మీ పిల్లలకు ఉడకని అన్నమే పెడ్తరా?. ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఫైర్

మీ పిల్లలకు ఉడకని అన్నమే పెడ్తరా?. ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఫైర్

పుల్కల్, వెలుగు : హాస్టల్​ నిర్వహణ బాగోలేదని, ఇలాంటి హాస్టల్ ను తాము ఎక్కడా చూడలేదని సింగూర్ రెసిడెన్షియల్ స్కూల్ సిబ్బందిపై అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, సంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం వారు పుల్కల్ మండలంలో పీహెచ్​సీ కొత్త భవన నిర్మాణానికి, మిన్పూర్ లో బీటి రోడ్డు పనులతో భూమి పూజ చేసి, సింగూర్ ప్రాజెక్ట్ ఎడమ కాల్వ ద్వారా నీటిని విడుదల చేశారు. అనంతరం సింగూర్ రెసిడెన్షియల్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్ లో ఉడకని అన్నం, కారంతో చేసిన నీళ్ల చారు చూసి ‘మీ పిల్లలకు ఇలాగే పెడతారా’ అని సిబ్బందిపై మండిపడ్డారు. మరుగుదొడ్ల నిర్వహణ సరిగ్గా లేక దుర్వాసన వస్తున్నాయన్నారు. సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. ఆర్​సీవో బీరయ్యతో ఫోన్ లో మాట్లాడి సమస్యలను వివరించారు. 

ధరణి సమస్యలు పరిస్కరిస్తాం..

మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన జనరల్​ బాడీ సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా శివ్వంపేట ఎంపీటీసీ కిరణ్​గౌడ్ మాట్లాడుతూ ధరణి పోర్టల్ లో ఎడిట్ ఆప్షన్ లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ త్వరలో ధరణి సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన ఇనాం భుములకు త్వరలో పట్టాలను అందజేస్తామన్నారు. శివ్వంపేటలో రైతులకు క్లస్టర్ ఏర్పాటు చేసి వేదిక నిర్మణం చేయాలని సర్పంచ్​ల ఫోరం అధ్యక్షుడు బక్కరెడ్డిగారి కిష్టారెడ్డి కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ చైతన్యవిజయ్​ భాస్కర్ రెడ్డి, తహసీల్దార్లు స్వర్ణలత, కిష్టయ్య, ఎంపీడీవో మధులత, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు విజయ్ కుమార్, ఆత్మకమిటీ చైర్మన్ యాదగిరి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.