ఆదిత్య సక్సెస్ ..నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ–57

ఆదిత్య సక్సెస్ ..నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ–57
  • కక్ష్యలోకి చేరిన ఆదిత్య-ఎల్1 శాటిలైట్
  • 16 రోజుల తర్వాత సూర్యుడి వైపుగా ప్రయాణం 
  • 125 రోజుల జర్నీ తర్వాత ఎల్1 పాయింట్ వద్దకు 
  • 4 నెలల్లో 15 లక్షల కిలోమీటర్ల దూరం వెళ్లనున్న శాటిలైట్  
  • సౌర తుఫాన్ల వల్ల భూమికి సమీపంలోని అంతరిక్షంపై పడే ప్రభావాన్ని తెలుసుకోవడం
  • సూర్యుడి వాతావరణంలో జరిగే కీలక మార్పులను అవగాహన చేసుకోవడం
  • సోలార్ విండ్స్ వేగాల్లో మార్పులను, అంతరిక్షంలో వాటి వ్యాప్తిని గమనించడం
  • సూర్యుడి కరోనా ఎలా వేడెక్కుతుందో తెలుసుకోవడం 
  • సూర్యుడి ఉపరితలంపై విస్ఫోటనాలను అర్థం చేసుకోవడం

శ్రీహరికోట/బెంగళూరు:  కొద్దిరోజుల కిందటే చంద్రయాన్–3 విజయంతో చరిత్ర సృష్టించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. ఈసారి సూర్యుడిపై పరిశోధనల కోసం మరో భారీ మిషన్ కు దిగ్విజయంగా శ్రీకారం చుట్టింది. భూమికి దూరంగా వెళ్లి అంతరిక్షం నుంచి నిరంతరం సూర్యుడిపై ఫోకస్ పెట్టనున్న ఆదిత్య–ఎల్1 శాటిలైట్ ను ఇస్రో సక్సెస్ ఫుల్ గా కక్ష్యలోకి చేర్చింది. ఏపీ శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి శనివారం ఉదయం11.50 గంటలకు కౌంట్ డౌన్ ముగియగానే ఆదిత్య శాటిలైట్ ను మోసుకుని పీఎస్ఎల్వీ–సీ57 రాకెట్ నిప్పులు కక్కుతూ నింగికి ఎగిసింది. సుదీర్ఘ సమయం పాటు ప్రయాణించిన రాకెట్.. 63 నిమిషాల తర్వాత శాటిలైట్​ను నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా చేర్చింది. 

తొలిసారిగా పీఎస్ఎల్వీ రాకెట్ అప్పర్ స్టేజీని ఈ ప్రయోగంలో రెండు సార్లు మండించి, శాటిలైట్ ను నిర్దేశిత కక్ష్యలోకి చేర్చారు. ప్రయోగం సక్సెస్ అయిన వెంటనే శ్రీహరికోటలోని మిషన్ కంట్రోల్ రూం నుంచి ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ మాట్లాడారు. శాటిలైట్ ను పీఎస్ఎల్వీ రాకెట్ కచ్చితంగా తాము అనుకున్నట్లుగా 235/19,500 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలోకే చేర్చిందని ప్రకటించారు. శాటిలైట్ నాలుగు నెలల ప్రయాణం తర్వాత తన గమ్యస్థానమైన ఎల్1 పాయింట్ కు చేరుకుంటుందని తెలిపారు. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్రసింగ్ కూడా మిషన్ కంట్రోల్ రూం నుంచి ప్రయోగాన్ని వీక్షించారు. 

ఆదిత్య శాటిలైట్16 రోజుల పాటు భూమి చుట్టూ ఉన్న కక్ష్యలోనే తిరగనుంది. ఐదు సార్లు కక్ష్యను, స్పీడ్ ను పెంచుకున్న తర్వాత భూమికి, సూర్యుడికి మధ్య ఉన్న లాగ్రాంజ్1 (ఎల్1) పాయింట్ వద్దకు ప్రయాణం ప్రారంభించనుంది. భూకక్ష్య నుంచి ఎల్1 పాయింట్ వద్దకు 15 లక్షల కిలోమీటర్ల దూరం ఉండగా.. 125 రోజుల జర్నీ తర్వాత ఆదిత్య అక్కడికి చేరుకోనుంది. ఎల్1 పాయింట్ వద్దకు చేరిన తర్వాత కూడా ఆఖరిసారిగా కక్ష్య సవరింపును చేపట్టనున్నారు. దానితో ఆదిత్య శాటిలైట్ ఎల్1 పాయింట్ చుట్టూ ఉన్న హ్యాలో ఆర్బిట్ లోకి ఎంటరవుతుంది. ఆ తర్వాత ఇటు భూమి, అటు సూర్యుడి గ్రావిటీ ప్రభావం నుంచి తప్పించుకుని స్థిరంగా అక్కడే పార్క్ చేసినట్లుగా శాటిలైట్ ఉండిపోనుంది. 

