వైన్స్​కు అప్లికేషన్ల కిక్కు.. సర్కారుకు ఆదాయం 2 వేల 140 కోట్లు

వైన్స్​కు అప్లికేషన్ల కిక్కు.. సర్కారుకు ఆదాయం 2 వేల 140 కోట్లు
  • పోటీపడ్డ ఎమ్మెల్యేల బంధువులు, లీడర్లు, రియల్టర్లు, వ్యాపారులు, మహిళలు
  • శుక్రవారం ఒక్కరోజే 45 వేలకు పైగా దరఖాస్తులు
  • రాత్రి దాకా క్యూకట్టి అప్లికేషన్లు ఇచ్చిన ఆశావహులు
  • ఎల్లుండి జిల్లాల్లో లక్కీ డ్రా.. 22న ఫస్ట్ ఇన్‌‌స్టాల్‌‌మెంట్‌‌ చెల్లింపులు
  • నవంబర్​ 30 నుంచి కొత్త దుకాణాలకు స్టాక్‌‌ రిలీజ్‌‌
  • డిసెంబర్ ఒకటి నుంచి కొత్త వైన్స్​ అందుబాటులోకి

హైదరాబాద్‌‌, వెలుగు:  రాష్ట్రంలో మద్యం దుకాణాల కోసం రికార్డు స్థాయిలో అప్లికేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,620 వైన్స్ ఉండగా.. శుక్రవారం చివరి రోజు కావడంతో సాయంత్రం 6 గంటల వరకు 1.07 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో శుక్రవారం ఒక్కరోజే 45 వేలకు పైగా రావడం గమనార్హం. దీంతో ప్రభుత్వ ఖజానాకు అప్లికేషన్ల ద్వారానే రూ.2,140 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ నెల 4వ తేదీ నుంచి ఎక్సైజ్ ఆఫీసుల్లో అధికారులు అప్లికేషన్లు స్వీకరించారు. ప్రభుత్వ పథకాల మాదిరిగా రాష్ట్ర సర్కారు ప్రచారం చేయడం, వైన్స్‌‌కు అప్లై చేసుకోవాలని కోరుతూ ఆఫీసర్లతో మీటింగులు పెట్టించడంతో.. ఒక్కో వైన్స్‌‌కు వందల్లో అప్లికేషన్లు వచ్చాయి. కొన్నిచోట్ల రాత్రి 8 గంటల వరకు క్యూలో నిల్చుని దరఖాస్తులు సమర్పించారు. వైన్స్​ షాపులకు అప్లై చేసుకున్న వారిలో ఎమ్మెల్యేల దగ్గరి బంధువులు, లీడర్లు, రియల్టర్లు, పలువురు వ్యాపారులు, మహిళలు కూడా ఉన్నారు. కొత్త మద్యం దుకాణాలు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో వరుస ఎన్నికలు ఉండటంతో మద్యం అమ్మకాలు భారీగా జరుగుతాయనే అంచనాతో చాలా మంది టెండర్లు వేసినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 2,620 వైన్స్ ఉన్నాయి. ఒక్కో అప్లికేషన్‌‌‌‌‌‌‌‌కు రూ.2 లక్షల ఫీజు తీసుకున్నారు. ఇది నాన్ రిఫండబుల్. 2021లో వచ్చిన అప్లికేషన్ల సంఖ్య 67,849. దీంతో ప్రభుత్వానికి అప్పట్లో రూ.1,356 కోట్లు వచ్చింది. ఇప్పుడు అప్లికేషన్ల సంఖ్య ఒకటిన్నర రెట్లు పైనే అయింది. మొత్తం లక్షా 20 వేల  అప్లికేషన్లు రాగా.. ప్రభుత్వానికి రూ.2,400 కోట్లు వచ్చింది. ఇప్పుడు దీనికి తోడు ఫస్ట్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టాల్‌‌‌‌‌‌‌‌మెంట్ కింద ఫీజు కూడా వస్తుంది. రూ.2 వేల కోట్లను కేవలం మద్యం అప్లికేషన్లతోనే రాబట్టాలని సర్కార్ ఆఫీసర్లకు టార్గెట్ పెట్టింది. కచ్చితంగా ఎక్కువ అప్లికేషన్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఒత్తిడి పెంచింది. దీంతో అధికారులు గ్రూపులుగా స్పెషల్ మీటింగ్స్ పెట్టి వైన్స్‌‌‌‌‌‌‌‌కు అప్లికేషన్లు పెరిగేలా చేశారు. ఒక్కో మద్యం దుకాణానికి సగటున 50 అప్లికేషన్లు వచ్చాయి. ఏపీ సరిహద్దు ప్రాంతాలతోపాటు, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఏపీ వ్యాపారులు భారీగా దరఖాస్తులు సమర్పించారు. సరూర్ నగర్, శంషాబాద్, నల్లగొండ, మేడ్చల్​లో ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయి.  నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో తక్కువగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

అదృష్టం ఎవరికి దక్కేనో!

ఈ నెల 21న వైన్స్‌‌‌‌‌‌‌‌ కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్కీ డ్రా తీయనుండటంతో.. తమకు అదృష్టం దక్కుతుందో లేదోనని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయా జిల్లా కేంద్రాల్లో కలెక్టర్‌‌‌‌‌‌‌‌ నేతృత్వంలో డ్రా తీస్తారు. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రా కేంద్రాలకు ఎంట్రీ పాస్‌‌‌‌‌‌‌‌ ఉన్న వారిని మాత్రమే అనుమతించనున్నారు. వైన్స్ దక్కించుకున్నోళ్లు ఈ నెల 22 వరకు లైసెన్స్ ఫీజులో ఫస్ట్ ఇన్ స్టాల్ మెంట్ చెల్లించాల్సి ఉంటుంది. నవంబర్​30 నుంచి కొత్త దుకాణాలకు స్టాక్‌‌‌‌‌‌‌‌ రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేస్తారు. డిసెంబర్ ఒకటి నుంచి కొత్త దుకాణాలు అందుబాటులోకి వస్తాయని ఇప్పటికే ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,620 వైన్స్ ఉండగా.. గౌడ్స్‌‌‌‌‌‌‌‌కు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఈ ప్రకారం గౌడ్స్‌‌‌‌‌‌‌‌కు 393, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 చొప్పున దుకాణాలు కేటాయించారు. మిగిలిన 1,864 మద్యం దుకాణాలు ఓపెన్‌‌‌‌‌‌‌‌ కేటగిరీ కింద ఉన్నాయి.

గ్రూపులుగా అప్లికేషన్లు

ఎట్లయినజేసి వైన్​ షాపులు దక్కించుకోవాలని భావించిన కొందరు.. తమ ప్రాంతాల్లో 10 మంది కలిసి రెండు, మూడు మద్యం దుకాణాలకు దరఖాస్తులు సమర్పిం చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ దగ్గరి బంధువుల చేత ఎక్కువ అప్లికేషన్లు వేయించారు. రియల్టర్లు.. ఇప్పటికే వైన్స్ నిర్వహిస్తున్నోళ్లు కూడా రకరకాలుగా అప్లికేషన్లు వేశారు. ఎక్కడో ఒక చోట అదృష్టం కలిసి వస్తుందని చాలామంది రెండు, మూడు దరఖాస్తులు వేశారు.