పర్యావరణ రక్షణ కోసమే అనంతగిరి ప్రదక్షిణ : సునీతా రెడ్డి

పర్యావరణ రక్షణ కోసమే అనంతగిరి ప్రదక్షిణ : సునీతా రెడ్డి

వికారాబాద్, వెలుగు: ఆధ్యాత్మికత, పర్యావరణ పరిరక్షణ కోసం అనంతగిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని పొత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యతని వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ సునీతా రెడ్డి అన్నారు. శుక్రవారం హిందూ జనశక్తి ఆధ్వర్యంలో నిర్వహించిన గిరి ప్రదక్షిణలో భాగంగా అనంతగిరి కొండల చుట్టూ భక్తులు పాదయాత్ర చేపట్టారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ భవానీ ఆలయం నుంచి ఉదయం  6 గంటలకు ప్రారంభమైన ఈ యాత్ర అనంతగిరి కొండల చుట్టూ గోధుమగూడ, జైదుపపల్లి, కెరెళ్లి మీదుగా బుగ్గ రామేశ్వర ఆలయం నుంచి అనంతగిరికి చేరుకుంది. ఈ యాత్రలో పాల్గొన్న సునీతా రెడ్డి మాట్లాడుతూ.. అనంతుని దివ్యక్షేత్రం చుట్టూ భక్తులు 24 కి.మీ  పాదయాత్ర చేయడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో  హిందూ జనశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు లలిత్ కుమార్, మాజీ మంత్రి చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మెతుకు ఆనంద్, బీజేపీ వికారాబాద్ జిల్లా అద్యక్షుడు సదానంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఎంపీడీవోలు బాధ్యతతో పనిచేయాలి

ఎంపీడీవోలు బాధ్యతతో పనిచేయాలని జడ్పీ చైర్ పర్సన్ సునీతా రెడ్డి సూచించారు. వికారాబాద్ జడ్పీ హాల్ లో ఎంపీడీవోలతో ఆమె ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.  గ్రామాల్లో తాగునీటి సరఫరా, టాయిలెట్ల వాడకం, ఇంకుడు గుంతలు,  హరితహారం, పశువులకు తాగునీటితో పాటు అర్హులైన వారికి ఆసరా పెన్షన్లు లాంటి వాటిపై  పర్యవేక్షణ చేయాలన్నారు. 

ముగిసిన అనంత పద్మనాభ స్వామి జాతర

పది రోజుల పాటు వైభవంగా జరిగిన అనంత పద్మనాభ స్వామి జాతర ముగిసింది. జాతరకు వివిధ రాష్ట్రాలతో పాటు జిల్లాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం పద్మనాభుడికి చక్ర స్నానంతో జాతర ముగిసిందని ఆలయ కమీటీ సభ్యులు తెలిపారు.