హెల్త్ : రోజుకో యాపిల్​ చాలా?

హెల్త్ : రోజుకో యాపిల్​ చాలా?

బయోయాక్టివ్​ సబ్​స్టెన్స్​ అంటే... పిట్టకొంచెం కూత ఘనం టైప్​. అంటే బయోయాక్టివ్​ సబ్​స్టెన్స్​ ఉన్న ఫుడ్​ను తక్కువ మొత్తంలో తిన్నా పోషకాలు మెండుగా అందుతాయి. ఇలాంటివి తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో లాభం. ఈ ఫుడ్స్​లో కొద్ది మొత్తంలో ఉండే సహజసిద్ధమైన రసాయనాలు శరీరం మీద ఎఫెక్ట్​ చూపిస్తాయి. అయితే శరీరానికి పోషకాలను అందించే విటమిన్స్​లా ఈ కెమికల్స్​ను ఇవి ఫలానా వర్గానికి చెందుతాయి అని క్లాసిఫికేషన్​ చేయలేదు. కొన్నేండ్లుగా నేను యూనివర్సిటీ  క్లాసుల్లో విటమిన్స్, మినరల్స్​, కార్బోహైడ్రేట్స్​​, ప్రొటీన్స్, ఫ్యాట్స్​ వంటి పోషకాల గురించి చెప్తున్నా. కానీ ఈ మధ్య ఫంక్షనల్​ ఫుడ్స్​ మీద ప్రత్యేకంగా ఒక కోర్సు తయారుచేశా. ఈ కోర్సులో మనం తినే ఫుడ్​లో ఉండే రకరకాల బయోయాక్టివ్​ సబ్​స్టెన్స్​ల​ గురించి చెప్తున్నా. వాటితో పాటు ఫంక్షనల్​ ఫుడ్స్​లో కొన్ని మెడిసిన్​లా ఎలా పనిచేస్తాయనేది కూడా వివరిస్తున్నా.

ఫంక్షనల్​ ఫుడ్స్​ అంటే...

ఆరోగ్యానికి మేలు చేసే బయోయాక్టివ్​ సబ్​స్టెన్స్​లను ఎక్కువమొత్తంలో కలిగి ఉన్న యాపిల్​ పండు ఫంక్షనల్​ ఫుడ్​ క్యాటగిరీ కిందకు వస్తుంది. ఈ ఫంక్షనల్​ ఫుడ్స్​... సూపర్​ ఫుడ్స్​ లాంటివి కాదు. సూపర్​ఫుడ్​ అనేది బజ్​ వర్డ్ అని చెప్పొచ్చు​. ​ కాలె, పాలకూర​, బ్లూబెర్రీస్​ వంటి ఉత్పత్తులను ప్రమోట్​ చేసుకునేందుకు మార్కెటర్స్ వాడుతున్న పదం ఇది. ‘సూపర్’​ అనే లేబుల్​ వేయడం వల్ల వాటి అమ్మకాలు పెరుగుతాయి. నిజానికి సూపర్​ ఫుడ్​ అంటే... అందులో సుపీరియర్​ న్యూట్రిషనల్​ వాల్యూ ఉండాలి. ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఉండాలి. ఉదాహరణకి సాల్మన్​ (రవ్వ), ట్యునా చేపలు రెండూ సూపర్​ ఫుడ్​ కేటగిరీకి వస్తాయి. వీటిలో ఒమెగా –3 ఫ్యాట్స్​ ఉంటాయి. ఈ ఫ్యాట్స్​ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాకాకుండా సూపర్​ ఫుడ్స్​ అని చెప్పి మార్కెటింగ్​ చేసే వాటిని తినడం వల్ల అడ్వర్టైజ్​మెంట్స్​లో వాళ్లు చెప్పినంత ఆరోగ్య లాభాలు అందవు. అలా ఎందుకంటే... ఫంక్షనల్​ ఫుడ్స్​లా సూపర్​ ఫుడ్స్​ వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని సైంటిఫిక్​గా ఎటువంటి ఆధారాలు లేకపోవడమే.

కణాలు దెబ్బతినకుండా...

