రాజమండ్రి సెంట్రల్‌‌ జైల్లో ఇవాళ, రేపు చంద్రబాబు విచారణ

రాజమండ్రి సెంట్రల్‌‌ జైల్లో ఇవాళ, రేపు  చంద్రబాబు విచారణ
  • అనుమతిచ్చిన ఏసీబీ కోర్టు

హైదరాబాద్‌‌, వెలుగు : ఏపీ స్కిల్‌‌ డెవలప్‌‌మెంట్‌‌స్కామ్‌‌ కేసులో మాజీ సీఎం చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌, రిమాండ్‌‌ ఆర్డర్స్‌‌ను కొట్టివేయా లని ఆయన దాఖలు చేసిన క్వాష్  పిటిషన్‌‌ను హైకోర్టు శుక్రవారం డిస్మిస్​ చేసింది.  క్వాష్  పిటిషన్‌‌ డిస్మిస్ కావడంతో ఏసీబీ కోర్టు సీఐడీ కస్టడీపై తీర్పు వెల్లడించింది. రెండు రోజుల పాటు చంద్రబాబును సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

 అంతకుముందు రాజమండ్రి సెంట్రల్‌‌ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌‌ ద్వారా ఏసీబీ జడ్జి ముందు చంద్రబాబును ప్రొడ్యూస్  చేశారు. రెండు రోజుల కస్టడీపై కోర్టు సీఐడీకి షరతులు విధించింది. రాజమండ్రి సెంట్రల్ జైలులోనే చంద్రబాబును విచారించాలని ఆదేశించింది. కస్టడీకి తీసుకునే ముందు వైద్య పరీక్షలు తప్పనిసరి అని చెప్పింది. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ప్రశ్నించాలని తెలిపింది.

అడ్వకేట్ల సమక్షంలో విచారణ జరుపుతూ వీడియో రికార్డింగ్ చేయాలని స్పష్టం చేసింది. కస్టడీ విచారణకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు బయటకు విడుదల చేయకూడదని ఏసీబీ కోర్టు షరతు విధించింది.  ఆదివారం కస్టడీ ముగిసిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్‌‌ ద్వారా చంద్రబాబును తమ ముందు హాజరుపరచాలని ఆదేశించింది.

పూర్తి నివేదికను సీల్డ్‌‌ కవర్‌‌‌‌లో అందించాలని పేర్కొంది. కోర్టు ఆర్డర్స్‌‌తో శనివారం, ఆదివారం చంద్రబాబును విచారించేందుకు సీఐడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 12 మంది విచారణ అధికారులతో కూడిన లిస్ట్‌‌ను కోర్టుకు అందజేశారు.