వరదలకు కూలిన ఇల్లు.. ఆగిన గుండె

వరదలకు కూలిన ఇల్లు.. ఆగిన గుండె

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: వానలు, వరదలతో అతలాకుతలమైన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో మరో విషాదం చోటుచేసుకుంది. వరదల వల్ల కూలిపోయిన ఇంటిని చూసి ఆ ఇంటి యజమాని గుండె ఆగి చనిపోయాడు. ఇప్పటికే ఈ ఊరిలో వరదల్లో కొట్టుకుపోయి 8 మంది మృతి చెందారు. గ్రామ పంచాయతీ బిల్డింగ్‌‌‌‌, చెట్లు, పుట్టలు ఎక్కి వంద మంది ప్రాణాలతో  బయటపడ్డారు. శుక్రవారం ఎన్డీఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌ బృందాలు పడవల్లో కొండాయికి చేరుకొని వరద బాధితులను క్షేమంగా ఏటూరునాగారంలోని వైటీసీలో ఏర్పాటు చేసిన పునారావాస కేంద్రానికి తరలించారు. కొండాయికి చెందిన కోగిల బాబు(50) కూడా వీరితో పాటు అక్కడికి వెళ్లాడు. శుక్ర, శనివారాలు అక్కడే ఉన్న బాబు ఆదివారం సాయంత్రం స్వగ్రామానికి చేరుకున్నాడు. వరదల్లో కొట్టుకుపోయిన తన ఇంటిని, నిత్యావసర వస్తువులను చూసి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. చుట్టుపక్కల ఇండ్లలో బురద అట్టు పెరిగింది.. మూగజీవులు ఎక్కడివి అక్కడ చనిపోవడంతో ఊరంతా వాసన.. ఎటు వెళ్లలేని పరిస్థితి కనిపించింది. తోడునీడగా ఉన్న భార్య గతంలోనే చనిపోవడం, ఇద్దరు కొడుకుల కోసం కట్టుకున్న ఇల్లు కూడా ఇప్పుడు కూలిపోవడాన్ని తల్చుకొని బాబు వెక్కి వెక్కి ఏడ్చాడు. తీవ్ర మనోవేదనతో సోమవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశాడు. వరదలతో సర్వం కోల్పోయిన తమకు సర్కారు నుంచి ఎలాంటి సాయం అందడం లేదని, ఎలా బతకాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ప్రభుత్వం ఇంకెప్పుడు స్పందిస్తది?: సీతక్క

‘‘ఇండ్లు కోల్పోయిన వాళ్లకు ఇండ్లు కట్టిస్తామని, నష్టపోయిన కుటుంబాలను ఆదుకుంటామని రాష్ట్ర సర్కారు నుంచి హామీ వంటిది వస్తే బాబు చనిపోయేవారు కాదని.. కొండాయి గ్రామంలో వచ్చిన వరదల్లో గల్లంతైన వాళ్లను ఎలాగూ రక్షించలేని సర్కారు కనీసం బాధితులను కూడా ఆదుకోవడానికి ముందుకు రాకపోవడం చాలా దారుణమని” అని ములుగు ఎమ్మెల్యే సీతక్క తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు, గిరిజనులు, పేదవాళ్లు ఇంకా ఎంతమంది చనిపోతే ప్రభుత్వం స్పందిస్తుందని ఆమె మండిపడ్డారు.