శరీరం ఎదుగుదల, అభివృద్ధికి అవసరమైన పోషకాలతో పాటు ఫంక్షనల్​ ఫుడ్స్​లో పలురకాల బయోయాక్టివ్​ సబ్​స్టెన్స్​లు​ ఉంటాయి. ఇవి ఒక్కోటి శరీరానికి ఒక్కో రకంగా ఉపయోగపడతాయి. బయోయాక్టివ్​ సబ్​స్టెన్సెస్​ అనేవి కొన్ని ఫుడ్స్​లో సహజంగానే ఉంటాయి. కొన్నింటిలో మాత్రం ప్రాసెసింగ్​ చేసేటప్పుడు కలుపుతారు. బయోయాక్టివ్​ కాంపొనెంట్స్​ ఫుడ్​లో ఎలా పెరుగుతాయి అనే విషయంపై ఇంకా పరిశోధనలు చేస్తున్నారు. అయితే వాటిలో ఉండే కాంపొనెంట్స్​ మాత్రం కొత్తవేం కాదు. ఎవిడెన్స్ బేస్డ్ రీసెర్చిలో వాటివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయం ఎప్పుడో వెల్లడైంది. బయోయాక్టివ్​ సబ్​స్టెన్సెస్​కి ఉదాహరణగా కెరొటినాయిడ్స్​ని చెప్పొచ్చు. వీటిని గుర్తించడం కూడా చాలా ఈజీ. వాటిలో పసుపు, నారింజ, ఎరుపు రంగు పండ్లు, కాయగూరలు అంటూ 850 రకాల రంగుల​ గ్రూప్​ ఉంది. కెరొటినాయిడ్స్​ ప్రైమరీ ఫంక్షన్​ యాంటీఆక్సిడెంట్స్​గా పనిచేస్తాయి. 

అంటే శరీరంలో కణాలు దెబ్బతినకుండా ఇవి సాయం చేస్తాయన్నట్టు. కెరొటినాయిడ్స్​ వేటికవి వేరు వేరు పద్ధతుల్లో పనిచేస్తుంటాయి. క్యారెట్స్​లో ఎక్కువ మొత్తంలో ఉండే బీటా కెరోటిన్​ చాలామంచి కెరొటినాయిడ్​. క్యారెట్ తినడం వల్ల బీటా కెరొటిన్​ విటమిన్​–ఎగా  మారుతుంది. విటమిన్–​ ఎ అనేది సాధారణమైన కంటి చూపుకి ఎంత అవసరమో తెలిసిన విషయమే. ల్యూటిన్​, జెగ్జాంథిన్​ ఈ రెండూ పసుపు రంగు కెరొటినాయిడ్స్​. ఇవి మొక్కజొన్న, పెప్పర్స్(మిర్చి, క్యాప్సికమ్​)​లో ఉంటాయి. ఇవి దృష్టి లోపం రానీయకుండా చేస్తాయి. ప్రత్యేకించి పెద్దవాళ్ల కంటిచూపు మెరుగ్గా ఉండేలా చేస్తాయి ఇవి.తినే ఫుడ్​, ఇతర బయోయాక్టివ్​ సబ్​స్టెన్సెస్​ నుంచి వచ్చే కెరొటినాయిడ్స్​ కొన్ని రకాల క్యాన్సర్​లు రాకుండా నిరోధిస్తాయి. 

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కెరొటినాయిడ్స్​ ఎక్కువగా ఉన్న పండ్లు, కాయగూరలు తినడం వల్ల కార్డియోవాస్కులర్​ వ్యాధుల రిస్క్​ తగ్గుతుంది. అయితే కెరొటినాయిడ్స్​ సప్లిమెంట్స్​ వాడితే సరిపోతుంది కదా అనుకునే వాళ్లకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అలా సప్లిమెంట్స్​ వాడటం వల్ల కొన్నిరకాల లాభాలు మాత్రమే వస్తాయి.

ఫంక్షనల్​ ఫుడ్​ మూవ్​మెంట్​...

