ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

 ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
  • 12 వేల బిల్డింగులు నిర్మిస్తాం
  • పోడు పట్టాలపై ఆఫీసర్లు సర్వే చేయాలి

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: వచ్చే ఏడాది నుంచి ప్రతీ గ్రామంలో అంగన్వాడీ  సెంటర్‌‌ ఏర్పాటు చేస్తామని, 12వేల సెంటర్లకు సొంత భవనాలు నిర్మిస్తామని రాష్ట్ర గిరిజన, స్త్రీ-, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌‌ అన్నారు. బుధవారం భూపాలపల్లి మండలంలో మంత్రి పర్యటించారు. సెగ్గంపల్లి గ్రామంలో రూ.7.80లక్షలతో నిర్మించిన అంగన్ వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. రూ.1.10 కోట్లతో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బాలికల రక్షణ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జెన్‌‌ కో గెస్ట్‌‌హౌజ్‌‌లో పోడు భూములపై ఆఫీసర్లతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్‌‌ మాట్లాడుతూ.. అటవీ సంపదను సంరక్షించుకోవడంతో పాటు అర్హులకు పోడు పట్టాలు అందించేందుకు ఆఫీసర్లు కృషి చేయాలన్నారు. ఇందుకోసం అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు తప్పకుండా పాటించాలన్నారు. ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా బాలింతలకు, గర్భిణిలకు పౌష్టిక ఆహారం అందిస్తున్నట్లుగా ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ టీచర్లకు  నెలకు  రూ.13వేల చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, భూపాలపల్లి, మంథని ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, శ్రీధర్ బాబు, అడిషనల్ కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీవో అంకిత్, జిల్లా ఎస్పీ సురేందర్  తదితరులు పాల్గొన్నారు.

టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే

ములుగు,జనగామ, వెలుగు: టీఆర్ఎస్​కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని ఆ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, జనగామ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్​ రెడ్డి అన్నారు. ఈనెల 22న హైదరాబాద్​ పెద్ద అంబర్​పేట్​ లో నిర్వహించే నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం ఆయా జిల్లా కేంద్రాల్లో మండల అధ్యక్షులు, జిల్లా పధాధికారులతో మీటింగ్ నిర్వహించారు. బహిరంగ సభకు జిల్లాల నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని అన్నారు. సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన కొత్తపల్లి సతీశ్​కు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఆయన ప్రాథమిక సభ్యత్వం కూడా లేదన్నారు. బూత్ స్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేయడానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ లీడర్లగ నగరపు రమేశ్, అజ్మీర కృష్ణవేణి నాయక్​, తాటి కృష్ణ, భూక్య రాజు నాయక్, సిరికొండ బలరాం, భద్రాచలం నియోజకవర్గ కన్వీనర్​ త్రినాథ్​రావు, డి.వాసుదేవరెడ్డి, కొత్త సురేందర్ తదితరులున్నారు.

బాల అదాలత్ లో భారీగా పిటిషన్లు

పాల్గొన్న మాజీ ఎంపీ వినోద్ కుమార్

హనుమకొండ కలెక్టరేట్, వెలుగు: హనుమకొండ కలెక్టరేట్ లో బుధవారం నిర్వహించిన బాల అదాలత్ కార్యక్రమానికి 345 పిటిషన్లు వచ్చాయి. ఈ ప్రోగ్రాంకు చీఫ్ గెస్టుగా రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, మాజీ ఎంపీ బోయినపల్లి వినో ద్ కుమార్, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్​జోగినిపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు. ప్రజలంతా పిల్లలపై జరిగే దాడులు, అఘాయిత్యాలను అడ్డుకోవాలన్నారు. బాలల విద్య, వైద్యం, ఆరోగ్యం, పౌష్టికాహారం విషయంలో ఎలాంటి తేడాలు వచ్చినా కమిషన్ చర్యలు తీసుకుంటుందన్నారు. కాగా, ఈ ప్రోగ్రాంలో తల్లిదండ్రులు తమ పిల్లల బాధను ఏకరువు పెట్టారు. తమ పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆపరేషన్ల కోసం డబ్బులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఆఫీసర్లు పాల్గొన్నారు.

మావోయిస్టులకు సహకరించొద్దు

వెలుగు నెట్ వర్క్: మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏజెన్సీ ఏరియాలు, తెలంగాణ–చత్తీస్ గఢ్ బార్డర్ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. రోడ్లపై వెహికల్స్ చెక్ చేస్తున్నారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ప్రలోభాలకు తలొగ్గి, మావోయిస్టులకు సహకరిస్తే చర్యలు తప్పవని భూపాలపల్లి సీఐ రాజిరెడ్డి, కొయ్యూరు ఎస్సై సత్యనారాయణ హెచ్చరిస్తున్నారు. 

స్టూడెంట్లు భవిష్యత్తులో రాణించాలి

మహబూబాబాద్ అర్బన్, వెలుగు: కాలేజీలో మెరుగైన మార్కులు సాధించిన స్టూడెంట్లు భవిష్యత్తులోనూ రాణించాలని గౌతమి విద్యాసంస్థల డైరెక్టర్ తక్కెళ్లపల్లి సంధ్యారాణి ఆకాంక్షించారు. 2019లో ఆమోషా అనే స్టూడెంట్ కాలేజీలో బైపీసీ చదువుకుంది. తాజాగా విడుదలైన పీజీ ఎంట్రన్స్ టెస్టులో బాటనీ విభాగంలో 84 ర్యాంక్, కెమిస్ట్రీ విభాగంలో 670వ ర్యాంక్ సాధించింది. దీంతో బుధవారం కాలేజీ యాజమాన్యం ఆమెను సత్కరించింది. డైరెక్టర్ సంధ్యారాణి రూ.5వేల ఆర్థిక సాయం చేశారు. కార్యక్రమంలో మార్గదర్శి బీఈడీ కాలేజీ ప్రిన్సిపల్ అరుణ్ కుమార్, విజ్ఞాన భారతి డిగ్రీ, పీజీ కాలేజీల ప్రిన్సిపల్స్ యాకుబ్​పాషా, గౌతమి కాలేజీ ప్రిన్సిపల్ మహేందర్ తదితరులున్నారు.

