గెజిట్‌‌‌‌పై తేల్చేందుకు అపెక్స్‌‌‌‌ మీటింగ్

గెజిట్‌‌‌‌పై తేల్చేందుకు అపెక్స్‌‌‌‌ మీటింగ్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌‌‌‌‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ అమలుపై తేల్చేందుకు త్వరలోనే అపెక్స్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ మీటింగ్ నిర్వహించనున్నారు. మూడో అపెక్స్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ మీటింగ్​కు జలశక్తి శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. తెలంగాణ, ఏపీలోని ప్రాజెక్టులు, పవర్‌‌‌‌‌‌‌‌ హౌస్‌‌‌‌‌‌‌‌లను బోర్డుల నిర్వహణకు అప్పగించడమే ఎజెండాగా ఈ భేటీ నిర్వహించనున్నారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ధారిస్తూ కేంద్ర జలశక్తి శాఖ నిరుడు జులై 14న గెజిట్‌‌‌‌‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ జారీ చేసింది. గెజిట్‌‌‌‌‌‌‌‌ అధికారికంగా అమల్లోకి వచ్చినా ఒక్క ప్రాజెక్టు కూడా కృష్ణా, గోదావరి బోర్డుల అధీనంలోకి వెళ్లలేదు. ఆయా బోర్డుల సబ్‌‌‌‌‌‌‌‌ కమిటీ సమావేశాల్లో హ్యాండోవర్‌‌‌‌‌‌‌‌ చేయడానికి అంగీకారం తెలిపిన ఔట్‌‌‌‌‌‌‌‌లెట్లు సైతం వాటి పరిధిలోకి రాలేదు. దీంతో గెజిట్‌‌‌‌‌‌‌‌ అమలుపై కేంద్రం సీరియస్‌‌‌‌‌‌‌‌గా కసరత్తు చేస్తోంది.
రెండు సార్లు మాత్రమే భేటీ
ఇప్పటిదాకా రెండు సార్లు మాత్రమే అపెక్స్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ మీటింగ్ నిర్వహించారు. మొదటి సమావేశంలో పాలమూరు – రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలపై చర్చించారు. 2020 అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 6న నిర్వహించిన రెండో భేటీలో రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలపై చర్చించారు. రెండు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాజెక్టులను కృష్ణా, గోదావరి బోర్డుల అధీనంలోకి తెచ్చేందుకు అంగీకారం తెలిపారు. కృష్ణా, గోదావరి నీటి వాటాలు తేల్చేందుకు కొత్త ట్రిబ్యునళ్ల ఏర్పాటుకు ఓకే చెప్పారు. వివాదాలపై చర్చించేందుకు కనీసం ఏడాదికి ఒకసారి సమావేశం కావాలని నిర్ణయించారు. అయితే గెజిట్‌‌‌‌‌‌‌‌ అమల్లోకి వచ్చి నెలలు గడుస్తున్నా ఒక్క ప్రాజెక్టు కూడా బోర్డు నిర్వహణలోకి వెళ్లకపోవడంపై జలశక్తి సీరియస్‌‌‌‌‌‌‌‌గా ఉంది. బచావత్‌‌‌‌‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌ ప్రకారం జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టుల రూల్‌‌‌‌‌‌‌‌ కర్వ్స్‌‌‌‌‌‌‌‌ నిర్ధారించాలని, ఆ తర్వాతే తమ ప్రాజెక్టులను బోర్డులకు అప్పగిస్తామని తెలంగాణ తేల్చి చెప్తోంది. కృష్ణాపై ఏపీలోని శ్రీశైలం, నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌లెట్లు ఇచ్చేందుకు ఏపీ ఉత్తర్వులిచ్చినా ముందు తెలంగాణ ప్రాజెక్టులు స్వాధీనం చేసుకోవాలని మెలిక పెట్టింది. గోదావరిపై రెండు రాష్ట్రాలకు కామన్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టుగా ఉన్న పెద్దవాగు అప్పగించడానికి మాత్రమే అంగీకారం కుదిరింది.
ఒక్క అడుగూ ముందుకు పడలే
గెజిట్‌‌‌‌‌‌‌‌ అమలుపై రెండు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపేందుకు కేఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీ, జీఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీ సబ్‌‌‌‌‌‌‌‌ కమిటీలు ఏర్పాటు చేసి పలుమార్లు చర్చించాయి. గెజిట్‌‌‌‌‌‌‌‌ అమలుకు సహకరించాలని రెండు రాష్ట్రాల సీఎంలను పలు సందర్భాల్లో కేంద్ర మంత్రి కోరారు. అయినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో కేంద్రం ఇప్పటి వరకు గెజిట్‌‌‌‌‌‌‌‌ అమలుకు చేపట్టిన చర్యలపై పూర్తి వివరాలు సేకరించింది. ఆయా వివరాల ఆధారంగా మూడో అపెక్స్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ నిర్వహణకు ఎజెండా రూపొందించినట్టు తెలిసింది. పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ తొలి విడత బడ్జెట్‌‌‌‌‌‌‌‌ సమావేశాల తర్వాత ఫిబ్రవరి మూడో వారంలో సమావేశం ఉంటుందని రెండు బోర్డులకు సమాచారం అందినట్టు తెలిసింది. పూర్తి స్థాయిలో ఎజెండా ఖరారు చేసి వచ్చే వారంలోనే రెండు రాష్ట్రాలకు మీటింగ్ నిర్వహణపై లేఖలు రాసే అవకాశముందని తెలిసింది.