న్యాయం చేయందే తీయం.. రెండు రోజులుగా ఇంటి ముందే శవం

న్యాయం చేయందే తీయం.. రెండు రోజులుగా ఇంటి ముందే శవం

 

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్​కోసం ప్రభుత్వం తీసుకున్న19 ఎకరాల భూమికి పరిహారం అందక మనస్తాపంతో కుమ్మెర గ్రామానికి చెందిన అనంత అల్లాజీ బుధవారం ఆత్మహత్య చేసుకోగా గురువారం రాత్రి వరకు ఆయన కుటుంసభ్యులు అంత్యక్రియలు నిర్వహించలేదు. తమకు న్యాయం జరిగేంతవరకు శవాన్ని తీసేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. వీరికి గ్రామస్తులతో పాటు బీజేపీ నేతలు మద్దతు పలికారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకోగా పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్, జనసేన, లెఫ్ట్​పార్టీల లీడర్లు ఊరికి వచ్చి అల్లాజీ కుటుంబానికి సంఘీభావం తెలిపారు.  ఈ సందర్భంగా పలువురిని అరెస్ట్​చేసి పోలీస్​స్టేషన్లకు తరలించారు. 

కేసీఆర్​.. రైతుల ఉసురు తగిలిపోతావ్

అల్లాజీ ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గురువారం గ్రామానికి వచ్చి నివాళులర్పించారు. ఆయన భార్యాపిల్లలను ఓదార్చారు.. సీఎం కేసీఆర్ పై ఫైర్​అయ్యారు. ‘ఇంటికో ఉద్యోగం, రైతులకు పరిహారం, నిర్వాసితులకు నీడ కల్పించిన తర్వాత కుర్చీ వేసుకుని కూర్చొని పాలమూరు ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తానన్న కేసీఆర్​ఎక్కడున్నవ్​? వట్టెం గుట్ట దగ్గర గెస్ట్​ హౌజ్​కట్టించుకుంటా అన్నవ్​ కదా..తొమ్మిదేండ్లకు ఒక మోటార్ పెట్టి ప్రాజెక్టు ప్రారంభించడానికి సిగ్గు..శరం ఉండాలె’ అంటూ ఘాటుగా కామెంట్​చేశారు. హైదరాబాద్ లో ఎకరా భూమిని రూ.100 కోట్లకు అమ్ముతున్న కేసీఆర్​ కుమ్మెరలో అల్లాజీకి ఎకరాకు ఏ విధంగా రూ.2 లక్షల చొప్పున ఇచ్చావని ప్రశ్నించారు. ఐదు ఎకరాలు అవసరం ఉంటే 19 ఎకరాలు ఎందుకు సేకరించారని అడిగారు. అల్లాజీ దగ్గర తీసుకున్న ఐదు ఎకరాలను రూ.75లక్షల పరిహారంతో పాటు 14 ఎకరాలు తిరిగివ్వాలన్నారు. రైతులందరికీ పరిహారం ఇచ్చిన తర్వాతే ప్రాజెక్ట్​ప్రారంభించాలన్నారు. లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. నాగర్ కర్నూల్ బీజేపీ ఇన్​చార్జి దిలీప్ ఇచ్చిన రూ.లక్షను అల్లాజీ భార్యకు అందించారు.

సీఎం టూర్​ను అడ్డుకుంటాం : ఆచారి

అల్లాజీది ఆత్మహత్య కాదని ప్రభుత్వం చేసిన హత్య అని నేషనల్ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి ఆరోపించారు. సీఎం కేసీఆర్​ను ఏ1గా, ఏ2గా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై క్రిమినల్​కేసు నమోదు చేయాలని డిమాండ్​చేశారు. అల్లాజీ కుటుంబానికి న్యాయం జరగకపోతే కేసీఆర్​నార్లాపూర్​టూర్​ను అడ్డుకుంటామని హెచ్చరించారు. అల్లాజీ మృతదేహాన్ని సీఎం కేసీఆర్​సభకు తీసుకొస్తామన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు, లీడర్లు దిలీప్, సుబ్బారెడ్డి, సుధాకర్​ రెడ్డి, కొండ మణెమ్మ పాల్గొన్నారు. 

గ్రామంలో పోలీస్​పికెట్..అరెస్టులు..

గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్​పికెట్​ఏర్పాటు చేశారు. ముగ్గురు ఎస్సైలు దీన్ని పర్యవేక్షిస్తున్నారు. మెగా క్యాంప్​ వైపు ఎవరూ వెళ్లకుండా బలగాలను మోహరించారు. కాంగ్రెస్​లీడర్లు నాగం శశిధర్​రెడ్డి, కూచుకుళ్ల రాజేశ్​రెడ్డి, జనసేన నాయకుడు లక్ష్మణ్​గౌడ్, సీపీఐ లీడర్లు వెంకటయ్య, కృష్ణయ్య అల్లాజీకి నివాళులర్పించారు. బుధవారం రాత్రి దిలీప్​ను అదుపులోకి తీసుకుని తాడూరు పీఎస్​కు తరలించి కొద్దిసేపటికి వదిలేశారు. గురువారం మళ్లీ దిలీప్​తో పాటు సుబ్బారెడ్డి, సుధాకర్​ రెడ్డిలను అరెస్ట్​ చేసి తెల్కపల్లి పీఎస్​కు తరలించారు. అలాగే జనసేన లీడర్​లక్ష్మణ్​ గౌడ్​ను కూడా అదుపులోకి తీసుకుని నాగర్​కర్నూల్​కు తరలించారు.

ఎమ్మెల్యే రాజీ ఫార్మూలా..ఎకరాకు రూ.10 లక్షలు..

అల్లాజీ అంత్యక్రియలు నిర్వహించకపోవడంతో ఉద్రిక్తత తలెత్తగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి.. మృతుడి ఇంటికి సర్పంచ్​ భర్త తిరుపతిరెడ్డిని పంపించారు. అల్లాజీ కుటుంబం కోల్పోయింది ఏడు ఎకరాలని, ఎకరాకు రూ.10 లక్షల చొప్పున ఇస్తామని ఎమ్మెల్యే చెప్పారని వివరించారు. ఎమ్మెల్యే వ్యక్తిగతంగా రూ.5లక్షలు ఇస్తానన్నాడని, రైతు బీమా రూ.5లక్షలు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చాడన్నారు. కానీ, రాత్రికే అంత్యక్రియలు నిర్వహించాలని కండీషన్ ​పెట్టారు. అమావాస్య కావడంతో చేయలేమని, శుక్రవారం ఉదయం నిర్వహిస్తామని చెప్పినా వినలేదు. సీఐ, ఎస్ఐ, ఇతర పోలీసులను అంత్యక్రియలు చేశాకే రావాలని చెప్పడంతో వారు కూడా ప్రయత్నించారు. అయినా ఎంతకీ ఒప్పుకోలేదు. ఏమేం ఇస్తున్నారో చెబుతూ అధికారులు రాతపూర్వకంగా ఇస్తేనే  అంత్యక్రియలు చేస్తామని భీష్మించుకు కూర్చున్నారు.