కరోనాతో మిడిల్‌‌‌‌క్లాస్‌‌కు మరోదెబ్బ

కరోనాతో మిడిల్‌‌‌‌క్లాస్‌‌కు మరోదెబ్బ
  • కరోనాతో పేదరికంలోకి మరింత మంది
  • సెకండ్‌‌‌‌వేవ్‌‌తో పెరుగుతున్న కష్టాలు
  • మరోసారి జాబ్​ లాస్​లు

కరోనా ఫస్ట్‌‌‌‌ వేవ్‌‌ వల్ల  దాదాపు 3.2 కోట్ల మంది మిడిల్‌‌క్లాస్‌‌ జనం పేదలుగా మారారు.   సెకండ్‌‌ వేవ్‌‌ కూడా కోట్ల మంది మిడిల్‌‌క్లాస్‌‌ జనాన్ని పేదరికంలోకి నెట్టేస్తుందని ప్యూ రీసెర్చ్‌‌ సెంటర్‌‌  హెచ్చరించింది. జాబ్స్‌‌ పోవడం, జీతాలు తగ్గడం, బిజినెస్‌‌లో నష్టాలు ఇందుకు కారణాలని   వివరించింది.

న్యూఢిల్లీ: ఆశిష్ ఆనంద్‌‌‌‌కు ఫ్యాషన్‌‌ డిజైనర్‌‌ కావాలని  ఎన్నాళ్ల నుంచో ఆశ.  ఢిల్లీలో క్లాతింగ్‌‌ షాప్‌‌ పెట్టాలని కలగన్నారు. ఇందుకోసం చుట్టాల నుంచి దాదాపు రూ.నాలుగు లక్షలు అప్పు తీసుకొని గత ఫిబ్రవరిలో షాపు పెట్టారు. నెల రోజుల తరువాత దేశమంతటా లాక్‌‌డౌన్‌‌ పెట్టడంతో ఆయన జీవితం తలకిందులయింది. షాపు మూసేయాల్సి వచ్చింది. పూట గడవని పరిస్థితి.  ఈ పరిస్థితి ఆనంద్‌‌ ఒక్కడిదే కాదు. మనదేశంలో చాలా మందిని కరోనా కోలుకోలేని దెబ్బకొట్టింది. ఇప్పుడు సెకండ్‌‌వేవ్‌‌ రూపంలో మరో కరోనా మరోసారి మిడిల్‌‌క్లాస్‌‌ జనాన్ని సతాయిస్తోంది. గత ఏడాది 3.2 కోట్ల మంది ఇండియన్లు మిడిల్‌‌క్లాస్‌‌ నుంచి పేదలుగా మారగా, ఈసారి కూడా లక్షల మంది బీదల కేటగిరిలోకి వెళ్తారని ప్యూ రీసెర్చ్‌‌ సెంటర్‌‌ హెచ్చరించింది. జాబ్స్‌‌ పోవడం, జీతాలు తగ్గడం, బిజినెస్‌‌లో నష్టాలు ఇందుకు కారణాలని స్పష్టం చేసింది. ఏ రకంగా చూసినా ప్రస్తుత పరిస్థితుల వల్ల మిడిల్‌‌క్లాస్‌‌ నష్టపోవడం తప్పదని యూనివర్సిటీ ఆఫ్‌‌ మసాచుసెట్స్ అమ్హెరిస్ట్‌‌ ప్రొఫెసర్‌‌ జయతి ఘోష్‌‌ అన్నారు. ఎకానమీ దెబ్బతింటుందని, అసమానతలు పెరుగుతాయని హెచ్చరించారు. మనదేశంలో శుక్రవారం ఒక్కరోజే 2.16 లక్షల కరోనా కేసులు వచ్చిన నేపథ్యంలో ఆమె ఈ కామెంట్స్‌‌ చేశారు.

