అప్మెల్ తెలంగాణదే

అప్మెల్ తెలంగాణదే

1976లో ఏర్పడిన అప్మెల్ ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కిందికి వస్తుంది. కాబట్టి ఆస్తి పంపకాల పరిధిలోకి అసలు రాదు. 1994లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సింగరేణికి అప్మెల్ ను అప్పజెప్పింది . భారీ నష్టా ల్లో కూరుకుపోయి దాదాపు మూతపడే పరిస్థితుల్లో ఉన్న అప్మెల్ ను సింగరేణి టేకోవర్ చేసి లాభాల్లోకి తీసుకొచ్చింది. కేంద్రానికి, ఏపీ ప్రభుత్వానికి విభజన తర్వాత ట్యాక్సులు చెల్లిస్తోంది. 300 మందికి పైగా సిబ్బందికి వేతనాలు కూడా సింగరేణే ఇస్తోంది. రూ.50 కోట్లకుపైగా సింగరేణి ఏటా అప్మెల్ కు ఆర్డర్లు కూడా ఇస్తోంది. ఏటా రూ.75 కోట్ల టర్నోవర్ వస్తోంది. దీనంతటికీ సింగరేణే కారణం. అమరావతికి 8 కిలోమీటర్ల దూరంలో 250 ఎకరాలు, ఆటోనగర్ లో 30 ఎకరాలు ఇలా రూ.1,100 కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయి.

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, -తెలంగాణకు గుండెకాయ అయిన సింగరేణి ప్రగతి బాటలో పయనిస్తోంది. 132 ఏండ్ల చరిత్ర కలిగిన సింగరేణి.. తెలంగాణ ఏర్పడిన తర్వాత అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటోంది. సింగరేణి లేకుండా తెలంగాణను చూడలేం. సింగరేణి లేని తెలంగాణను ఊహించుకోలేం. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటునకు సింగరేణీయుల కంట్రిబ్యూషన్ మరువలేం. ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి ఆరున్నర ఏండ్లు అవుతోంది. ఏపీలో ఉన్న సింగరేణికి చెందిన దాదాపు రూ.1,200 కోట్ల ఆస్తి అయిన అప్మెల్(ఏపీహెచ్ఎంఈఎల్) సింగరేణికి చెందినదే. విభజన చట్టం ప్రకారం ఇది సింగరేణికే చెందాలి. సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స్ గా ఉన్న వారే దీనికి చైర్మన్ గా.. ఇతర సింగరేణి ఉద్యోగులే సభ్యులుగా పాలకమండలి కొనసాగుతోంది.

ఏపీకి చెందుతుందన్న షీలాబిడే కమిటీ

 

ఈ ఆరున్నర ఏండ్లలో షెడ్యూల్ 9లో ఉన్న సంస్థల విభజనకు సంబంధించి షీలాబిడే కమిటీ పదిసార్లు సమావేశమైంది. 2018లో జరిగిన సమావేశం తర్వాత షీలాబిడే కమిటీ అప్మెల్ ఏపీకి చెందుతుందని నివేదిక ఇచ్చింది. 2019లో జరిగిన సమావేశంలో అప్మెల్ తమదేనని సింగరేణి యాజమాన్యం వాదించింది. దీనిపై కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఎందుకంటే ఇందులో సింగరేణికి 81.54 శాతం వాటా ఉంది. ఏపీఐడీసీకి 5.79 శాతం వాటా ఉంది. పబ్లిక్ షేర్ హోల్డర్లకు 11.81 శాతం ఉంది. దీని ప్రకారం అప్మెల్ తెలంగాణలోని సింగరేణికి చెందుతుంది. షీలాబిడే కమిటీ తీసుకున్న నిర్ణయం షెడ్యూల్ 9కి పూర్తి విరుద్ధమైనది. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో కేంద్రానికి లేఖ రాసింది. సీఎం కేసీఆర్ కూడా దీనిపై కేంద్రంతో చర్చించారు.

నష్టాల నుంచి లాభాల్లోకి..

