ఎల్ఆర్ఎస్ కు ఎస్ చెబుతారా?

ఎల్ఆర్ఎస్ కు ఎస్ చెబుతారా?
  • వనపర్తి జిల్లాలో 47,846 అప్లికేషన్లు పెండింగ్
  • పర్మిషన్​ లేని వెంచర్లలో ప్లాట్లు కొన్నవారికి తప్పని తిప్పలు
  • డిప్యూటీ సీఎం ప్రకటనతో ప్లాట్ల రెగ్యులరైజేషన్ పై ఆశలు  

వనపర్తి, వెలుగు:   పట్టణ శివారుల్లో ఎలాంటి అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్  వ్యాపారులు వేసిన వెంచర్లలో ప్లాట్లు కొన్న పేద, మధ్యతరగతి జనం తిప్పలు పడుతున్నారు. వాటిని అవసరానికి అమ్ముకోలేక, చేసిన అప్పులు తీర్చలేకపోతున్నారు. గత బీఆర్ఎస్  సర్కారు ఎల్ఆర్ఎస్ ను ప్రవేశపెట్టి ప్లాట్ల కొనుగోలుదారుల నుంచి రూ.వెయ్యి చొప్పున ఎంట్రీ ఫీజు వసూలు చేసి రూ.4.78 కోట్లు దండుకొని చేతులు దులుపుకుంది.

మూడేండ్ల పాటు కాలయాపన చేసింది. రెక్కల కష్టంతో కొన్న తమ ప్లాట్లు రెగ్యులరైజేషన్  చేసి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్  చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో జనం బేజారెత్తిపోతున్నారు. వనపర్తి జిల్లాలోని మున్సిపాలిటీలు, మేజర్  గ్రామ పంచాయతీల పరిధిలో వేలాది ప్లాట్ల ఓనర్లు గత ప్రభుత్వ తీరుపై అసంతృప్తితో ఉన్నారు.

ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్  ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం ఈ విషయాన్ని ప్రస్తావించడంతో ఊరట చెందుతున్నారు. త్వరలో ఎల్ఆర్ఎస్ లో నమోదు చేసుకున్న ప్లాట్లను రెగ్యులరైజ్​ చేస్తామని, కొంత రుసుము చెల్లిస్తే ఇంటి నిర్మాణానికి పర్మిషన్​ ఇస్తామని చెప్పారు. ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలివ్వడంతో మున్సిపాలిటీల్లో పెండింగ్ లో ఉన్న​ఫైళ్లలో కదలిక మొదలైంది.

వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన రియల్  వ్యాపారులు కనీసం నాలా కూడా చేయకుండానే ప్లాట్లుగా మార్చి జనానికి అంటగట్టారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లే అవుట్  చేయాలంటే తప్పనిసరిగా 30 ఫీట్ల రోడ్లు ఏర్పాటు చేసి, మొత్తం స్థలంలో 10 శాతం కమ్యూనిటీ అవసరాలకు వదిలేయాలి. టౌన్  ప్లానర్  అప్రూవల్ తీసుకున్న తరువాతే డీటీసీపీ లే అవుట్ గా దానిని గుర్తిస్తారు. అయితే ఇవేమి పట్టించుకోకుండా ప్లాట్లు వేసి అంటగట్టడంతో కొన్నవారు ఇబ్బందులు పడుతున్నారు.  

టౌన్  ప్లానింగ్​ ఆఫీసర్ల కరువు..

మున్సిపాలిటీల్లో సిబ్బంది కొరత ఉంది. ముఖ్యంగా టౌన్  ప్లానర్లు లేరు. వనపర్తి జిల్లాలో ఐదు మున్సిపాలిటీలుండగా ఒక్కడే అన్నింటిలో ఇన్​చార్జీగా పని చేస్తున్నారు. వెంచర్లు పట్టా భూమిలో ఉన్నాయా? ప్రభుత్వ భూమి అందులో ఉందా? చెరువుల శిఖం భూములు, చెరువులు, కుంటల ఎఫ్టీఎల్ లో ఉన్న స్థలాల్లో ప్లాట్లు ఏర్పాటు చేశారా? అనేది స్పష్టంగా గుర్తించాలి.

వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో 28,763 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా, కొత్తకోటలో 7,580, పెబ్బేరులో  7,242, ఆత్మకూరులో 3,812, అమరచింత మున్సిపాలిటీలో 449 మంది ఎల్ఆర్ఎస్​ కోసం అప్లై చేసుకున్నారు. వీటితో పాటు మరో 5 వేలకు పైగా ఎల్ఆర్ఎస్ కు అప్లై చేయని పర్మిషన్​​లేని ప్లాట్లు ఉన్నట్లు తెలుస్తోంది.

కొత్త ప్రభుత్వంపైనే ఆశలు..

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్  ప్రభుత్వం ఎల్ఆర్ఎస్  దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెబుతుండడంతో బాధితులు ఊరట చెందుతున్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఇందులోభాగంగానే మున్సిపాలిటీల్లో సిబ్బందిని పెంచడంతో పాటు కొత్త మున్సిపల్  కమిషనర్లను నియమిస్తున్నారని అంటున్నారు. మున్సిపాలిటీల్లో టౌన్  ప్లానింగ్​ ఆఫీసర్​ పోస్టులు భర్తీ చేసి ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కారించాలని బాధితులు కోరుతున్నారు.