
కాగజ్‌నగర్, వెలుగు : నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారులు చనిపోయారు. ఈ ఘటన కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటిపల్లిలో శుక్రవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఎట్టపెల్లి గ్రామానికి చెందిన రత్నమాల, విజయ్ కూతురు హన్సిక (12) వేసవి సెలవులు కావడంతో తాటిపల్లిలోని మేనత్త ఇంటికి వచ్చింది. శుక్రవారం గ్రామానికి చెందిన బోయర్ విశ్వనాథ్ కూతురు లక్ష్మి (13)తో పాటు మరో ఇద్దరితో కలిసి గ్రామశివారులోని నీటి కుంట వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో కుంటలో నీటిపై తేలియాడుతున్న బాటిల్‌ను తీసేందుకు ప్రయత్నించిన లక్ష్మి ప్రమాదవశాత్తు అందులో పడిపోయింది.
గమనించిన హన్సిక లక్ష్మిని కాపాడేందుకు చేయి అందించగా.. ఆమె కూడా పట్టుతప్పి కుంటలో పడింది. ఇద్దరికీ ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయారు. మిగిలిన ఇద్దరు చిన్నారులు గ్రామంలోకి వెళ్లి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి కుంటలో గాలించగా ఇద్దరి డెడ్‌బాడీలు దొరికాయి. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఘటనాస్థలానికి చేరుకొని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. లక్ష్మి తల్లి మనీషా ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై విజయ్ తెలిపారు.