పణ జరిగింది. 

ఇది ఇలా ఉంటే శాసనసభ ఎన్నికల్లో  పోటీ చేసే అభ్యర్థులకు నాయకుడు అందుబాటులో ఉండకపోవడం ఒకవేళ ఉన్నప్పటికీ దర్శనం  దొరకకపోవడం దొరికితే  ప్రచారం పేరున డబ్బులు వసూలు చేయడం ఆది నుంచి టీఆర్​ఎస్​ పార్టీలో కొనసాగుతూనే ఉంది. చురుకుగా పాల్గొన్న మేధావులు ఎన్నడు కూడా ఈ ఖర్చులు వ్యయం నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయని తమను తాము ప్రశ్నించుకోలేదు. తెలిసినా కూడా నాయకత్వాన్ని కించిత్తు అడగ సాహసించలేదు. పైగా నాయకుని పంచలో కాకుంటే చంకలో చేరారు. చివరికి రాష్ట్రం సిద్ధించాక వీరి పాత్ర  పెద్ద విషాదాంతంగా మారింది లేక ముగిసిపోయింది. తెలంగాణ రాష్ట్ర అనంతరం ప్రజాసంఘాల నాయకుల పట్ల వాళ్ల బలహీనతల పట్ల నాయకునికి తన బలం పట్ల స్పష్టమైన అవగాహన ఏర్పడింది.

అన్ని సార్లూ మోసం చేయలేరు

లక్షల సంవత్సరాల నుండి  పోగుపడిన సహజ వనరుల సంపద తరలింపు ఇబ్బడి ముబ్బడిగా   జరిగింది. ఇది అంతా అభివృద్ధి పేరున జరిగినట్టు ప్రచార ఆర్భాటంతో  నమ్మించగలిగారు. అయితే  మేధావులు, కవులు, రచయితలు ఈ క్రమాన్ని ప్రజలకు విశదీకరించడంలో, విప్పి చెప్పడంలో  వైఫల్యం చెందటం వల్ల నేటి తెలంగాణలో ఇటువంటి స్థితిగతులు దాపురించాయి . ఏదేమైనా ఒకటి మాత్రం నిజం.  కొందరిని కొన్నిసార్లు మోసం చేయవచ్చు కానీ అందర్నీ అన్నిసార్లు మాటలతో బోలు వాగ్దానాలతో మోసం చేయలేమని పాలకవర్గాలు తెలుసుకోవాల్సిన  వాస్తవం. దీన్ని నేటి మేటి నాయకమన్యులు తెలుసుకోవడానికి   ఇచ్చ గించకపోతే  వచ్చే ఎన్నికల బరిలో ప్రజా బోనులో ఊహించని విషమ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది.  చివరికి చేదు అనుభవాన్ని మిగిల్చినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. ప్రశ్నించే బాధ్యత నుంచి మేధావులు తప్పుకోవద్దని మాత్రం తొమ్మిదేళ్ల కాలం గుర్తుచేస్తున్నది.

అసలు రూపం బయటపడ్డది

ఉద్యమ కాలంలోనే నాయకుడు చాలామంది పెద్దలకు  అపాయింట్మెంట్లు ఇవ్వలేదు. అటువంటి నాయకుడు పూర్తి కాల రాజకీయ లీడర్ గా  పరివర్తనం చెందాక అధికారంలోకి వచ్చాక ఆ అవకాశం  బొత్తిగా  లేకుండా అయిపోయింది. ఇంద్రజాల మ్యాజిక్ బాక్స్ లోంచి కేవలం ఓట్లను దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క పథకాన్ని బయటకు తీసి ప్రజలకు మేలు  చేస్తున్నామని భ్రమలు  కలిగించాడు. నాయకుడు తన వ్యక్తిత్వంలోని అసలైన మనిషి బయటకు వచ్చి విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. తత్ఫలితంగానే  ఉపాధి పథకం లాంటి తెలంగాణ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులు పుట్టుకొచ్చాయి. ఏ పథకాలు ప్రవేశపెట్టినా ఒక కథ గుర్తుకువస్తుంది. అది ఒక రాజు తన ప్రజలకు రోజూ ఒక చేప ఇస్తూ నేను ప్రజలకు చాలా మేలు చేస్తున్నాను అనుకున్నారట. దీనివల్ల ప్రజలు అసలు ఏమి జరుగుతుంది జనం కళ్ళు తెరిచేసరికి జరగవలసిన నష్టం జరిగింది. ప్రజలకు చేపలు పట్టడం నేర్పాలి కానీ చేప ఇవ్వడం అంటే ప్రజలను సమర్థవంతంగా పక్కదారి పట్టించొచ్చని ఏలికలు భావిస్తుంటారు. తెలంగాణ 9 ఏళ్ల పాలనలో అచ్చంగా ఇదే జరిగింది.

- జూకంటి జగన్నాథం, కవి, రచయిత