లోకాయుక్తను ఆశ్రయించిన ఏపీ లాంగ్వేజ్ పండిట్లు

లోకాయుక్తను ఆశ్రయించిన ఏపీ లాంగ్వేజ్ పండిట్లు
  • ప్రతి నెలా రూ.6 కోట్ల ప్రజాధనం వృధా అవుతోందని ఆరోపణ
  • అర్హతలున్న వారిని వదిలి అనర్హులకు అందలం కల్పించారని ఫిర్యాదు
     
  • ఫలితంగా పొరపాటును సరిదిద్దమని కోరినా సరిచేయకపోవడంతో లోకాయుక్తకు ఫిర్యాదు

విజయవాడ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న 10వేల 224 మంది భాషా ఉపాధ్యాయులు (లాంగ్వేజ్ పండిట్) పదోన్నతి వ్యవహారం ఏపీ లోకాయుక్త వద్దకు చేరింది. అన్ని అర్హతలుండి శిక్షణ పూర్తి చేసుకున్న వారిని వదిలేసి.. ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడిచేవిధంగా ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించడం వివాదాస్పదంగా మారింది. పొరపాటు జరిగిందేమోనని సరిచేయమని ఒకటికి పదిసార్లు చీఫ్ సెక్రెటరి, ప్రిన్సిపల్ సెక్రెటరీ, విద్యాశాఖ కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లినా.. స్పందన లేదు. అర్హతలున్న వారిని పక్కనపెట్టి లేనివారికి పదోన్నతులు ఇవ్వడం వల్ల ప్రతి నెలా రూ.6 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతున్నా విద్యాశాఖ అధికారులు కాని.. వారిపై అజమాయిషీ కలిగిన అడ్మినిస్ట్రేటివ్ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 
ఈ నేపధ్యంలో బహుజన టీచర్ప్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు ఉపాధ్యాయులు సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని ఏపీ లోకాయుక్తను స్వయంగా కలిసి ఫిర్యాదు చేశారు. 30 పేజీలతో ఉపాధ్యాయులందరి తరపున పుస్తకరూపంలో ఫిర్యాదును అందజేసి ప్రజాధనం వృధాను నివారించాలని.. అర్హతలున్న లాంగ్వేజి పండిట్లకు న్యాయం చేయాలని కోరారు. 
ఏం చేయాలి.. ఏం జరిగింది ?
భాషా పండితులు (లాంగ్వేజి పండిట్లు)కు పదోన్నతి కల్పించే ప్రతిపాదన అమలులోకి తెచ్చేందుకు 2018లో అప్పటి విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఫైలు ఓపెన్ చేశారు.  సమాన పనికి సమాన వేతనం పేరుతో ప్రాధమికోన్నత పాఠశాలలతోపాటు ఉన్నత పాఠశాలల్లో  పనిచేస్తున్న లాంగ్వేజి పండిట్లకు (ఎల్పీలకు) పదోన్నతి ఇవ్వాలని నిర్ణయించి 2018 జులై  17వ తేదీన ప్రతిపాదన చేశారు. 
ఈ ప్రతిపాదన ఆధారంగా యూపీ మరియు హైస్కూల్ లలో పనిచేస్తున్న 10వేల 224 మందికి పదోన్నతి కల్పిస్తూ  అదే ఏడాది అంటే 2018 డిసెంబర్ 17వ తేదీన అప్పట్లో విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీగా ఉన్న ప్రస్తుత చీఫ్ సెక్రటరీ అదిత్యనాథ్ దాస్ జీఓ నెంబర్ 91 విడుదల చేశారు. 
కమిషనర్  ప్రపోజల్స్, ప్రిన్సిపల్ సెక్రెటరీ ఇచ్చిన జీఓ 91 ఆధారంగా యూపీ మరియు హైస్కూల్ లలో పనిచేస్తున్న లాంగ్వేజి పండిట్లు (ఎల్పీ) 10 వేల 224 మందికి పదోన్నతి చేయాలని 2019 అక్టోర్ 20వ తేదీన అప్పటి మరియు ప్రస్తుత విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ రాజశేఖర్ మెమో నెంబర్ 796382 విడుదల చేశారు. 
