
- ఎన్జీటీ ఆదేశాలను ధిక్కరిస్తూ ‘సంగమేశ్వరం’ పనులు
- త్వరగా పూర్తిచేయాలంటూ అధికారులకు తాజాగా ఏపీ సర్కారు ఉత్తర్వులు
- ఇంత జరుగుతున్నా పట్టించుకోని తెలంగాణ సర్కారు
- మళ్లీ ఎన్జీటీని ఆశ్రయించే యోచనలో పాలమూరు రైతులు
హైదరాబాద్, వెలుగు : శ్రీశైలం ప్రాజెక్టును గుల్ల చేసే సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్స్కీంకు తాగునీటి ముసుగేశారు. పర్యావరణ అనుమతులు పొందే వరకు పనులు ఆపేయాలన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను ధిక్కరించారు. తాగునీటి కోసం చేసే పనులకు అనుమతులు అవసరం లేదని, లిఫ్ట్స్కీంలో ఫస్ట్ఫేజ్పనులు పూర్తి చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చారు. ఈ మేరకు ఏపీ వాటర్ రీసోర్సెస్ ప్రిన్సిపల్సెక్రటరీ శశిభూషణ్ కుమార్తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో పంపు 2,913 క్యూసెక్కులు ఎత్తిపోసేలా ఆరు పంపులు ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
జూన్, జులై నెలల్లో చెన్నైతో పాటు రాయలసీమ తాగునీటి అవసరాలకు 59 టీఎంసీలు ఎత్తిపోసేలా ఈ ప్రాజెక్టులో పంపులు, మోటార్లు బిగించాలని ఆదేశించారు. శ్రీశైలం రిజర్వాయర్పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ గేట్లను 841 అడుగుల లెవల్లో ఏర్పాటు చేశారని, దీంతో తీవ్ర దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమతో పాటు చెన్నై తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయనే సంగమేశ్వరం లిఫ్ట్ స్కీంను చేపడుతున్నట్టు ఏపీ సర్కారు చెప్తోంది.
శ్రీశైలం నుంచి 800 అడుగుల లెవల్లో రోజుకు మూడు టీఎంసీలు ఎత్తిపోసేలా 2020 మే 5న సంగమేశ్వరం లిఫ్ట్ స్కీంకు రూ.3,825 కోట్లతో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ఇచ్చింది. శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొనే అప్రోచ్చానల్, అక్కడి నుంచి పంపుహౌస్లోకి నీటిని తరలించే హెడ్రెగ్యులేటర్, ఫోర్బేతో పాటు పంపుల ఏర్పాటుకు సంబంధించిన పనులన్నీ పూర్తి చేశారు.
తాగునీటి సాకుతో నీళ్ల తరలింపు
సంగమేశ్వరం లిఫ్ట్స్కీంకు పర్యావరణ అనుమతులు లేకపోవడంతో అవి పొందే వరకు పనులు ఆపేయాలని ఎన్జీటీ చెన్నై బెంచ్గతంలోనే రెండు సార్లు ఆదేశించింది. ఎన్జీటీ ఆదేశాలతో పర్యావరణ అనుమతుల కోసం ఏపీ వాటర్ రీసోర్సెస్ డిపార్ట్మెంట్ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయినా అనుమతులు మాత్రం రాలేదు. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తాగునీటి సాకుతో శ్రీశైలం రిజర్వాయర్ అడుగు నుంచి నీళ్లు ఎత్తిపోసే ప్రయత్నాలను ఏపీ మొదలు పెట్టింది.
చెన్నై తాగునీటికి 15 టీఎంసీలు, ఎస్సార్బీసీకి 19, తెలుగు గంగకు 29, గాలేరు నగరికి 38 టీఎంసీలు తరలించేలా ఈ ఎత్తిపోతల పథకం చేపట్టారు. రోజుకు 3 టీఎంసీల చొప్పున 101 టీఎంసీలు లిఫ్ట్ చేస్తామని ప్రతిపాదించారు. చెన్నైకి 15 టీఎంసీలను సరఫరా చేయాలంటే వెలిగోడు రిజర్వాయర్లో 9.5 టీఎంసీలు, సోమశిలలో 17.93, కడలేరులో 8.4 టీఎంసీలు కనీసం నిల్వ ఉండాలని చెప్తున్నారు.
రాయలసీమ తాగునీటి అవసరాలకు 8.6 టీఎంసీలు అవసరమని, ఇవన్నీ కలిపితే 58.83 టీఎంసీలవుతుందని, ఈ లెక్కన 59 టీఎంసీలు తరలించేలా పనులు చేపట్టాలని ఆదేశించారు. అంటే ప్రాజెక్టు నుంచి తరలిస్తామని చెప్పిన నీటిలో 60 శాతం నీళ్లను తాగునీటి సాకుతో తరలించాలని ఏపీ సర్కారు చూస్తోంది.
నోరు మెదపని తెలంగాణ
మోటార్ల ఆపరేషన్ మొదలు పెట్టి శ్రీశైలంలో ఉన్న కొద్దిపాటి నీళ్లను కృష్ణా బేసిన్ అవతలికి తరలించేలా ఏపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి నీళ్లు తరలించే కాల్వ కెపాసిటీని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచేలా సిమెంట్లైనింగ్ పనులు వేగంగా చేస్తోంది. ఇప్పుడు సంగమేశ్వరం ఎత్తిపోతలను తాగునీటి పేరుతో పూర్తి చేసే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అక్రమ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నా తెలంగాణ సర్కారు నోరు మెదపడం లేదు.
సంగమేశ్వరం ఎత్తిపోతలకు ఏపీ సర్కారు అనుమతులు ఇచ్చినప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం కిమ్మనలేదు. ఇప్పుడు తాగునీటి పేరుతో ప్రాజెక్టును పూర్తి చేయాలని చూస్తున్నా మౌనం వీడటం లేదు. అయితే, ఎన్జీటీ ఆదేశాలను ధిక్కరిస్తూ పనులు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడాన్ని గ్రీన్ ట్రిబ్యునల్లో సవాల్చేసే ప్రయత్నాల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతులు ఉన్నారు.