త్వరలో మేం కూడా..! మా నలుగురి అరెస్టుకు రంగం సిద్ధం చేశారు: ఆతిశీ

త్వరలో మేం కూడా..! మా నలుగురి అరెస్టుకు రంగం సిద్ధం చేశారు: ఆతిశీ
  •     ఆప్​ను చిన్నాభిన్నం చేయడమే బీజేపీ లక్ష్యమని ఆరోపణ
  •     ఢిల్లీ మంత్రి ఆరోపణలపై మండిపడ్డ బీజేపీ
  •     ఆధారాలు చూపకుంటే లీగల్ యాక్షన్ తప్పదని వార్నింగ్

న్యూఢిల్లీ: ఆమ్​ ఆద్మీ పార్టీ (ఆప్​)ని ఛిన్నాభిన్నం చేయడమే బీజేపీ లక్ష్యమని ఢిల్లీ మంత్రి ఆతిశీ ఆరోపించారు. నెలలోగా తనతోపాటు మరో ముగ్గురు ఆప్​ నేతలు అరెస్ట్​ కాబోతున్నారని చెప్పారు. వారిలో మంత్రి సౌరభ్​ భరద్వాజ్​, ఎమ్మెల్యే దుర్గేశ్​ పాఠక్​, ఎంపీ రాఘవ్​ చద్దా ఉన్నారని తెలిపారు. ఢిల్లీ లిక్కర్​ స్కాం కేసులో అరెస్టయిన ఆప్​ జాతీయ కన్వీనర్​, ఆ రాష్ట్ర సీఎం అర్వింద్​ కేజ్రీవాల్​ ఈడీ విచారణలో భాగంగా కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో నిందితుడైన విజయ్​నాయర్​తన మంత్రివర్గంలోని ఆతిశీ, సౌరభ్​ భరద్వాజ్​కు రిపోర్ట్​ చేసేవారని కేజ్రీవాల్​ చెప్పినట్టు ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ స్కాంలో తన పేరు బయటకు వచ్చిన నేపథ్యంలో ఆతిశీ మంగళవారం మీడియాతో మాట్లాడారు. తన రాజకీయ జీవితాన్ని కాపాడుకునేందుకు బీజేపీలో చేరాలని ఓ సన్నిహిత వ్యక్తి ద్వారా తనను కాషాయ పార్టీ సంప్రదించిందని, లేకుంటే ఈడీ ద్వారా అరెస్ట్​ చేయిస్తామని ఆ వ్యక్తి ద్వారా హెచ్చరికలు జారీచేసిందని ఆతిశీ వెల్లడించారు. ‘కేజ్రీవాల్, మనీశ్​ సిసోడియా, సంజయ్​సింగ్​, సత్యేంద్ర జైన్​ను అరెస్ట్​ చేస్తే ఆప్​ అంతమవదని బీజేపీ భావించింది. అందుకే సెకండ్​ లైన్​ లీడర్లమైన తమను టార్గెట్ చేసింది’ అని ఆరోపించారు. కేజ్రీవాల్​ అరెస్ట్​కు నిరసనగా ఇండియా కూటమి నిర్వహించిన రామ్​లీలా మైదాన్​ ర్యాలీ సక్సెస్ కావడంతో పాటు ఆప్​ నిరసనలతో బీజేపీ ఉలిక్కిపడిందని ఎద్దేవా చేశారు. 

బీజేపీ బెదిరింపులకు భయపడం

బీజేపీ బెదిరింపులకు తాము భయపడబోమని ఆతిశీ వెల్లడించారు. తాము కేజ్రీవాల్​సైనికులమని, భగత్​సింగ్ శిష్యులమని పేర్కొన్నారు. దేశాన్ని రక్షించేందుకు ఆప్​ చివరి వలంటీర్​ వరకూ పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. తీహార్​ జైలుకెళ్లిన నేపథ్యంలో కేజ్రీవాల్​ రాజీనామా చేస్తారా? అన్న ప్రశ్నకు ఆతిశీ సమాధానమిస్తూ... ఆయన రాజీనామా చేసేందుకు ఎలాంటి కారణాలు లేవని తెలిపారు. లిక్కర్​ పాలసీ కేసులో కేజ్రీవాల్​పై చార్జ్​షీట్​ దాఖలు కాలేదని, శిక్ష పడలేదని చెప్పారు.

