దటీజ్ దీపిక: అనుపమ్ ఖేర్

దటీజ్ దీపిక: అనుపమ్ ఖేర్

విద్యార్థులు తమ గురువులను గుర్తుపెట్టుకున్నట్టే కొంతమంది గురువులు కూడా తమ విద్యార్థుల్ని గుర్తుంచుకుంటారు. దీపికను ఆమె గురువు అలాగే గుర్తుపెట్టుకున్నాడు. టీచర్స్ డే సందర్భంగా ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నాడు. ఆ గురువు ఎవరో కాదు.. అనుపమ్ ఖేర్. దీపిక తన యాక్టింగ్ స్కూల్లో చేరినప్పటి సంగతుల్ని నెమరు వేసుకుంటూ.. ‘మూడు నెలల యాక్టింగ్ కోర్సులో జాయినయ్యేనాటికే దీపిక  ఓ సక్సెస్ ఫుల్ మోడల్. అయినా ఇక్కడ ఉన్న మూడు నెలల్లో ఒక్క రోజు కూడా ఆలస్యంగా రాలేదు. సమయాన్ని పాటించడంలో, పని విషయంలో ఆమెకు ఆమే సాటి’ అని పొగిడేశారు ఖేర్. అంతేకాదు… నటీనటులు కేవలం నటనలోనే పర్ఫెక్ట్ గా  ఉంటే సరిపోదు, ఎన్నో క్లిష్ట సంఘటనలు ఎదురవుతాయి, వాటిని గెలవడంలో కూడా పర్ఫెక్ట్ అనిపించుకోవాలి అంటున్నారాయన.

దీపికకు ఆ శక్తి ఉందో లేదో తెలుసుకోడానికి ఆయన ఒక ఎక్సర్ సైజ్ ఇచ్చారట. దాని ప్రకారం ఆమె ఒక పనిమనిషి పాత్రలో కనిపించాలి. ఆ పాత్రను దీపిక నలభై అయిదు నిమిషాల పాటు పోషించిందట. ఇంటిపనిలో తనకు ఏమాత్రం అనుభవం లేకపోయినా… ఒక ఇల్లాలు ఇంటిని ఎలా చక్కదిద్దుకుంటుందో అందంగా చేసి చూపించింది, దటీజ్ దీపిక అన్నారు ఖేర్. ‘ఇల్లు సర్దడం కూడా ఓ పనా అనుకోకండి. ఒక నటికి అది కష్టమే. బిజీ షెడ్యూల్స్ లో ఇంటిని పట్టించుకునే తీరిక ఉండదు’ అంటున్నారు ఖేర్. దీపికలో ఇంకా ఎన్నో మంచి క్వాలిటీస్ ఉన్నాయని, తనని చూసి చాలా ఇంప్రెస్ అయిపోయే వాడినని  అన్నారు. అన్ని విషయాల్లోనూ పర్ఫెక్ట్ కనుకే దీపిక అంత పెద్ద నటి అయ్యింది, రణ్ వీర్ కి మంచి భార్య అయ్యింది.