అందుకే ఆదిత్యకు ఎల్1 పేరు.. 

భూమికి, సూర్యుడికి మధ్య అంతరిక్షంలో ఐదు చోట్ల గురుత్వాకర్షణ బలాలు సమానంగా ఉంటాయి. ఆ పాయింట్లనే లాగ్రాంజ్ పాయింట్లు అంటున్నారు. ఇటలీకి చెందిన గణితశాస్త్రవేత్త జోసెఫ్ లూయిస్ లాగ్రాంజ్ కనుగొన్నందున వీటికి ఆయన పేరునే పెట్టారు. భూమి, సూర్యుడి గ్రావిటీల ప్రభావం ఉండని ఈ పాయింట్ల వద్దకు ఏ స్పేస్ క్రాఫ్ట్ ను పంపినా.. అవి అక్కడ పార్క్ చేసినట్లుగా స్థిరంగా ఉండిపోతాయి. ఇంధనం మండించాల్సిన అవసరం లేకుండానే ఆ పాయింట్ల చుట్టూ ఉన్న హ్యాలో ఆర్బిట్లలో తిరుగుతూ ఉంటాయి. ఇక ఎల్1 పాయింట్ వద్దకు చేపట్టిన మిషన్ కాబట్టి.. ఆదిత్యకు కూడా ఎల్1 అనే పదాన్ని ఇస్రో జోడించింది. 

సూర్యుడిపై దూరం నుంచే ఫోకస్  

ఆదిత్య–ఎల్1 శాటిలైట్ సూర్యుడి సమీపంలోకి వెళ్లకుండా, భూమికి కొద్ది దూరంలోకి వెళ్లి మాత్రమే పరిశోధనలు చేయనుంది. భూమి నుంచి సూర్యుడికి సుమారు 15 కోట్ల కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆదిత్య శాటిలైట్ చేరుకునే ఎల్1 పాయింట్ 15 లక్షల కిలోమీటర్ల దూరమే ఉంది. అంటే.. సూర్యుడికి మనకు ఉన్న దూరంలో కేవలం 1 శాతం దూరం మాత్రమే ఆదిత్య ప్రయాణిస్తుంది. అలాగే చంద్రుడికి మనకు ఉన్న దూరంతో పోలిస్తే సుమారుగా నాలుగు రెట్లు అధిక దూరం మాత్రమే వెళ్తుంది. అన్ని లాగ్రాంజ్ పాయింట్ల కన్నా ఎల్1 పాయింట్ నుంచే సూర్యుడిని ఎలాంటి అడ్డంకులు లేకుండా 24 గంటలూ పరిశీలించేందుకు వీలుకానుంది. 

నిమిషానికో ఫొటో పంపుతది.. 

ఆదిత్య శాటిలైట్ లో 7 పేలోడ్లను ఇస్రో అమర్చింది. ఇవి సూర్యుడిపై సమగ్రంగా స్టడీ చేయనున్నాయి. వీటిలో నాలుగు పేలోడ్లు సూర్యుడి వైపుగా ఉండి నిరంతరం అబ్జర్వ్ చేయనున్నాయి. మిగతా మూడు ప్లాస్మా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వంటి వాటిపై పరిశోధనలు చేయనున్నాయి. వీటిలో ప్రధాన పేలోడ్ అయిన విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్.. దాదాపు నిమిషానికోసారి సూర్యుడిని ఫొటో తీసి పంపుతుంది. ప్రతిరోజూ దాదాపుగా 1,440 ఫొటోలను ఇది గ్రౌండ్ స్టేషన్ కు పంపనుంది. ఈ ఫొటోలను అనలైజ్ చేయడం ద్వారా సూర్యుడి గురించి ఇస్రో సైంటిస్టులు సమగ్ర డేటాను సిద్ధం చేయనున్నారు. 