‘యాన్​ యాపిల్​ ఎ డే కీప్​ డాక్టర్​ ఎవే’ అనే సామెత 1800 సంవత్సరానికి అటుఇటుగా పుట్టింది. న్యూట్రిషన్​ అనేది అప్పుడప్పుడే పుడుతున్న సైన్స్. కానీ అప్పట్లోనే ఫంక్షనల్​ ఫుడ్స్​, బయోయాక్టివ్​ కాంపొనెంట్స్​ అనే వాటి గురించి మాట్లాడేవారు. 1900 నుంచి 1970 తొలినాళ్లలో విటమిన్​ లోపం మీద రీసెర్చ్​ చేయడంపై దృష్టి పెట్టారు. విటమిన్​ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తినమని, ప్రాసెస్డ్​ ఫుడ్స్​ తినడం వల్ల పోషకాహార లోపం కలుగుతుంది అని ప్రజల్లో అవగాహన పెంచడం మొదలుపెట్టారు. పోషకాహార లోపం వల్ల స్కర్వీ(చిగుళ్ల వాపు, పండ్ల నుంచి రక్తం కారటం) వంటి వ్యాధులు వస్తాయని చెప్పారు. ఈ జబ్బు విపరీతమైన విటమిన్ –సి, క్యాల్షియం లోపం వల్ల వస్తుంది. వీటితోపాటు ఎక్కువకాలం విటమిన్​ –డి లోపం ఉంటే రికెట్స్​ బారిన పడతారని కూడా హెచ్చరించారు. దాంతో కొన్ని రకాల పోషకాహారం మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాటినే ఎక్కువగా తిన్నారు. 

దాంతో ప్రాసెస్​ చేసిన ఫుడ్​ ఎక్కువగా అందుబాటులోకి వచ్చింది. ప్రాసెస్డ్​ ఫుడ్​ తినడం వల్ల బరువు పెరిగారు. డయాబెటిస్​, హై బ్లడ్ ప్రెషర్​, గుండె జబ్బులు మొదలయ్యాయి. ఇలాగైతే లాభం లేదనుకున్న యు.ఎస్.​ ప్రభుత్వం1980లో మొదటిసారి డైటరీ గైడ్​లైన్స్​ పబ్లిష్​ చేసింది. అందులో కొవ్వు​, చక్కెర​, ఉప్పు తినడం మానేయాలని ప్రజలకు చెప్పింది. పబ్లిక్​ హెల్త్​ మెసేజ్​ల ద్వారా ఫ్యాటీ ఫుడ్స్​కి బదులు బ్రెడ్స్​, పాస్తా వంటి స్టార్చీ ఫుడ్స్​ తినమని చెప్పింది. ఇలాంటి మెసేజ్​ వెనక ఉన్న అసలు ఉద్దేశం... ఫ్యాటీ​ ఫుడ్స్​ తక్కువ తిని కార్బోహైడ్రేట్స్​ ద్వారా కాలరీలను పెంచుకొమ్మని చెప్పటం. ఇలా చేయడం వల్ల సరిపడా కాలరీలు శరీరానికి అందుతాయి అనుకుంది అప్పటి ప్రభుత్వం. పోషకాహారానికి సంబంధించి ఇచ్చిన ఈ సలహా ​కాస్తా ఒబెసిటీని తారాజువ్వలా పెంచేసింది. అలాగే డయాబెటిస్​ రేట్​ కూడా పెరగడం మొదలైంది. అది ఇప్పటికీ పెరుగుతూనే ఉంది.

యాపిల్స్​లో ...

ఇక యాపిల్​ విషయానికి వస్తే... యాపిల్​లో ఉండే సహజమైన డైటరీ ఫైబర్ బయోయాక్టివ్​ కాంపొనెంట్. యాపిల్​ గుజ్జులో ‘పెక్టిన్’​ అనే ఫైబర్​ ఉంటుంది. అది శరీరం శోషించుకున్న చక్కెర, కొవ్వులను తగ్గిస్తుంది. దానివల్ల డయాబెటిస్​, గుండె జబ్బుల రిస్క్​ తగ్గుతుంది. యాపిల్​ తొక్కలో లాక్సేటివ్​గా పనిచేసే ఫైబర్​ ఉంటుంది. ఇదేకాకుండా యాపిల్స్​లో ఎక్కువ మొత్తంలో సహజసిద్ధ రసాయనాలు అయిన పాలీఫినాల్స్​ ఉంటాయి. ఇవి ఆరోగ్యంగా ఉంచుతాయి. దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తాయి.

