
మగవాళ్లు పుట్టని ఊరి గురించి ఎప్పుడైనా విన్నారా? అవును అలాంటి ఒక ఊరు ఉంది. ఆ ఊళ్లో దాదాపు పన్నెండేండ్ల నుంచి ఒక్క మగబిడ్డ కూడా పుట్టలేదు. ఎవరైనా మగపిల్లవాడిని కంటే రివార్డు ఇస్తానని ఆ ఊరి మేయర్ అనౌన్స్ చేశాడు. ఇంతకీ ఆ ఊళ్లో ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు చాలా మంది ప్రయత్నించారు కానీ.. ఏం లాభం లేదు. పోలాండ్ దేశంలో ఒక మిస్టరీ విలేజ్ ఉంది. దాని పేరు మిజెస్కే ఓడ్జ్రెన్స్కీ. ప్రస్తుతం మూడు వందల మంది ఉంటున్న ఈ ఊరు సైంటిస్ట్‌లకే సవాల్ విసురుతోంది. ఇక్కడ పన్నెండేండ్ల నుంచి ఒక్క మగబిడ్డ కూడా పుట్టలేదు. దాంతో ఊరంతా ఆడపిల్లలతో నిండిపోయింది. ఊళ్లో ఎవరు ప్రెగ్నెంట్ అయినా మగబిడ్డ పుడుతాడేమోనని ఆశతో ఎదురు చూస్తుంటారు. కానీ.. వాళ్ల ఆశలు ఎప్పుడూ నిరాశలుగానే మిగిలిపోతున్నాయి. దీనికి కారణం ఏంటన్నది ఇప్పటివరకు తెలుసుకోలేకపోయారు. వాస్తవానికి మొదట్లో ఈ విషయం తెలిసిన సైంటిస్ట్‌లు ‘‘ఒక ప్రాంతంలో అందరూ ఆడపిల్లలే పుట్టడం సాధ్యం కాదు. అవన్నీ కట్టు కథలు” అని కొట్టిపారేశారు. కానీ.. కొన్నాళ్లకు పోలాండ్‌లోని మీడియా సంస్థలు ఆ ఊరికెళ్లి ఈ విషయాన్ని రిపోర్ట్ చేయడంతో అందరికీ తెలిసింది. ఆ తర్వాత సైంటిస్ట్‌లు కూడా రీసెర్చ్ చేశారు.
మగబిడ్డ పుడితే రివార్డ్
ఈ పన్నెండేండ్లలోనే కాదు.. మిజెస్కే ఓడ్ర్జెన్‌స్కీలో అంతకుముందు కూడా ఎక్కువగా ఆడపిల్లలే పుట్టేవాళ్లు. ఆ ఊళ్లో మగవాళ్ల సంఖ్య చాలా తక్కువ. దాంతో ఊరి జనాభా తగ్గుతూ వస్తోంది. ఊళ్లో పుట్టిన ఆడపిల్లలు కొందరు పెండ్లిళ్లు చేసుకుని వేరే ప్రాంతాలకు వెళ్తుండడంతో జనాభా తగ్గుతోంది. రెండవ ప్రపంచ యుద్ధం టైంలో ఈ ఊళ్లో1,200 మంది జనాభా ఉండేది. ఇప్పుడు సుమారు300 మంది మాత్రమే ఉన్నారు. కొన్ని కుటుంబాలు వలసలు కూడా వెళ్లాయి. ఈ ఊరి వాళ్లకు వ్యవసాయం జీవనాధారం. మగవాళ్లు లేకుండా వ్యవసాయ పనులు చేయడం కష్టమైంది. అందుకే కపుల్స్‌ని అబ్బాయిల కోసం ప్రయత్నించేలా చేయడానికి ఆ ఊరి మేయర్ రాజ్‌మండ్ ఫ్రిష్‌కో 2019లో ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఎవరు మగబిడ్డను కన్నా పెద్ద మొత్తంలో రివార్డు ఇస్తామని ప్రకటించాడు.
ఫుడ్ హ్యాబిట్స్ కూడా..
సీనియర్ సైంటిస్ట్‌లు దీనికి కారణాలు తెలుసుకోలేకపోయినా.. మగబిడ్డలను కనేందుకు ఈ ఊరి వాళ్లకు టిప్స్ ఇస్తున్నారు. సెంట్రల్ పోలాండ్‌కు చెందిన ఒక రిటైర్డ్ డాక్టర్ మాట్లాడుతూ.. ‘‘పుట్టబోయే బిడ్డ ఆడ, మగ అనేది తల్లి ఫుడ్ హ్యాబిట్స్ బట్టి కూడా డిసైడ్ చేసే అవకాశం ఉంది. తల్లిలో కాల్షియం పుష్కలంగా ఉంటే మగబిడ్డ పుట్టే అవకాశాలు ఉంటాయి” అని చెప్పాడు. కానీ.. ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు.
ఆ ఊరి పెద్ద వాళ్లు మాత్రం భార్యాభర్తల మంచం కింద గొడ్డలి పెట్టుకుంటే మగబిడ్డ పుట్టే ఛాన్స్ ఉంటుందని నమ్ముతారు. అందుకే ఆ ఊళ్లో చాలామంది వాళ్ల పడక కింద గొడ్డళ్లు పెట్టుకుంటున్నారు. అయినా.. మగబిడ్డలు పుట్టడం లేదు.
లెక్క సరిపోయిందా?
ఈ ఊరి గురించి తెలిసిన కొంతమంది ఎక్స్‌పర్ట్స్ మాత్రం ఇందులో పెద్ద వింతేమీ లేదు. ఇది సాధారణమైన విషయమే అంటున్నారు. వాళ్ల ప్రకారం.. ఆ ఊళ్లో ఉన్నదే 300 మంది. అంటే.. ఏడాదికి ఒకరో.. ఇద్దరో.. లేదా ముగ్గురో పుడతారు. వాళ్లంతా అనుకోకుండా ఆడపిల్లలుగా పుట్టారు అంతే. పుట్టేది ఆడా? మగా? అనేదానికి కాయిన్ టాస్ లాగే... అంటే 50 శాతం మగ, 50 శాతం ఆడ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ పుట్టినవాళ్లంతా రెండో యాభై శాతంలో ఉన్నవాళ్లే. మొదటి తల్లికి ఆడపిల్ల పుడితే.. రెండో తల్లికి మగపిల్లాడు పుట్టాలని లేదు. ఈ తల్లికి ఎవరు పుడతారనేది కాయిన్ టాస్ లాంటిదే. అంటే వీళ్ల కాయిన్‌లన్నీ ఆడపిల్ల వైపే పడ్డాయి అంతే!