కోపం వల్ల భాష బలహీనపడుతుంది

కోపం వల్ల భాష బలహీనపడుతుంది

పూర్వం ఒక వ్యక్తి బుద్ధుడి వల్ల ఎంతగానో కలత చెందాడు. అందుకే, బుద్ధుడు కనిపించినప్పుడు .. కోపంతో ఆయనపై  ఉమ్మేశాడు. ముఖం తుడుచుకుంటూ చిరునవ్వుతో ‘ఆ వ్యక్తి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. కానీ, చాలా కోపంగా ఉన్నాడు.  దాంతో అతను తన మాటల మీద కంట్రోల్‌‌ తప్పిపోయాడు. అందుకే చెడు కర్మ ఆచరించాడు’ అని పక్కనే ఉన్న తన శిష్యుడు ఆనందుడితో అన్నాడు బుద్ధుడు. ఆ మాటలు విన్న తర్వాత తను చేసిన  పనికి.. ఆ వ్యక్తి చాలా బాధపడ్డాడు. మరుసటి రోజు వచ్చి బుద్ధుడి కాళ్ల మీద పడ్డాడు. అప్పుడు  బుద్ధుడు ఆనందుడి  వైపు తిరిగి ఇలా అన్నాడు.. ‘మాటల మీద కంట్రోల్‌‌ లేని మనిషి.. భాషను సమర్థవంతంగా ఉపయోగించలేడు. ఎందుకంటే కోపంలో తన పదాలను సరిగ్గా ఎంచుకోలేడు’ అని చెప్తాడు.

ఒక వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు, అతని మెదడు సరైన పదాలను ఎంచుకోలేదు. అందుకే, బయటకు వచ్చే  ఆ మాటలు అతని రియల్‌‌ ఫీలింగ్స్‌‌ని బయటపెట్టలేవు. కోపం వల్ల భాష బలహీనపడుతుంది. వినేవాళ్లకు అది చేదుగా అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు చాలామంది గొడవపడుతుంటారు. అంతేకాదు, అవతలి వ్యక్తిని బాధపెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. ముక్కలు ముక్కలైన వాళ్ల మనసు.. ఆ క్షణంలో చెడు కర్మలు సృష్టించడానికి  ప్రేరేపిస్తుంది.  కాబట్టి కోపంతో ఉన్నవాళ్ల ముందు  ఓపికపట్టడం అన్నింటికంటే మంచిది.

మనపై కోపంగా ఉంటే

ఎవరైనా మనపై కోపంగా ఉన్నప్పుడు, వాళ్ల తప్పుల్ని సరిదిద్దడానికి ప్రయత్నించవద్దు. అలాగే, వాళ్లు చెప్పే మాటలకు అడ్డు చెప్పొద్దు. ఎందుకంటే వాళ్ల కోపానికి అసలు కారణం వాళ్ల మనసు లోతుల్లో ఉంటుంది. ఒకవేళ మనకే కోపం వస్తే.. మనల్ని మనం శాంతపరుచుకునే దారులు వెతకాలి. ఎందుకంటే, కోపం వల్ల కలిగే పరిణామం అగ్ని నుంచి వచ్చే పొగ లాంటిది! మంటలను ఆర్పడానికి, మనం నిప్పులపై నీళ్లు పోయాలి. కానీ, దాన్ని నుంచి  పుట్టే పొగపై కాదు. ఎవరైనా కోపంగా ఉన్నప్పుడు చుట్టూ ఉన్నవాళ్లు… ఆ వ్యక్తి మీద ఇంకా కోపంగా ప్రవర్తిస్తుంటారు. కఠినంగా మాట్లాడుతుంటారు.  దాని వల్ల సమస్య పరిష్కారం కాకుండా అలాగే ఉండిపోతుంది.  కాబట్టి, కోపానికి అసలు కారణం ఏంటో ఫోకస్ పెట్టాలి. దీని వల్ల ఆ వ్యక్తి కోపాన్ని చల్లార్చడంతో పాటు.. కోపం తాలూకు సమస్య పరిష్కారం కూడా సాధ్యమవుతుంది.

సాధన చేస్తే…

నా లాంటి ఆధ్యాత్మిక సాధకులు..  మనశ్శాంతిని,  సహనాన్ని , జ్ఞానాన్ని నాశనం చేసే కోపం రాకుండా ఉండేందుకు సాధన చేస్తుంటారు.  ‘‘కోపం వల్ల అవివేకం, అవివేకం వల్ల మతిమరుపు, మతిమరుపుతో అజ్ఞానం, అజ్ఞానంతో మనిషే నాశనం’’ అని భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. ఒక వ్యక్తి తన జ్ఞానాన్ని కోల్పోయినప్పుడు, అతని పతనం మొదలైనట్టే కదా! అందుకే కోపాన్ని జయించాలి, సహనం కోల్పోవద్దు. అప్పుడే ప్రశాంతమైన జీవితం సొంతమవుతుంది.

– సురక్షిత్‌‌ గోస్వామి