కోవాగ్జిన్‌ మూడో దశ పరీక్షలకు వాలంటీర్‌గా హర్యానా మంత్రి

 కోవాగ్జిన్‌ మూడో దశ పరీక్షలకు వాలంటీర్‌గా హర్యానా మంత్రి

కరోనాను అరికట్టేందుకు భారత్‌లోని ప్రముఖ ఫార్మా సంస్థ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేస్తోన్న కోవాగ్జిన్‌ మూడవ దశ ప్రయోగాలు ఈ నెల 20 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ ప్రయోగాల్లో భాగంగా హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్‌ విజ్‌ వాలంటీర్‌గా ఉండేందుకు ముందుకు వచ్చారు. తాను స్వచ్ఛందంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. ఇప్పటికే కోవాగ్జిన్‌ రెండు దశల ట్రయల్స్‌ను పూర్తి అయ్యింది. దీంతో మూడవ దశకు డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCJI) అనుమతులు ఇచ్చింది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా 25 కేంద్రాల్లో 26 వేల మంది వాలంటీర్లతో మూడవ దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించడానికి భారత్‌ బయోటెక్‌ ఏర్పాట్లు చేపట్టింది. ఈ నెల 20 నుండి ఈ ప్రయోగాలు ప్రారంభం కానున్నాయి.

ICMR భాగస్వామ్యంతో  భారత్‌ బయోటెక్‌ ఈ ప్రయోగాలు చేపట్టనుంది. కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ కోసం భారత్‌లో చేపడుతున్న అతిపెద్ద క్లినికల్‌ ట్రయల్‌ ఇదే. ట్రయల్స్‌లో భాగంగా వాలంటీర్లకు 28 రోజుల తేడాతో రెండు ఇంట్రామస్కులర్‌ ఇంజెక్షన్లు ఇస్తారు. మొదటి రెండు దశల్లో ఇప్పటి వరకు టీకా తీసుకున్న వాలంటీర్లలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని భారత్‌ బయోటెక్‌ ఇప్పటికే ప్రకటించింది.