AP: PRCపై తగ్గేదే లే అంటున్న ఉద్యోగ సంఘాలు

AP: PRCపై తగ్గేదే లే అంటున్న ఉద్యోగ సంఘాలు
  • రేపు మధ్యాహ్నం 3 గంటలకు సమ్మె నోటీసు ఇవ్వాలని తీర్మానం
  • ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించిన మంత్రుల కమిటీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు.. ప్రభుత్వం మధ్య గత కొన్ని రోజులుగా సాగుతున్న సంప్రదింపులు, చర్చలు.. పీక్స్ కు చేరాయి. సమ్మె చేయాలని ప్రాథమికంగా నిర్ణయించిన ఉద్యోగ సంఘాలు రేపు మధ్యాహ్నం నోటీసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఉద్యోగ సంఘాల నిర్ణయంపై మంత్రుల కమిటీ స్పందించింది. చర్చించి పరిష్కరించుకుందాం రమ్మంటూ ఆహ్వానం పంపింది. దీంతో రేపు ఉద్యోగ సంఘాలు.. మంత్రుల కమిటీ చర్చలపై అందరి దృష్టి కేంద్రీకృతం అయింది.  

ఆదివారం విజయవాడ రెవెన్యూ భవన్ లో ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశం అయ్యారు. పీఆర్సీ జీవోలను వెనక్కు తీసుకోవాలంటూ రేపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు ఇవ్వాలని పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సమావేశం తీర్మానించింది. సమ్మె నోటీసు ఎలా ఉండాలి....ఆ తర్వాత ఎలాంటి కార్యాచరణ అమలు చేయాలన్న దానిపై చర్చ జరిగింది. న్యాయపరంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సమ్మె నోటీసు ఉండేలా ఉద్యోగ సంఘాలు నాయకులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం సమ్మె నివారణ ప్రయత్నాలపై చర్చ జరిగింది. సమావేశం జరుగుతుండగానే ఉద్యోగ సంఘాల నాయకులకు మంత్రులు..బొత్స, పేర్ని నాని పోన్‌ చేసినట్లు సమాచారం. చర్చలతో సమస్యను పరిష్కరించుకుందామని సూచించినట్లు తెలుస్తోంది. అయితే..జీవోలపై వెనక్కు తగ్గే వరకూ చర్చల ప్రసక్తే వద్దని ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇప్పటికే సీఎస్‌కు సమ్మె నోటీసు ఇచ్చేందుకు తాము సిద్ధమయ్యామని.. ఈ సమయంలో వెనక్కు తగ్దే ఉద్దేశం లేదని మంత్రులకు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించిన మంత్రుల కమిటీ
ఉద్యోగ సంఘాల నాయకులతో సంప్రదింపులకు మంత్రుల కమిటీ ఆహ్వానించింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయం రెండో బ్లాక్‌కు రావాలంటూ ఉద్యోగ సంఘాల నాయకులకు సమాచారం ఇచ్చింది. ఉద్యోగులతో సంప్రదింపులకు, వారికి నచ్చజెప్పడానికి మంత్రులు బుగ్గన, బొత్స, పేర్నినాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్‌ సమీర్‌ శర్మలతో ఒక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ఢిల్లీపర్యటనలో  ఉన్నందున మిగిలిన మంత్రులు ఉద్యోగులతో సంప్రదింపులకు అందుబాటులో ఉంటామని సమాచారం ఇచ్చారు.

 

ఇవి కూడా చదవండి

ఏపీలో ఒక్కరోజే  14వేలు దాటిన కేసులు

ఐసీసీ టీ20 బెస్ట్ ప్లేయర్గా పాక్ ఆటగాడు

సయ్యద్ మోదీ టోర్నీలో పీవీ సింధు విజయం