పలురకాల ప్లాంట్​ ఫుడ్స్​లో ఎనిమిదివేలకి పైగా పాలీఫినాల్స్​ను గుర్తించారు రీసెర్చర్లు. ఇక్కడ మీరో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ పాలీఫినాల్స్​ అన్నీ కూడా వాటి తొక్కల్లోనే ఉన్నాయి. అందుకనే ఈసారి నుంచి జ్యూస్, సాస్​ లేదా తొక్కతీసి కాకుండా యాపిల్​ను మొత్తంగా తినండి. పాలీఫినాల్స్​ సబ్​ క్లాస్​ అయిన యాంథోసైనిన్స్​ యాపిల్​ తొక్క మీద ఉన్న ఎరుపు రంగులో ఉంటాయి. యాంథోసైనిన్స్​ ఉన్న ఆహారం తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అల్జీమర్స్​ వ్యాధులకు చేసే చికిత్సలో కూడా ఇది బాగా ఉపయోగపడిందని స్టడీల్లో వెల్లడైంది. యాపిల్స్​​లో  ఫ్లోరిడ్జిన్​ అనే ప్రైమరీ పాలీఫినాల్​​ ఉంటుంది. అది రక్తంలో గ్లూకోజ్​ను అదుపులో ఉంచడంలో సాయపడుతుంది. ఈ మధ్య చేసిన స్టడీలో కూడా చిన్న పేగులనుంచి విడుదలయ్యే గ్లూకోజ్​ శోషణను తగ్గించి, కిడ్నీల ద్వారా బయటికి పంపేస్తుందని తేలింది. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్​ లెవల్​ సరిగా ఉంటుంది.

రోజుకి ఒకటా? రెండా?

ఇదంతా ఓకే కానీ ఫంక్షనల్​ ఫుడ్​ యాపిల్​ తింటే నిజంగానే డాక్టర్​ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదా అనే డౌట్​ వస్తుంది చాలామందికి. ఈ విషయం తేల్చేందుకే పరిశోధకులు ట్రై చేశారు. యు.ఎస్.ఎ. కి చెందిన రీసెర్చర్ల బృందం ఒకటి ‘యాపిల్​ ఈటింగ్ ప్యాటర్న్​.. నెంబర్​ ఆఫ్​ డాక్టర్​ విజిట్స్’ అనే సబ్జెక్ట్​​ మీద స్టడీ చేసింది. ఎనిమిదివేల మందికి పైగా పెద్దవాళ్లను ఇందులో భాగం చేసింది. వీళ్లలో 9 శాతం మంది రోజూ యాపిల్​ తిన్నారు. జనాభా​, ఆరోగ్యకరమైన అంశాలను లెక్కలోకి తీసుకుని ​ రోజూ యాపిల్ తినేవాళ్లను, తినని వాళ్లతో పోల్చి చూశారు. రోజూ యాపిల్ తినేవాళ్లకు మెడిసిన్​ వాడాల్సిన అవసరం తక్కువ పడింది. డాక్టర్​ని కలవాల్సిన అవసరం మాత్రం తిన్న, తినని వాళ్లకి... ఇద్దరికీ ఒకేలా ఉంది.

రోజుకి ఒక యాపిల్​ తినడం వల్ల డాక్టర్​ని దూరం పెట్టలేకపోతున్నామంటే రోజుకి రెండు లేదా మూడు యాపిల్స్​ తినాలా? ఈ ప్రశ్నని కూడా వదలదల్చుకోలేదు రీసెర్చర్లు. యూరోపియన్​ రీసెర్చర్లు రోజుకి రెండు యాపిల్స్​ తింటే ఏం లాభం అనే దానిమీద రీసెర్చ్​ చేశారు. ఇలాచేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడిందని తేల్చారు. ఈ రీసెర్చ్​లో40 మంది పెద్దవాళ్లను శాంపిల్​గా తీసుకున్నారు. బ్రెజిలియన్​ రీసెర్చర్ల స్టడీలో​ రోజుకు మూడు యాపిల్స్​ తినడం వల్ల బరువు తగ్గడం, రక్తంలో​ గ్లూకోజ్ లెవల్​ సరిగా ఉండడం గమనించారు. ఈ స్టడీని అధిక బరువు ఉన్న 40 మంది ఆడవాళ్ల మీద చేశారు. మొత్తంమీద అర్ధమయ్యేదేంటంటే యాపిల్​ను వండాల్సిన పని లేదు. రిఫ్రిజిరేటర్​లో పెట్టకపోయినా వారం రోజుల వరకు పాడవదు. అందుకని యాపిల్స్​ను మీ కార్ట్​లోకి చేర్చడం తప్పనిసరి. రోజుకి కనీసం ఒక యాపిల్​ తినే అలవాటు చేసుకుని ఆరోగ్యంగా ఉండండి” అంటోంది జానెట్​ కోల్సన్​.