ఆప్​ను ముక్కలు చేయలేరు: సౌరభ్​ భరధ్వాజ్​

ఆప్​ పార్టీ అనేది సేంద్రియంగా ఎదిగిందని, దీన్ని బీజేపీ ముక్కలు చేయలేదని ఢిల్లీ మంత్రి సౌరభ్​ భరద్వాజ్​ పేర్కొన్నారు. బీజేపీలో చేరాలని ఆతిశీకి బీజేపీ రాయబారం పంపడాన్ని బహిరంగ బెదిరింపుగా అభివర్ణించారు. ‘ఆప్​కు చెందిన నలుగురు లీడర్లను అరెస్ట్​ చేసినా పార్టీ ఇంకా మనుగడ కొనసాగిస్తున్నది. అందుకే ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న తమను జైలుకు పంపాలని బీజేపీ భావిస్తున్నది’ అని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులను జైలుకు పంపి బీజేపీ 400 లోక్​సభ సీట్లను గెలవాలని చూస్తున్నదని విమర్శించారు. కాగా, బీజేపీలో చేరితే తనకు రూ.25 కోట్లు ఇస్తామని ఆఫర్​ చేసినట్టు ఎమ్మెల్యే రితురాజ్​ ఝా వెల్లడించారు.

మా పార్టీలో నో వేకెన్సీ: హర్ దీప్ సింగ్ పురీ

బీజేపీలో చేరాలంటూ ఢిల్లీ మంత్రి ఆతిశీ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి హర్​ దీప్  సింగ్ పురీ స్పందించారు. బీజేపీలో వేకెన్సీలు లేవని చురకలంటించారు. లిక్కర్​ స్కామ్​తో ఆప్​ చిక్కుల్లో పడిందని, ఇప్పుడు ఆతిశీని పార్టీలో చేర్చుకుని తాము కష్టాలు కొనితెచ్చుకోబోమని మంత్రి చెప్పారు. ఆతిశీ తన ఆరోపణలకు సంబంధించి తగిన ఆధారాలు చూపించాలని బీజేపీ ఢిల్లీ చీఫ్​ వీరేంద్ర సచ్​దేవా డిమాండ్​ చేశారు. లేదంటే ఆతిశీపై లీగల్​ యాక్షన్​తీసుకుంటామని హెచ్చరించారు.

తొలగించాలె: బీజేపీ

లిక్కర్​ పాలసీ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్​ సీఎంగా కొనసాగేందుకు అనర్హుడని బీజేపీ వాదిస్తున్నది. కటకటాల్లో నుంచి ఆయన ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారని ప్రశ్నిస్తున్నది. ఢిల్లీ నిజాయితీగా, నిష్పక్షపాతంగా పాలించే సీఎంను కోరుకుంటున్నదని తెలిపింది. బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్​ భాటియా మీడియాతో మాట్లాడుతూ.. లిక్కర్​ స్కాంలో జైలుకెళ్లిన డిప్యూటీ సీఎం సిసోడియా, మంత్రి సత్యేంద్ర జైన్​ను రాజీనామా చేయాలని కేజ్రీవాల్ కోరారని, ఇప్పుడు కేజ్రీవాల్​ జైలుకెళ్లినా రాజీనామా చేయడంలేదని చెప్పారు. అవినీతిని అంతం చేస్తానని రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్​.. అవినీతికి పర్యాయపదంగా మారారని విమర్శించారు. జైలులో నుంచి  ప్రభుత్వాన్ని నడుపుతూ కేజ్రీవాల్​ కొత్త రికార్డు సృష్టించారని ఎద్దేవా చేశారు.

కొనసాగాలె: ఆప్​

ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్​సతీమణి సునీతా కేజ్రీవాల్​ను ఢిల్లీ ఎమ్మెల్యేలు మంగళవారం కలిశారు. మొత్తం 62 మంది ఎమ్మెల్యేలకుగానూ 55 మంది సునీతా కేజ్రీవాల్​తో భేటీ అయ్యారు.  కేజ్రీవాల్​ రాజీనామా చేయొద్దని, జైలునుంచే పాలన సాగించాలని వారు కోరారు.  కేజ్రీవాల్​కు 2 కోట్ల మంది ఢిల్లీ ప్రజల మద్దతు ఉన్నదని, ఏ పరిస్థితి ఎదురైనా ఆయన రాజీనామా చేయొద్దని సునీతా కేజ్రీవాల్​తో ఎమ్మెల్యేలు అన్నట్టు పార్టీవర్గాలు తెలిపాయి. తీహార్​ జైలునుంచి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడే అవకాశం సునీతా కేజ్రీవాల్​కు మాత్రమే ఉన్నందున.. తమ నిర్ణయాన్ని కేజ్రీవాల్​కు తెలియజేయాలని కోరామని సీనియర్​ నేత సౌరభ్​ భరద్వాజ్​ వెల్లడించారు.