విద్యాశాఖ కమిషనర్ ప్రపోజల్, ప్రిన్సిపల్ సెక్రెటరీ ఇచ్చిన జీవో 91 మరియు మోమో నెంబర్  796382 ఆధారంగా యూపీ మరియు హైస్కూల్ లలో పనిచేస్తున్న లాంగ్వేజి పండిట్లు 10 వేల 224 మందికి పదోన్నతి కల్పించాలని మాత్రమే ఉంది.
పై మూడు సందర్భాల్లో  ఎక్కడా కూడా ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు (ఎస్జీటీలకు) పదోన్నతి ఇవ్వాలని సర్వే లేదు..  ప్రపోజల్స్ కూడా లేదు. కాబట్టి పదోన్నతికి ఎస్జీటీలు అర్హులు కానేకారు. ఈ విషయం  విద్యాశాఖ అత్యున్నత అధికారులకు తెలిసినదే. అయితే  ఏమి జరిగిందో తెలియదు  పైరవీలకు పాల్పడ్డారా.. ? లేక ఇంకా ఏమైనా ఉందా..? ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికా..? పొరపాట్లు చేయడం వల్ల ప్రజాధనం వృధా అవుతుందని తెలిసినా కూడా ఉద్దేశ పూర్వకంగానే పొరపాట్లు చేశారా..? లేక ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఒత్తిడి చేసి పొరపాటు చేయించారా..? అనే సందేహాలకు తెరలేపుతూ జీవో నెంబర్ 77 జారీ చేశారు. మెమో 796382 (20.10.2019) జారీచేసిన 10 రోజులకే 30.10.2019 న జీఓ 77 జారీ చేసి ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు (SGT లకు) పదోన్నతి కల్పించారు. జీవో నెంబర్ 77 జారీ వల్ల పదోన్నతికి అర్హులైన లాంగ్వేజి పండిట్లు పదోన్నతికి నోచుకోక రాష్ట్రమంతటా 13 జిల్లాల్లో దాదాపుగా 1370 మందికి పైగా డీఈఓల పూల్ లోనికి వెళ్లిపోయారు.
మరి ఇప్పుడేం ఏం జరుగుతోంది ?
పదోన్నతుల కారణంగా యూపీ మరియు హైస్కూ లలో పనిచేయుచున్న లాంగ్వేజి పండిట్లు 6 నుండి 10వ తరగతి వరకు బోధన చేస్తున్నందున సమానపనికి సమాన వేతనం చెల్లించాలనే సదుద్దేశ్యంతో వారికి స్కూల్ అసిస్టెంట్ జీతాలు ఇచ్చే ప్రక్రియలో భాగంగా సర్వే చేసి ప్రపోజల్స్ పెట్టి జీఓ 91 జారీ చేసి, మెమో జారీ చేశారు.
 పదోన్నతి అంటే ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే ఎస్జీటీలకు వారి స్కూల్ అసిస్టెంట్ విద్యార్హతలు కలిగి ఉన్నపుడు సీనియారిటీ ఆధారంగా  SGT లు పదోన్నతికి అర్హులు.
 13 జిల్లాల్లో ప్రపోజల్స్ కేవలం యూపీ/హైస్కూల్ లలో పనిచేస్తున్న బాషాపాధ్యాయులు(LP) 10వేల 224 మందికి మాత్రమే పదోన్నతికి  అర్హులు. 
ఈ ప్రక్రియ లో ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న SGT లకు పదోన్నతి ఇవ్వాలనే సర్వే లేదు కాబట్టి ఉన్నతీకరణ అంశంలో వారి పదోన్నతికి తావులేదు.
అసలు ప్రధాన అంశం ఏమిటి ?
లాంగ్వేజి పండిట్ల  చదువు, శిక్షణ, DSC లో పరీక్ష వేరు. లాంగ్వేజి పండిట్లు  6 నుండి 10 వరకు విద్యార్థులకు బోధన చేసేందుకే ఉద్యోగంలో ఎంపిక కాబడతారు.
