జగన్ బెయిల్ ఏ క్షణమైనా రద్దయ్యే అవకాశం ఉంది

జగన్ బెయిల్ ఏ క్షణమైనా రద్దయ్యే అవకాశం ఉంది
  • బీజేపీ ఏపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ సంచలన కామెంట్స్

తిరుపతి: ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ స్వరం పెంచుతోంది. అధికార వైసీపీకి తామే అసలైన ప్రత్యామ్నాయమని చాటుకునేందుకు కొత్త కొత్త ఎత్తుగడలతో సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణలో మాదిరిగానే ఏపీలో కూడా అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న పార్టీ శ్రేణులకు జవసత్వాలు తీసుకొచ్చేందుకు తిరుపతి ఉప ఎన్నికను ఒక మంచి అవకాశంగా మలచుకునే ప్రయత్నం చేస్తోంది. ఢిల్లీలో దోస్తీ చేస్తూ.. గల్లీలో పోరాడుతున్నామనే అభిప్రాయాన్ని పటాపంచలు చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు బీజేపీ ఏపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్. ఏపీలో రౌడీరాజ్యం నడుస్తోందని తూర్పారబట్టిన ఆయన బెయిల్ పై ఉన్న వ్యక్తి రాష్ట్రానికి సీఎంగా కొనసాగుతున్నారని గుర్తు చేస్తూ..  జగన్ బెయిల్ ఏ క్షణమైనా రద్దయ్యే అవకాశం ఉందన్న కామెంట్ చేసి తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడేలా చేశారు.

వైసీపీ-టీడీపీలు అవినీతి పార్టీలే కాదు దొంగల పార్టీలు కూడా
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసిపి, ప్రతిపక్ష టీడీపీ పార్టీలు రెండు అవినీతి పార్టీలే కాదు దొంగల పార్టీలు కూడా అని బీజేపీ ఏపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ అభివర్ణించారు. బీజేపీ-జనసేన పార్టీలతో పోటీ పెట్టుకోవద్దని హెచ్చరించారు. వైసిపితో పోటీ పడేందుకు టీడీపీకి శక్తి లేదని ఎద్దేవా చేసిన ఆయన వైసిపిని ఢీకొట్టే పార్టీ జనసేన మాత్రమేనన్నారు. జగన్ బెయిల్ ఏ క్షణమైన రద్దు అయ్యే అవకాశం ఉంది,ఇక రౌడీ సీఎం పని అయిపోయినట్లేనని చెప్పారు. జగన్ బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంది.. భవిష్యత్తులో చంద్రబాబు కూడా జైలుకు వెళ్లాల్సి రావొచ్చని ఆయన జోస్యం చెప్పారు.  పశ్చిమ బెంగాల్లో రౌడీయిజాన్ని అణగతొక్కిన పార్టీ భారతీయ జనతా పార్టీ, ఏపీలో అధికార వైసీపీకి ప్రత్యామ్న పార్టీలు జనసేన,బీజేపీలు మాత్రమేనని పేర్కొన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు ఎయిర్ పోర్టుకు వచ్చారు కూర్చున్నారు.. వెళ్లారు...అంతటితో ఆయన పని అయిపోయింది.. ఉప ఎన్నికలు ప్రచారంలో భాగంగా రేపు తిరుపతికి పవన్ కళ్యాణ్ వస్తున్నారు.. ప్రతి ఒక్కరు రేపటి ప్రచారాన్ని విజయవంతం చేయాలి.. అని సునీల్ దియోధర్ కోరారు.