
ఖమ్మం టౌన్, వెలుగు: జాబ్ లు ఇప్పిస్తానని రూ. 90 లక్షలు తీసుకుని మోసగించిన ఘటన ఖమ్మం సిటీలో ఆలస్యంగా తెలిసింది. కవిరాజ్ నగర్ కు చెందిన అనిల్ నాయక్ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో ఔట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గా చేస్తున్నాడు. అతడు కొందరు ఏజెంట్లను నియమించుకుని నిరుద్యోగులకు జాబ్ ఇప్పిస్తామని నమ్మిస్తున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన 30 మంది వద్ద రూ. 3 లక్షలు చొప్పున డబ్బులు వసూలు చేశాడు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆఫీస్ చుట్టూ ఇటీవల బాధితులు తిరుగుతుండడంతో మోసపోయినట్లు తెలుసుకున్నారు.
వాజేడు మండలం ప్రగాలపల్లికి చెందిన బాధితులు రామకృష్ణ, ఇమ్రాన్, పద్మ, కళ్యాణ్ తో పాటు మరికొందరు సోమవారం ఖమ్మం టూ టౌన్ పీఎస్ లో కంప్లయింట్ చేశారు. ప్రభుత్వ శాఖల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు, స్టాఫ్ నర్స్, ట్రాన్స్ కో శాఖలో జాబ్ లు ఉన్నాయని నమ్మించి అనిల్ నాయక్ రూ. లక్షల్లో తీసుకున్నాడని ఆరోపించారు. దీంతో పోలీసులు అనిల్ నాయక్ ను స్టేషన్ కు పిలిపించి మాట్లాడగా.. బాధితులు తనకు డబ్బులు ఇవ్వలేదని చెప్పి వెళ్లిపోయాడని వాపోయారు. బాధితులు తమ ఏరియా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసుకోవాలని సీఐ బాలకృష్ణ సూచించడంతో చేసేదేమీలేక వెనుదిరిగిపోయారు.