చంద్రబాబుకు జైలే ఇల్లు.. కోర్టు తీర్పు ఇదే

చంద్రబాబుకు జైలే ఇల్లు.. కోర్టు తీర్పు ఇదే

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో జ్యూడిషియల్ రిమాండ్ ను హౌస్ రిమాండ్ గా ఏసీబీ కోర్టు మారుస్తుంది....ఇక ఎంచక్కా ఇంటికి వెళ్లిపోవచ్చు...అని కలలు కన్న చంద్రబాబుకు ఏసీబీ కోర్టు షాకిచ్చింది. జ్యుడిషియల్ రిమాండ్ ను హౌస్ రిమాండ్ గా మార్చాలన్న పిటిషిన్ ను విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఈ పిటీషన్ పై సెప్టెంబర్ 11వ తేదీన చంద్రబాబు తరపున న్యాయవాదులు, సీఐడీ వాదనలు విన్న ఏసీబీ కోర్టు..చంద్రబాబు విజ్ఞప్తిని ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. సీఐడీ వాదనలతో ఏకీభవిస్తూ తీర్పు వెలువరించింది.

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో  సెప్టెంబర్ 2వ తేదీన చంద్రబాబును సీఐడీ అధికారులు నంద్యాలలో అరెస్టు చేశారు. ఆ తర్వాత విజయవాడ ఏసీబీ కోర్టులో ఆయన్ను హాజరుపర్చారు. ఈ కేసులో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే చంద్రబాబు  జ్యుడిషియల్ రిమాండ్ ను హౌస్ రిమాండ్ గా మార్చాలని కోరుతూ ఆయన తరపున న్యాయవాదులు ఏసీబీ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు.

హౌస్ రిమాండ్ పిటీషన్ పై సెప్టెంబర్ 11వ తేదీన  ఏసీబీ కోర్టు విచారించింది.  వీవీఐపీగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజమండ్రి  జైల్లో సరైన భద్రత ఉండదని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. NSG భద్రత లేకుండా చంద్రబాబును ఉంచడం సరికాదని కోర్టుకు తెలిపారు. అయితే సీఐడీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబుకు రాజమండ్రి జైల్లో ప్రత్యేక భద్రత కల్పించిందని కోర్టుకు తెలిపింది. అన్ని విధాలుగా జైలు ఉత్తమమని సీఐడీ అధికారులు వాదించారు.  దీంతో సీఐడీ వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు....చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ ను కొట్టేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పుతో చంద్రబాబుకు జైలే ఇళ్లు కానుంది. ఆయన 14 రోజుల పాటు రాజమండ్రి జైల్లోనే ఉండనున్నారు. 

మరోవైపు తన రిమాండ్ ను రద్దు చేయాలని కోరుతూ  చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సెప్టెంబర్ 13వ తేదీన విచారణ జరగనుంది. ఈ పిటీషన్ పై హైకోర్టు ఏం తీర్పు ఇస్తుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు చంద్రబాబు. అయితే  చంద్రబాబు తరఫు న్యాయవాదులు మాత్రం ఇప్పటివరకూ బెయిల్ కోసం దరఖాస్తు చేయలేదు.  ఏకంగా ఈ కేసు ఎఫ్ఐఆర్, రిమాండ్ రద్దు చేయాలని మాత్రమే పిటిషన్లు వేస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 13వ తేదీన హైకోర్టు వెలువరించే తీర్పు కీలకం కానుంది. అదే సమయంలో చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన మరో పిటిషన్ పై కూడా ఏసీబీ కోర్టు సెప్టెంబర్ 13వ తేదీనే విచారణ చేపట్టనుంది.