ఏపీవో తీరుపై సభ్యుల ఆగ్రహం

చిట్యాల, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలకేంద్రంలో బుధవారం ఎంపీపీ దావు వినోద అధ్యక్షతన మండలసభ జరిగింది. ఈజీఎస్ ఏపీవో అలీం తీరుపై సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పనులు చేయించకపోగా, బిల్లులు చెల్లింపులో నిర్లక్ష్యం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. పద్ధతి మార్చుకోవాలని, సకాలంలో డబ్బులు అందేలా చూడాలని మందలించారు. కరెంట్​ఏడీఈని ఇక్కడి నుంచి తొలగించాలని సభ్యులు తీర్మానం చేశారు. గతంలో మరుగుదొడ్ల నిర్మాణంలో జరిగిన అవినీతి డబ్బులను రికవరీ చేయాలని కోరుతూ సీఆర్​పల్లి, కొత్తపేట సర్పంచ్​లు సభను బహిష్కరించి వెళ్లిపోయారు. రైతువేదిక డబ్బులు రావడం లేదని పలువురు ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తొందరగా బిల్లులు వచ్చేలా చూడాలని ఆఫీసర్లను వేడుకున్నారు. సమావేశంలో ఎంపీడీవో రామయ్య, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులున్నారు.

కేసీఆర్ భజన మాని అభివృద్ధి చేయండి

తొర్రూరు, నెల్లికుదురు, వెలుగు: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాటలు పక్కన పెట్టి ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు చందుపట్ల కీర్తి రెడ్డి, కట్టా సుధాకర్ విమర్శించారు. కేసీఆర్ భజన మానుకొని, నియోజకవర్గ అభివృద్ధిపై దృషిసారించాలన్నారు. బుధవారం తొర్రూరులో వారు మీడియాతో మాట్లాడుతూ.. సెగ్మెంట్​లో డిగ్రీ కాలేజీ, తొర్రూరులో రిజిస్ట్రేషన్, ట్రెజరీ ఆఫీసులు, ఫైర్ స్టేషన్​ ఏర్పాటు చేస్తామన్న మంత్రి మాట తప్పారన్నారు. పెద్ద చెరువు మినీ ట్యాంక్​బండ్ మారుస్తామని,  పీహెచ్ సీ వంద పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని చెప్పి మోసం చేశారన్నారు. బండి సంజయ్ పాదయాత్ర  ముగింపు సభ పెద్ద అంబర్ పేట్ లో ఉంటుందని కార్యకర్తలంతా తరలిరావాలన్నారు. అనంతరం నెల్లికుదురులో బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్​ తో కలిసి ప్రజా గోస బీజేపీ భరోసా కార్యక్రమం చేపట్టారు. ఆయా కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఒద్దిరాజు రాంచందర్ రావు, నియోజకవర్గ ఇన్​చార్జి పెదగాని సోమయ్య, పల్లె కుమార్, మహేశ్, పులేందర్ తదితరులున్నారు.

ఏపీవో తీరుపై సభ్యుల ఆగ్రహం

చిట్యాల, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలకేంద్రంలో బుధవారం ఎంపీపీ దావు వినోద అధ్యక్షతన మండలసభ జరిగింది. ఈజీఎస్ ఏపీవో అలీం తీరుపై సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పనులు చేయించకపోగా, బిల్లులు చెల్లింపులో నిర్లక్ష్యం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. పద్ధతి మార్చుకోవాలని, సకాలంలో డబ్బులు అందేలా చూడాలని మందలించారు. కరెంట్​ఏడీఈని ఇక్కడి నుంచి తొలగించాలని సభ్యులు తీర్మానం చేశారు. గతంలో మరుగుదొడ్ల నిర్మాణంలో జరిగిన అవినీతి డబ్బులను రికవరీ చేయాలని కోరుతూ సీఆర్​పల్లి, కొత్తపేట సర్పంచ్​లు సభను బహిష్కరించి వెళ్లిపోయారు. రైతువేదిక డబ్బులు రావడం లేదని పలువురు ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తొందరగా బిల్లులు వచ్చేలా చూడాలని ఆఫీసర్లను వేడుకున్నారు. సమావేశంలో ఎంపీడీవో రామయ్య, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులున్నారు.

పోలీసుల పనితీరు భేష్

గూడూరు, వెలుగు: మహబూబాబాద్  జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్ ను బుధవారం డీఐజీ వై.నాగిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణలో గౌరవ వందనం స్వీకరించారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి మొక్క నాటారు. ఆ తర్వాత స్టేషన్ రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ.. గూడూరు పోలీసుల పనితీరు బాగుందని కొనియాడారు. టెక్నాలజీ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని సూచించారు. మావోయిస్టులు ప్రజాదరణ కోల్పోయారని, లొంగి పోయి ప్రజల మన్ననలు పొందాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ సదయ్య, సీఐ యాసిన్, బయ్యారం సీఐ బాలాజీ, ఎస్సైలు సతీష్, నగేశ్, దిలీప్ ఉన్నారు.