SGT ల చదువు, శిక్షణ, DSC లో పరీక్ష వేరు.  SGT లు 1 నుండి 5 వ తరగతి వరకు విద్యార్థులకు బోధన చేయుటకు ఉద్యోగంలో ఎంపిక కాబడతారు.
అందరికీ తెలిసిన ఈ విషయం ఇది. అయితే ఇరువురు ఒకటేనని కొందరు విద్యాశాఖ ఉన్నతాధికారులు వక్రభాష్యం ఇస్తున్నారు. ఇరువురు ఒకటే , పే స్కేల్ ఒకటే అంటూ వక్రీకరించి గత కొన్నేళ్లుగా పదోన్నతుల్లో లాంగ్వేజి పండిట్లకు  అన్యాయం చేసిన వైనంపై ఇప్పుడు పెద్ద దుమారం చెలరేగింది. పని సర్దుబాటు పేరుతో లాంగ్వేజి పండిట్లను ప్రాథమిక పాఠశాలల్లో  SGT లుగా పరిగణిస్తూ వారిని అవమానిస్తున్నారన్న విమర్శలు చెలరేగుతున్నాయి. తమ ప్రాథమిక హక్కులకు భంగం కల్గించడం ఎంతవరకు సబబు అని భాషోపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచాలని ఓ వైపు ప్రభుత్వం చెబుతుంటే.. సాక్షాత్తు ఉన్నతాధికారులే నిర్లక్ష్యంగా.. వృధా ఖర్చుకు అవకాశం కల్పించడాన్ని సహించలేక ప్రజాధనం వృధా కాకుండా చూడాలని, జరిగిన పొరపాట్లను సరిదిద్దాలని గౌరవ ఎపి లోకయుక్త కు బహుజన టీచర్స్ ఫెడరేషన్ (BTF)  పిర్యాదు చేసింది. ప్రపోజల్స్ మేరకు జీఓ 91 జారీ చేయకుండా అక్రమంగా జీఓ 77 జారీ చేసి SGT లకు పదోన్నతి అవకాశం కల్పించడం వల్ల రాష్ట్రమంతటా 13 జిల్లాల్లో  1370 మంది అర్హులైన భాషోపాధ్యాయులకు అన్యాయం జరుగుతోందని. వారి హక్కులకు భంగం కలుగుతోందని బీటీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.సతీష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతీకరణకు నోచుకోకుండా డీఈఓ పూల్ లోనికి పోవడం చాలా బాధాకరమని, వారి మనోభావాలను దెబ్బతీయడం తీవ్ర ఆవేదన చెందుతున్నారని ఆయన పేర్కొన్నారు. విద్యాశాఖ ఉన్నత అధికారులు చేసిన పొరపాట్ల వల్ల భాషోపాధ్యాయులు చదివిన చదువుకు, తీసుకున్న శిక్షణకు, DSC లో ప్రత్యేక పరీక్ష వ్రాసి ఎంపిక కాబడిన ఉద్యోగానికి సంబంధం లేని LP లను UP స్కూళ్లలో పని సర్దుబాటు పేరుతో  SGT లుగా పరిగణిస్తూ,  వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తూ, అవమానిస్తున్నారని సతీష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ మభ్యపెట్టే విధంగా ఈనెల 1వ తేదీన 1087 పోస్టుల్లో ఉన్న డీఈఓ పూల్ పండిట్లకు పదోన్నతి పేరుతో మెమో జారీ చేయడం విడ్డూరంగా ఉందని, గతంలో కూడా వీరి పేరున ప్రపోజల్స్ పెట్టి SGT లకు పదోన్నతి ఇచ్చారని గుర్తు చేశారు. మరల కూడా ఎస్జీటీ లకు పదోన్నతి ఇచ్చేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంలో లోకాయుక్తను స్వయంగా కలసి  30 పేజీలు బుక్ లెట్ రూపంలో ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు  సతీష్ కుమార్ వివరించారు.