పరిస్థితి మళ్లీ మొదటికి..
ఇండియా ఎన్నో ఏళ్లుగా సాధించిన డెవెలప్‌‌మెంట్‌‌ కరోనా వల్ల తుడిచిపెట్టుకుపోతోంది. గత ఏడాది లాక్‌‌డౌన్‌‌ వల్ల దాదాపు 10 కోట్ల మంది ఇండియన్లు జాబ్స్‌‌ కోల్పోయారు. అయితే ప్రభుత్వం అమెరికా వంటి దేశాల మాదిరిగా డిమాండ్‌‌ పెరగడానికి పెద్దగా ఖర్చు చేయడం లేదు. వ్యాక్సినేషన్‌‌తో ఈ సమస్యను ఎదుర్కొంటామని చెబుతోంది. మనదేశంలో ఇప్పటి వరకు వ్యాక్సిన్‌‌ తీసుకున్నది తొమ్మిది శాతం మంది మాత్రమేనని, ఇది చాలా తక్కువని ఎకనమిస్టులు అంటున్నారు. కొన్ని కంపెనీలు జాబ్స్‌‌ ఇస్తున్నా, జీతాలు చాలా తక్కువ ఆఫర్‌‌ చేస్తున్నాయి. ‘‘నాకు ఎనిమిది నెలల నుంచి జాబ్‌‌ రాలేదు. నా కష్టాలను తట్టుకోలేక ఎన్నోసార్లు బాత్‌‌రూమ్‌‌లో కూర్చొని ఏడ్చాను. మా అమ్మకు వినిపించకూడదనే అలా చేశాను. ఇటీవల ఒక జాబ్‌‌ వచ్చింది కానీ జీతం కేవలం రూ.25 వేలు. ఇది వరకటి జీతంతో పోలిస్తే ఇది సగమే! దీంతో మేం ఎలా బతకాలి ?’’ అని ముంబై యువతి నికితా జగడ్‌‌ ప్రశ్నించారు. సెకండ్‌‌వేవ్‌‌తోనూ చాలా మంది జాబ్స్ పోయే అవకాశాలు ఉన్నాయని, జీతాలు తగ్గే ప్రమాదాలూ ఉన్నాయని ఎకనమిస్టులు అంటున్నారు. 

ఎకానమీకి మిడిల్‌‌‌‌క్లాస్‌‌ వెన్నెముక
రోజుకు కనీసం 10 డాలర్ల (దాదాపు రూ.750) వరకు సంపాదించే వాళ్లు మిడిల్‌‌క్లాస్‌‌ పరిధిలోకి వస్తారు. ఎకానమీకి వీళ్లు పెట్టే ఖర్చు ఎంతో ముఖ్యం. మనదేశంలో కరోనాకు ముందు 9.9 కోట్ల మంది మిడిల్‌‌క్లాస్‌‌లో ఉంటే మహమ్మారి తరువాత వీరి సంఖ్య 6.6 కోట్లకు తగ్గింది. సెకండ్‌‌వేవ్‌‌తో చాలా మంది ఆదాయాలు, ఖర్చులు విపరీతంగా తగ్గాయని తాజా స్టడీలు చెబుతున్నాయి. డబ్బుపరమైన తేడాలు, నిరుద్యోగం, ఆదాయాలు, ఖర్చుల తగ్గుదల గురించి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదని సెంటర్‌‌ ఫర్‌‌ మానిటరింగ్‌‌ ఆఫ్ ది ఇండియన్‌‌ ఎకానమీకి సీఈఓ మహేశ్‌‌ వ్యాస్‌‌ విమర్శించారు. ముఖ్యంగా సెమీస్కిల్డ్‌‌ వాళ్లకు పనులు దొరకడం చాలా కష్టంగా మారిందని అన్నారు. నిరుద్యోగాన్ని తగ్గించకుంటే మరోసారి లక్షల మంది పేదలుగా మారతారని స్పష్టం చేశారు.