యాపిల్​లో విటమిన్​-ఎ ఎక్కువగా ఉండదు. క్యారెట్స్​ కళ్ల ఆరోగ్యానికి ఎలాగైతే మేలు చేస్తాయో అలాంటిదీ లేదు. అలాగే విటమిన్​-సి కి యాపిల్​ మంచి సోర్స్​ కాదు. అంతెందుకు జలుబు లాంటివి దరిచేరనీయకుండా అడ్డుగోడలా నిలబడే ఆరెంజెస్​లా కూడా కాదు. అయినప్పటికీ రోజుకో యాపిల్ తింటే డాక్టర్​ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం రానీయదు అంటారు ఎందుకు? ‘‘ఎందుకంటే ఇక్కడ చెప్పినవేవీ లేకపోయినా కూడా యాపిల్​ అనేది ఫంక్షనల్​ ఫుడ్​ కిందకు వస్తుంది. యాపిల్స్​లో బయోయాక్టివ్​ సబ్​స్టెన్సెస్​ ఉంటాయి” అంటున్నారు జానెట్ కోల్సన్​. ఈమె మిడిల్​ టెన్నెస్సె స్టేట్​ యూనివర్సిటీలో న్యూట్రిషన్​ అండ్ ఫుడ్​ సైన్స్​ ప్రొఫెసర్​. ఆ విషయాల గురించి ఆమె మాటల్లోనే మరిన్ని వివరాలు...


ఫుడ్​ హెల్త్​ మీద జపాన్​ ఫోకస్​

అన్ని దేశాల్లోకెల్లా జపాన్​ ప్రజలు ఆరోగ్యకరమైన జనాభా అంటారు. కానీ 21వ శతాబ్దంలో మాత్రం చాలామంది జపనీయులు అమెరికన్​ డైట్​అడాప్ట్​ చేసుకున్నారు. ఆ డైట్​ వల్ల యు.ఎస్.​లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చాయో అలాంటి సమస్యలే జపాన్​లో కూడా మొదలయ్యాయి. ఆ దేశ ప్రజల నడుము చుట్టుకొలత పెరిగి, అనారోగ్యం బారిన పడే వాళ్ల సంఖ్య పెరిగిపోయింది. అది గమనించిన జపాన్​ ప్రభుత్వం వెంటనే ఆ సమస్యకు చెక్​ పెట్టాలి అనుకుంది. అలా1980ల్లో మొట్టమొదటిసారి ‘ఫంక్షనల్ ఫుడ్స్’​ అనే కాన్సెప్ట్​ ప్రవేశపెట్టింది​. 

ఈ కాన్సెప్ట్​ను ఫాలో అయిన మొదటి దేశం జపాన్​. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని శాస్త్రీయంగా నిరూపించారు కూడా. అలా  ప్రజల దృష్టి మరల్చి మంచి ఫలితాల్ని సాధించారు జపాన్​లో. ప్రజల ఆరోగ్య ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని దాదాపు వెయ్యికి పైగా స్పెషల్​ ఫుడ్స్​, బేవరేజ్​లను అప్రూవ్​​ చేసింది. వాటిలో హైపోఅలెర్జినిక్ రైస్​ ఒకటి. మామూలుగా అయితే  రైస్​ వల్ల అలర్జీలు రావు. కానీ జపాన్​ ప్రజల్లో మాత్రం అదే  ప్రధాన సమస్య అయింది.