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గతంలో ఈ భూములను కొనుగోలు చేసే ప్రయత్నం చేయగా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సింగరేణియులు ఆందోళన చేయడంతో ఆగిపోయింది. అలాంటి అప్మెల్​ను ఇప్పుడు షీలాబిడే కమిటీ సిఫార్సుతో ఆంధ్రప్రదేశ్ కు ఎలా ఇస్తారు? అప్పట్లో మూతబడిపోయే స్థితిలో ఉన్న అప్మెల్​ను టీడీపీ ప్రభుత్వం రివైవల్ కు ఒక జీవో జారీ చేసి సింగరేణికి అంటగడితే దానిని లాభాలబాటలోకి తీసుకురావడం తప్పా? ఇప్పటికీ సౌత్ ఈస్టర్న్ సంస్థ నుంచి రూ.10 కోట్ల నుంచి రూ.18 కోట్ల వరకు అప్మెల్ కు ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. గత ఏడాది సింగరేణి నుంచి ఆర్డర్లు తగ్గితేనే రూ.2 కోట్ల వరకు నష్టాలు వచ్చాయి. అలాంటిది సింగరేణి లేకుండా ఈరోజు రూ.75 కోట్ల టర్నోవర్ కాకుండా దాదాపు రూ.1,200 కోట్ల ఆస్తిగా ఉన్న అప్మెల్ ను, దాని భూములను ఏపీకి ఎలా ఇస్తారు? సింగరేణి యాజమాన్యం, సింగరేణి డైరెక్టర్స్, తెలంగాణ ప్రభుత్వం అప్మెల్ తెలంగాణదే అని అంటున్నాయి. వీరికంటే ఎక్కువగా తెలంగాణ ప్రజలు కూడా అప్మెల్ తెలంగాణదే అంటున్నారు. దానిని టేకోవర్ చేసినప్పుడు ఒక కార్పొరేషన్ గా తీసుకున్నప్పుడు అది తెలంగాణది కాకుండా ఆంధ్రప్రదేశ్ ది ఎలా అవుతుంది. కేంద్ర ప్రభుత్వం న్యాయంగా ఆలోచించాలి. లేని పక్షంలో అప్మెల్ కోసం మరో ఉద్యమం తప్పదు.

అప్మెల్​ ముమ్మాటికీ సింగరేణిదే

అక్కడ ఉద్యోగులను తెలంగాణ ఉద్యోగులుగా, సింగరేణి ఉద్యోగులుగా ఇంకా సింగరేణి భావిస్తూనే ఉంది. వారికి ఇంకా సింగరేణి జీతాలు ఇస్తూనే ఉంది. ఈ రోజు ఒరిస్సాలోని నైనీలో 50 మిలియన్ టన్నుల బొగ్గు బ్లాక్ ను సింగరేణికి కేంద్రం కేటాయించింది. దానిని తవ్వడానికి కంపెనీ సిద్ధమవుతోంది. రూ.500 కోట్ల వరకు పెట్టుబడులు పెడుతోంది. అది తెలంగాణ ఆస్తి. అది తెలంగాణ బొగ్గు బ్లాక్ కాకుండా ఒరిస్సాది అవుతుందా? రేపు దాని నుంచి రాయల్టీలు, ఇతర పన్నులు, జీఎస్టీ వగైరా ఒరిస్సా ప్రభుత్వం, కేంద్రం తీసుకుంటాయి కదా. అనవసరమైన వాదనలకు వెళ్లకుండా తెలంగాణకు అప్మెల్ ను బేషరతుగా అప్పజెప్పాల్సిందే. ప్రస్తుతం రూ.3 కోట్ల నష్టాల్లో అప్మెల్ కొనసాగుతోంది. సింగరేణి రూ.60 కోట్లు, కోల్ ఇండియా రూ.20 కోట్ల పనులను ఇవ్వడంతో అప్మెల్ టర్నోవర్ రూ.80 కోట్లుగా ఉంది. కరోనా వైరస్​ నేపథ్యంలో మరింత ఎక్కువ నష్టాలు అప్మెల్ కు వచ్చే పరిస్థితి కనపడుతోంది. సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ నేతృత్వంలో సింగరేణి డైరెక్టర్ అపరేషన్స్ అండ్ పర్సనల్ ఎస్.చంద్రశేఖర్ అప్మెల్ చైర్మన్ గా సంస్థ వ్యవహారాలను చూస్తున్నారు. అప్మెల్ ముమ్మాటికీ సింగరేణి ఆస్తేనని, సింగరేణి ఆస్తిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలా హక్కు ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రానికి లేఖ రాసింది. కోల్ బెల్ట్ ప్రాంత ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఎం.డి.మునీర్, సీనియర్ జర్నలిస్ట్