
- ఖాళీలు నింపరు.. ఉద్యోగ భద్రత లేదు
- మార్చి 1 నుంచి సమ్మెలోకి అంగన్వాడీ టీచర్లు
- పర్మినెంట్ చేస్తామని పట్టించుకోని ప్రభుత్వం
- ఇతర హామీలూ అమలు కావట్లే
- ఆరోగ్యలక్ష్మి బిల్లులు పెండింగ్పెడుతున్నరు
పెద్దపల్లి, వెలుగు: ఎనిమిదేండ్లుగా రాష్ట్రంలోని అంగన్వాడీల సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయి. తెలంగాణ సర్కార్ఏర్పాటైన నాడు సీఎం కేసీఆర్అంగన్వాడీలను పర్మినెంట్చేస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీల్లో నేటికీ ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదు. పైగా వారితో వెట్టి చాకిరి చేయిస్తున్నారు. ఆరోగ్యలక్ష్మి కోసం ఖర్చుచేసిన బిల్లులను పెండింగ్పెడుతున్నారు. రాష్ట్రంలోని 149 ఐసీడీఎస్ప్రాజెక్టుల్లో 35,700 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇందులో 31,711 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ప్రధాన అంగన్వాడీ కేంద్రాల్లో ఒక టీచర్, హెల్పర్ ఉండగా, మినీ కేంద్రాల్లో ఒక టీచర్మాత్రమే ఉన్నారు. ఖాళీలు పోగా ప్రస్తుతం 58 వేలమంది టీచర్లు, హెల్పర్లు డ్యూటీ చేస్తున్నారు. ఎనిమిదేండ్లుగా పెండింగ్సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం 2021లో గౌరవ వేతనం మాత్రమే పెంచింది. అయితే వారు డిమాండ్చేస్తున్న జాబ్పర్మినెంట్, కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత విషయాలను పట్టించుకోవడం లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిటైర్అయ్యే ఉద్యోగులకు గ్రాట్యుటీ, పెన్షన్ సౌకర్యం కల్పించాల్సి ఉంది. కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు.
పెండింగులోనే టీఏ, డీఏలు
ఎనిమిదేండ్లుగా అంగన్వాడీలకు టీఏ, డీఏలు పెండింగ్లోనే ఉన్నాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆరోగ్యలక్ష్మి, మెనూ చార్జీలు, గ్యాస్ బిల్లులు ఇప్పటివరకు పెంచలేదు. ఆరోగ్యలక్ష్మి కింద నాణ్యమైన ఆహారం అందించాల్సి ఉంటుంది. దానికోసం సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోందని అంగన్వాడీలు వాపోతున్నారు. కనీసం ప్రస్తుత ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు ఇవ్వాలని కోరుతున్నారు. ఆన్లైన్ యాప్లను ప్రవేశపెట్టిన తర్వాత అంగన్వాడీలపై మరింత పనిభారం పెరిగింది. మరోవైపు జిల్లాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీలు, ఆయాల పోస్టులను భర్తీ చేయకుండా సర్కార్ నిర్లక్ష్యం చేస్తోంది. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి మార్చి 1, 2, 3 తేదీల్లో సమ్మెకు దిగాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోనట్లయితే పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
మెనూ చార్జీలు పెంచాలి
మెనూ చార్జీలు దారుణంగా ఇస్తున్నారు. ఎనిమిదేండ్ల క్రితం చార్జీలే ఇప్పుడూ ఇస్తే ఎట్లా? ఆరోగ్యలక్ష్మిలో భాగంగా తల్లులు, పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాల్సి ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో చేతి నుంచి డబ్బులు ఖర్చు చేసి నాణ్యమైన ఆహారం అందిస్తున్నాం. ప్రభుత్వం ప్రస్తుత ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు ఇవ్వాలి.
-
స్వరూప, అంగన్వాడీ టీచర్, పెగడపల్లి
ఉద్యోగ భద్రత కల్పించాలి
అంగన్వాడీ టీచర్లతో వెట్టిచాకిరి చేయిస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించడం లేదు. పెన్షన్, గ్రాట్యుటీ, టీఏ, డీఏ లేదు. పర్మినెంట్చేస్తామని చెప్పి ప్రభుత్వం మరిచిపోయింది. నాణ్యమైన ఆహారం అందించాలని ఆరోగ్యలక్ష్మి ప్రవేశపెట్టి దానికి కావాల్సిన మెనూ చార్జీలు అందిస్తలేరు. వెంటనే డిమాండ్లను సర్కార్ పరిష్కరించాలి.
- వనజాదేవి, అంగన్వాడీ యూనియన్, పెద్దపల్లి జిల్లా ప్రెసిడెంట్