సోలార్ మిషన్ చేపట్టిన ఐదో దేశంగా ఇండియా 

అంతరిక్షం నుంచి సూర్యుడిని పరిశీలించే అబ్జర్వేటరీ మాదిరిగా పని చేసే శాటిలైట్(సోలార్ స్పేస్ అబ్జర్వేటరీ)ని ఇస్రో ప్రయోగించడం ఇదే తొలిసారి.  సూర్యుడిపై పరిశోధనల కోసం ఇప్పటివరకు అమెరికా, జపాన్, యూరోపియన్ యూనియన్, చైనా మాత్రమే ఇలాంటి సోలార్ మిషన్లు చేపట్టాయి. వాటి తర్వాత సోలార్ స్పేస్ అబ్జర్వేటరీ మిషన్ చేపట్టిన ఐదో దేశంగా ఇండియా నిలిచింది. 

ఇస్రోకు ఈసా సాయం

ఆదిత్య మిషన్ లో ఇస్రోకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈసా) రెండు రకాలుగా కీలక సహాయం చేస్తోంది. అంతరిక్షంలో ఆదిత్య శాటిలైట్ తో కమ్యూనికేషన్లు కొనసాగించేందుకు గాను డీప్ స్పేస్ కమ్యూనికేషన్ సర్వీసులను ఈసా అందిస్తోంది. ఆస్ట్రేలియా, స్పెయిన్, అర్జెంటినా, ఫ్రెంచ్ గయానా, యూకే వంటి దేశాల్లో ఉన్న డీప్ స్పేస్ యాంటెన్నాల ద్వారా ఈ సేవలను అందజేస్తోంది. అలాగే భూకక్ష్య నుంచి ఎల్1 పాయింట్ వద్దకు సాఫీగా చేరేందుకు వీలుగా రూపొందించిన సరికొత్త ఫ్లైట్ డైనమిక్స్ సాఫ్ట్ వేర్ విషయంలోనూ ఇస్రోకు సహకారం అందించింది. 

ఇస్రో సైంటిస్టులకు కంగ్రాట్స్ 

ఆదిత్య-ఎల్1 ప్రయోగాన్ని విజయవంతం చేసిన మన సైంటిస్టులు, ఇంజనీర్లకు కంగ్రాట్స్. మొత్తం మానవాళి సంక్షేమం కోసం విశ్వాన్ని మరింత బాగా అర్థం చేసుకునేందుకు మన నిరంతర సైంటిఫిక్ ప్రయత్నాలు మున్ముందూ కొనసాగుతాయి. 

ప్రధాని నరేంద్ర మోదీ 

దశాబ్దాల కృషితోనే  ఇది సాధ్యమైంది: ఖర్గే 

ఆదిత్య-ఎల్1 ప్రయోగం సక్సెస్ కోసం శ్రమించిన ప్రతి సైంటిస్టు, ఇంజనీర్, సిబ్బంది అందరికీ అభినందనలు. ఈ మిషన్.. సక్సెస్ వెనక  ఏవో కొన్నేండ్లు కాదు, దశాబ్దాల కృషి ఉంది. సూర్యుడిపై పరిశోధనకు శాటిలైట్ (అబ్జర్వేటరీ)ని పంపాలని 2006లో ప్రతిపాదన వచ్చింది. 2013లో శాటిలైట్ లో పెట్టి పంపేందుకు ఏడు పేలోడ్లను సెలక్ట్ చేశారు. అప్పుడే మిషన్ కు ఆదిత్య-ఎల్1గా పేరు పెట్టారు. 2015 నవంబర్ లో ఆమోదం పొందింది. ఆదిత్య సక్సెస్ దేశానికి గర్వకారణం

 మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ చీఫ్

కల నిజమైంది

ఆదిత్య ప్రయోగం సక్సెస్ తో ఇస్రో కల సాకారం అయింది. పీఎస్ఎల్వీ రాకెట్ ఎప్పట్లాగే సత్తా చాటింది. శాటిలైట్ ను అనుకున్న కక్ష్యలోకే చేర్చింది. శాటిలైట్ సోలార్ ప్యానెళ్లు విచ్చుకున్నాయి. ఉపగ్రహం పూర్తి నార్మల్ గానే ఉంది. ఆదిత్య పని ప్రారంభించిన తర్వాత మన దేశానికి, ప్రపంచ దేశాలకు ఇది హీలియోఫిజిక్స్ రంగంలో ఒక గొప్ప ఆస్తిలా నిలుస్తుంది.  

నిగర్ షాజీ, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఆదిత్య-ఎల్1 మిషన్